ఆలయ ప్రవేశాలపై ఆంక్షలు, ఇంటి అద్దెల్లో ఆంక్షల బోర్డులు
కుల దురహంకారంతో హత్యలు
స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రి బండి సంజయ్ మౌనంపై విమర్శలు
వేళ్లూనుకున్న కుల జాఢ్యంపై ‘నవతెలంగాణ’ ప్రత్యేక కథనం
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఆధునిక ప్రపంచంలో.. చేతిలోని మొబైల్‌లో ఒక్క బటన్ నొక్కితే ప్రపంచమంతా కండ్ల ముందు సాక్షాత్కరించే టెక్నాలజీలో ఉన్నాం. కానీ, మనుషుల మనసుల్లో మాత్రం ఇంకా చీకటి మాయలా అల్లుకున్న కులాల పిచ్చి, వివక్ష రూపాలు వీడటం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటీవల వరుస ఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. బోనాల పండుగ వేళ దళిత మహిళలను గుడిలోకి రానివ్వకుండా గేట్లకు తాళాలు వేయడం, నడి ఎండలో పడిగాపులు కాయించడం, పట్టణాల్లో ‘ఎస్సీ, ఎస్టీలకు ఇల్లు కిరాయికి ఇవ్వబడదు’ అని బహిరంగంగా బోర్డులు పెట్టడం, కులం పేరిట ప్రేమికులను నరికి చంపడం వంటి అమానుషాలు తీవ్ర వివక్షకు అద్దం పడుతున్నాయి. ఇలాంటి అమానుషాలపై పాలకులు మౌనం వహించడం ఈ వివక్షకు మరింత ఆజ్యం పోస్తున్న వైనంపై ‘నవతెలంగాణ’ ప్రత్యేక కథనం.
గత నెలలో పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో రేణుకా ఎల్లమ్మతల్లి ఉత్సవాల సందర్భంగా బోనాలతో మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చిన దళిత మహిళలను బీసీ సామాజిక తరగతికి చెందిన కొందరు అడ్డుకున్నారు. దళితులు తమతో సమానంగా గుడిలోకి రావొద్దంటూ ఆలయం గేటుకు తాళం వేశారు. దళిత మహిళలు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నడి ఎండలో బోనాలతో నిలబడాల్సి వచ్చింది. సరిగ్గా వారం కిందట కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలోనూ ఎల్లమ్మ బోనాల పండుగ వేళ వివక్ష బయటపడింది. కులదైవమైన మాతమ్మకు బోనాలు సమర్పించి ఆనవాయితీ ప్రకారం ఎల్లమ్మ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి వెళ్లిన దళిత మహిళా శివసత్తులను చేతులు అడ్డుపెట్టి నెట్టేశారు. కులం పేరుతో దూషించారు. ఇలాంటి ఘటనలూ తరచూ ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి.
పట్టణాల్లోనూ ‘కుల పిచ్చి’ బోర్డులు
కుల వివక్ష కేవలం గ్రామాల్లోనే కాదు.. చదువుకున్న విద్యావంతులు ఉండే కరీంనగర్ జిల్లా కేంద్రంలోనూ తీవ్రరూపం దాల్చింది. కరీంనగర్ నగరంలోని కిసాన్ నగర్‌లో కొందరు ఇంటి యజమానులు తమ ఇండ్లకు పెట్టిన ‘టు లెట్’ బోర్డులపై ‘కేవలం హిందువులకు మాత్రమే.. ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వం’అని బహిరంగంగా రాయడం కలకలం రేపింది. ఎస్సీ, ఎస్టీలు కూడా హిందూ సమాజంలో భాగమే అయినప్పటికీ, ఇలా బోర్డులు పెట్టి మరీ వివక్ష చూపడం రాజ్యాంగ స్ఫూర్తిని అవమానించడమే. ప్రభుత్వం ప్రతి నెలా పౌరహక్కుల దినం జరుపుతున్నా, ఇలాంటి చర్యలు క్షేత్రస్థాయిలో కాగితాలకే పరిమితమవుతున్నాయని దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కులాంతర ప్రేమలు.. హత్యలు, ఆత్మహత్యలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉత్తరాది తరహా ‘కుల దురహంకార హత్యల’ కల్చర్ పెరుగుతోంది. వేర్వేరు కులాల యువతీయువకులు ప్రేమించుకుంటే దాడులు చేయడం, చంపే వరకు వెళ్లడం సామాజిక అంతరాలకు అద్దం పడుతోంది. ఈ ఏడాది మార్చిలో పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటకు చెందిన సాయికుమార్ అనే యువకున్ని.. తన కూతురిని ప్రేమిస్తున్నాడనే కారణంతో ముత్యం సదయ్య అనే వ్యక్తి గొడ్డలితో నరికి చంపడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేవలం కుల దురహంకారమే ఈ హత్యకు కారణం. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటకు చెందిన యువకుడు, చొప్పదండికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెద్దలు తమ ప్రేమను అంగీకరించరనే భయంతో ఒకరు ఉరేసుకోగా.. మరొకరు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటనలు సామాజిక కట్టుబాట్ల క్రూరత్వాన్ని తెలియజేస్తున్నాయి. కులదురహంకార హత్యగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన 2017లో మంథనిలో దళిత యువకుడు మధుకర్ అనుమానాస్పద మృతి కేసు ఇప్పటికీ దళిత సమాజంలో ఒక మాయని గాయంగానే మిగిలిపోయింది. 2016లో తిమ్మాపూర్‌లోని ఆలయంలో పెళ్లి పీటలపై ఉన్న జంటపై దాడి చేసి, పెళ్లికూతురు కండ్లముందే పెండ్లి కొడుకును పొడిచి చంపిన ఉదంతాలు ఈ ప్రాంతంలో కుల అహంకారం ఎంత క్రూరంగా వేళ్లూనుకుందో చెప్తున్నాయి.
ఎందుకీ మౌనం?
సమాజంలో ఇంతటి అరాచకాలు, వివక్ష రూపాలు బయటపడుతున్నా, బాధితులకు అండగా నిలవాల్సిన రాజకీయ నాయకులు మౌన వ్రతం వహించడం విమర్శలకు తావిస్తోంది. ముఖ్యంగా తన సొంత నియోజకవర్గంలో దళిత మహిళలను గుడిలోకి రానివ్వకుండా గేట్లకు తాళాలు వేసినా, ‘ఎస్సీ, ఎస్టీలకు ఇల్లు ఇవ్వం’ అని బోర్డులు పెట్టినా, కులం పేరుతో దళిత యువకులను నరికి చంపుతున్నా ఎక్కడా ఎప్పుడూ స్పందించకపోవడం గమనార్హం. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కుమార్‌తో పాటు స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఆలోచనా తీరు మారాలి
ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, సోషియాలజీ విభాగం అధిపతి, శాతవాహన వర్సిటీ
కుల, మత అసమానతలు పోవాలి. ఘటన జరిగినప్పుడు రెండు కులాల మధ్య గొడవగా చూస్తున్నారు. కానీ ఇది సామాజిక సమస్య. సమా జంలో అనేక మార్పు లు చోటుచేసుకుంటున్నా. కుల, మత భేదాలు గ్రామాల్లో అలాగే కొనసాగుతున్నాయి. టెక్నాలజీలో ఎంతో ముందున్న మనం ఆధునికంగా ఆలోచించ లేకపోతున్నాం. కుల వివక్షపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కలిగించేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి. కులమనే ఆలోచనా తీరు మారితేనే సమాజంలో ఇలాంటి విపరీత ధోరణులు మారుతాయి.
అవగాహన కల్పించాలి
తిప్పారపు సురేష్ , కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి
కులం అహంకారంతో జరిగే దారుణాలతో విలువైన ప్రాణాలు పోతున్నాయి. ఉన్నత చదువులు చదువుకునే యువత కూడా ప్రేమించుకోవడం, పెద్దలు కాదన్నారని ప్రాణం తీసుకోవడం లేదా పెద్దలు పిల్లలను చంపడం తగదు. ప్రభుత్వాలు కులాల ఆధారంగా ప్రవేశపెడుతున్న పథకాలు కూడా ప్రజల మధ్య దూరాలను మరింత పెంచుతున్నాయి. కులవివక్షపై ప్రజలకు అవగాహన కలిగించేలా ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది.’
‘బుసలు’ కొడుతున్న కులవివక్ష
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



