ప్రాజెక్టుల్లో ఏటా తగ్గుతున్న నీటి నిల్వల సామర్థ్యం
112 టీఎంసీల నుంచి 80కి పడిపోయిన శ్రీరాంసాగర్
29.72 టీఎంసీల నుంచి 11కు పడిపోయిన నిజాంసాగర్
సింగూర్, కడెం, జూరాలలోనూ అదే పరిస్థితి
పేరుకు పోయిన లక్షల టన్నుల మట్టి
ఫలితంగా తగ్గిన 6 లక్షలఎకరాల ఆయకట్టు
రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టుల సామర్థ్యం క్రమంగా తగ్గుతోంది. తెలంగాణకు గుండె వంటి శ్రీరాంసాగర్ తో పాటు నిజాం సాగర్, లోయర్ మానేర్ డ్యాం, మిడ్ మానేర్ డ్యాం, కడెం, జూరాల, సింగూర్ తదితర ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున సిల్ట్ పేరుకు పోయింది. గడిచిన 100 ఏండ్ల నుంచి 20 ఏండ్ల కాలంలో నిర్మించిన ఈ ప్రాజెక్టుల్లో పేరుకు పోయిన పూడిక వల్ల దాదాపు 63 టీఎంసీలకు పైగా నీటి సామర్థ్యాన్ని రాష్ర్టం కోల్పోయింది. ఫలితంగా 6 లక్షల ఎకరాల ఆయకట్టు సాగు విస్తీర్ణం తగ్గింది. ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు పూడిక తొలగింపుపై దృష్టి పెట్టలేదు. అయితే ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ పూడిక తీతపై కసరత్తు చేస్తోంది. 2017లో కేరళలో విజయవంతమైన మంగళం ఆనకట్ట పూడిక తొలగింపు కార్యక్రమాన్ని నమూనాగా తీసుకుని ముందుకెళ్లాలని సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయించింది.
ఊరగొండ మల్లేశం
తెలంగాణలోని నీటి ప్రాజెక్టులకు పూడిక గండం పట్టుకుంది. కొత్తగా నిర్మించిన కాళేశ్వరం, ఎల్లంపల్లితో పాటు లిఫ్ట్ ఇరిగేషన్లు, ఏపీతో భాగస్వామ్యం ఉన్న నాగర్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను పక్కన పెడితే రాష్ట్రంలో 5 టీఎంసీలకు పై బడిన నీటి సామర్థ్యం కలిగిన దాదాపు 7 ప్రధాన ప్రాజెక్టుల్లో పూడిక పేరుకు పోయింది. 20 ఏండ్లకు ముందు నిర్మించిన ఈ ప్రాజెక్టుల్లో నిర్వహణ లోపం, నదీ ప్రవాహాలతో సిల్ట్ రాకుండా ముందస్తు చర్యలు చేపట్టక పోవడం తదితర కారణాల వల్ల నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోతున్నది. శ్రీరాంసాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 112 టీఎంసీలు కాగా, పూడిక తీయకపోవడంతో 80 టీఎంసీలకు పడి పోయింది. నిజాం సాగర్ పూర్తి సామర్థ్యం 29.72 టీఎంసీలు కాగా పూడిక వల్ల సగానికి పైగా తగ్గి 11 టీఎంసీలకు పడిపోయింది. కడెం 4, జూరాల 4, సింగూర్ 2, మిడ్ మానేర్ డ్యాం 2, లోయన్ మానేర్ డ్యాంలో 1 టీఎంసీ చొప్పున సిల్ట్ (మట్టి) పేరుకు పోవడం వల్ల నీటి సామర్థ్యం తగ్గింది. ఈ ప్రాజెక్టుల మొత్తం నీటి సామర్థ్యం 240 టీఎంసీలు కాగా, పూడిక తీయకపోవడం వల్ల వీటి సామర్థ్యం 180 టీఎంసీలకు పడి పోయింది. దాదాపు 63 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. 1 టీఎంసీ 10 వేల ఎకరాలు లెక్కన సగటున లెక్కిస్తే పూడిక వల్ల దాదాపు 6 లక్షల ఎకరాల ఆయకట్టు సాగు విస్తీర్ణం తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి.
ముందస్తు చర్యలు శూన్యం
ప్రాజెక్టుల్లోకి పూడిక రాకుండా ఏ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదు. నది పరివాహక ప్రాంతంలో అడవుల నరికి వేత, గనుల తవ్వకం, ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు, వంటి కారణాలతో ప్రాజెక్టుల్లో పూడిక పేరుకు పోయింది. భారీ వర్షాలు, వరదల వల్ల జరిగే నేల కోత పెద్ద మొత్తంలో సిల్ట్ ను నేరుగా ప్రాజెక్ట్ ల్లోకి తీసుకువెళుతోంది. నదులు, కొండలు, అటవీ ప్రాంతాల నుంచి మట్టి, ఇసుక, చిన్న చిన్న రాళ్లు కొట్టుకు రావడం వల్ల కూడా ప్రాజెక్ట్ ల్లో పూడిక పేరుకు పోతోంది. వాటర్ షెడ్, చెక్ డ్యాంల నిర్మాణాలు, నేల కోత నియంత్రణ చర్యలు, ప్రాజెక్టులకు నీటి ప్రవాహాన్ని అందించే నదుల కిరువైపుల అడవులను పెంచడం లాంటి చర్యలు చేపట్టాలి.
కేరళ నమూనాతో ముందుకు….
రేవంత్ రెడ్డి నేతృత్వంలో 2023లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ 20 ఏండ్లకు పైబడిన ప్రాజెక్టుల్లో పూడిక తీతపై దృష్టి పెట్టింది. దీర్ఘకాలిక వరద నియంత్రణ అవసరాలకు ఉపయోగపడే విధంగా శాస్త్రీయ నమూనాను రూపొందిస్తోంది.
ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పూడిక తొలగింపు నమూనాలను సమగ్రంగా అధ్యయనం చేసి తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయగల ఉత్తమ విధానాలను గుర్తిస్తున్నామని ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు. కేరళలో విజయవంతమైన మంగళం ఆనకట్ట పూడిక తొలగింపు కార్యక్రమాన్ని నమూనాగా తీసుకుని ముందుకెళ్లాలని సర్కార్ నిర్ణయించినట్టు సమాచారం.
ముందస్తు చర్యలు చేపట్టాలి -దొంతి నర్సింహరెడ్డి, ప్రముఖ పర్యావరణవేత్త
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల్లో పూడిక చేరకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. నదులు, కొండలు, అటవీ ప్రాంతాల నుంచి మట్టి, ఇసుక, చిన్న చిన్న రాళ్లు కొట్టుకు రాకుండా చర్యలు తీసుకోవాలి. నది పరివాహక ప్రాంతంలో అడవులను విస్తారంగా పెంచాలి. ప్రస్తుతం పూడిక వల్ల నీటి నిల్వ సామర్థ్యం కొల్పోయిన ప్రాజెక్టుల్లో అధునిక సాంకేతికతను ఉపయోగించి పూడిక తీయాలి.
ప్రాజెక్టుల్లో పూడిక కష్ట సాధ్యం
సారంపల్లి మల్లారెడ్డి, ఏఐకేఎస్ సీనియర్ నేత
ప్రాజెక్టుల్లో పూడిక తీత అనేది చాలా వ్యయంతో కూడుకున్నది. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన నీరు-మీరు, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమాలు పెద్దగా ఫలితాలు ఇవ్వలేదు. నాయకులు, కాంట్రాక్టర్లకు మేలు చేసిందే తప్ప ఆశించిన ప్రయోజనం జరగలేదు. పూడిక వల్ల తగ్గిన నీటి సామర్థ్యం, ఆయకట్టును పునరుద్దరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి.
రాష్ట్రంలోని 20 ఏండ్లకు పైబడిన ప్రాజెక్టుల్లో
పూడిక, తగ్గిన నీటి నిల్వల వివరాలు (టీఎంసీల్లో)
ప్రాజెక్టు సామర్థ్యం ప్రస్తుతం పూడిక తగ్గుదల (లక్షల టన్నులు)
ఎస్ఆర్ఎస్పీ 112 80 8 మీటర్లు 32
నిజాం సాగర్ 29.72 11.72 6,590 18
కడెంరు 7.63 3.63 1,317 4
జూరాల 11.94 7.94 840 4
మిడ్ మానేరు 25.87 23.87 247 2
సింగూర్ 29.92 27.92 272 2
లోయర్ మానేరు 24.02 23.02 131 1
………………………………………………………………………….
మొత్తం 241.1 178.1 — 63
………………………………………………………………………….



