Tuesday, June 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంభవిష్యత్ అవసరాలకనుగుణంగా ప్రాజెక్టులు

భవిష్యత్ అవసరాలకనుగుణంగా ప్రాజెక్టులు

- Advertisement -

​జలమండలి ఎండీ అశోక్ రెడ్డి
​గోదావరి ఫేజ్-2 , 3, నియోపోలీస్ ప్రాజెక్టు పనుల పరిశీలన
నవతెలంగాణ-సిటీబ్యూరో

హైదరాబాద్‌‌లో జలమండలి పరిధి క్యూర్ వరకు విస్తరిస్తుండగా భవిష్యత్ తాగునీటి అవసరాలకనుగుణంగా ప్రాజెక్టులను ప్రణాళికాబద్ధంగా నిర్మాణం చేపట్టాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి ఫేజ్-2 అండ్‌ 3 ప్రాజెక్టులు, నియోపోలీస్ సమగ్ర మంచినీటి సరఫరా ప్రాజెక్టు పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ముందుగా ఖానాపూర్‌లో గోదావరి ఫేజ్-2 అండ్‌ 3 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ (డబ్ల్యూటీపీ) పనుల పురోగతిని సమీక్షించి, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నియోపోలీస్ సమగ్ర మంచినీటి సరఫరా కోసం ప్రతిపాదించిన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పంపింగ్ స్టేషన్, డబ్ల్యూటీపీ నిర్మాణ పనులపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి సరఫరా మౌలిక వసతులకు తగిన స్థలం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నియోపోలీస్ ప్రాంతంలో నిర్మిస్తున్న రెండు 2.5 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల ద్వారా గ్రావిటీ పద్ధతిలో ఏయే ప్రాంతాలకు నీటి సరఫరా చేయొచ్చో సమీక్షించారు. భూమి విలువ అధికంగా ఉన్న నేపథ్యంలో, భవిష్యత్ విస్తరణను దృష్టిలో ఉంచుకుని రిజర్వాయర్లను బహుళ అంతస్తుల నిర్మాణ నమూనాలో రూపొందించే అవకాశాలను సాంకేతికంగా పరిశీలించాలని అన్నారు. ప్రస్తుతం అవసరమైన నిర్మాణ ప్రొవిజన్ మాత్రమే కల్పించి, భవిష్యత్ విస్తరణను ప్రత్యేక టెండర్ల ద్వారా చేపట్టే విధానంపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని చెప్పారు. ప్రధాన పైప్‌లైన్‌ల అనుసంధానం, గ్రావిటీ ఆధారిత నీటి ప్రవాహం, రోడ్డు పనులకు అంతరాయం కలగకుండా ముందస్తు పైప్‌లైన్ ప్రొవిజన్లు, కనీసం ఒక రోజు అవసరానికి సరిపడే రన్నింగ్ స్టోరేజ్ ఏర్పాటు వంటి అంశాలపై సమగ్ర సాంకేతిక అధ్యయనం నిర్వహించాలని ఆదేశించారు. నగర తాగునీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉండేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ అంశాలపై కన్సల్టింగ్ ద్వారా సాంకేతిక సాధ్యాసాధ్యాలపై అధ్యయనం నిర్వహించి సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. ఇప్పటికే ఉన్న రింగ్ మెయిన్ నెట్‌వర్క్ ను సమర్థవంతంగా వినియోగించి నీటి కొరత ఉన్న ప్రాంతాలకు ప్రత్యామ్నాయంగా తాగునీరు సరఫరా చేసే అవకాశాలను కూడా పరిశీలించాలని సూచించారు.
హెచ్‌ఎండీఏ అధికారులతో కలిసి ఖానాపూర్ సమీపంలో ప్రతిపాదిత రహదారి నిర్మాణానికి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 1200 ఎంఎం డయా తాగునీటి పైప్‌లైన్ షిఫ్టింగ్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జలమండలి ప్రాజెక్ట్‌ డైరెక్టర్ సుదర్శన్, సీజీఎం రాజశేఖర్, జనరల్ మేనేజర్లు, హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, సైట్ ఇంజినీర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -