15 గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధుల డిమాండ్
డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట నిరసన
సీపీఐ(ఎం), బీఆర్ఎస్, పలు రాజకీయ పార్టీల నాయకుల మద్దతు
కలెక్టరేట్ లోకి దూసుకెళ్లిన నిరసనకారులు.. అడ్డుకున్న పోలీసులు
జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డికి వినతి
నవతెలంగాణ – రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
‘డంపింగ్ యార్డ్‌ను రద్దు చేయాలి, ఈ ప్రాంత ప్రజలను కాపాడాలి.. గో బ్యాక్ డంపింగ్ యార్డు’ అంటూ బాధితులు ఆందోళన బాట పట్టారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బండరావిరాల గ్రామ పరిధిలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డు (ఎకో టౌన్ ప్రాజెక్టు)కు వ్యతిరేకంగా సోమవారం బండరావిరాల గ్రామ సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు 15 గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో తరలివచ్చి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా ప్రజలు డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. ఈ ఆందోళనకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు మద్దతు తెలిపారు. బీఆర్‌ఎస్, సీపీఐ(ఎం), సీపీఐ తదితర పార్టీలకు చెందిన స్థానిక నాయకులు రాజకీయాలకు అతీతంగా ప్రజల పక్షాన నిలిచారు. కాగా, నిరసనకారులు ఒక్కసారిగా కలెక్టర్ కార్యాలయం లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా నిరసన కారులు కలెక్టరేట్‌లోకి ప్రవేశించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి పిలుపుతో నిరసనకారుల బృందం ఆయనకు వినతి పత్రం అందజేసి, తమ సమస్యను విన్నవించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, పార్టీ నాయకులు క్యామా మల్లేష్, కమ్యూనిస్టు పార్టీల నాయకులు మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే డంపింగ్ యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే వేలాది మంది ప్రజలతో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం సరికాదన్నారు. బండరావిరాల, చిన్నరావిరాల, పిల్లాయిపల్లి, బాచారం, పెద్దగూడెం తదితర గ్రామాల ప్రజలు ఇప్పటికే మూసీ కాలుష్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పుడు మరోసారి డంపింగ్ యార్డు భారాన్ని మోపడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్ జోన్ కారణంగా నష్టపోయిన బాధితులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నరావిరాల సర్పంచ్ పబ్బత్ బాలకిషన్ గౌడ్, పిల్లాయిపల్లి సర్పంచ్ పెరుమాళ్ల మహాలక్ష్మి దానయ్య, దేశముఖి సర్పంచ్ దుర్గం జంగయ్య యాదవ్, జగత్‌పల్లి సర్పంచ్ ఇట్టమోని మహేష్ యాదవ్, పెద్దగూడెం సర్పంచ్ నర్సిరెడ్డి, కవాడిపల్లి సర్పంచ్ కొలను ప్రసన్నలక్ష్మి రవీందర్ రెడ్డి, బలిజగూడ సర్పంచ్ కొప్పు మాధవి నవీన్, మాజీ సర్పంచ్‌లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
గో బ్యాక్ డంపింగ్ యార్డ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



