రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ కాజీపేట, జనగామ, చర్లపల్లి స్టేషన్లలో విస్తృత తనిఖీలు
‘కవచ్ 4.0’ అమలు తీరుపై ఇరిసెట్లో సమీక్ష
సీఆర్బీకి వినతిపత్రం సమర్పించిన తెలంగాణ రైల్వే జేఏసీ
మర్యాదపూర్వకంగా కలిసిన హనుమకొండ కలెక్టర్
నవతెలంగాణ – కాజీపేట
రైల్వే బోర్డు చైర్మన్, ముఖ్య కార్యనిర్వాహణాధికారి(సీఈఓ) సతీష్‌కుమార్ ఆదివారం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. కాజీపేటలోని రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్(ఆర్ఎమ్j), జనగామ అమృత్ స్టేషన్, చర్లపల్లి టెర్మినల్ సికింద్రాబాద్‌లోని ఇరిసెట్ సంస్థలను ఆయన సందర్శించారు. ఈ తనిఖీల్లో ఆయనతో పాటు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్(జీఎం) సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎమ్) డాక్టర్ ఆర్.గోపాలకృష్ణన్, ఇతర సీనియర్ రైల్వే అధికారులు పాల్గొన్నారు. కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి తనిఖీ ప్రారంభించిన చైర్మన్, అక్కడ పురోగతిలో ఉన్న అమృత్ స్టేషన్ పనులను, ప్రయాణికుల సౌకర్యాలను పరిశీలిం చారు. అనంతరం కాజీపేటలో రూ.597.68 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను సందర్శించారు. ఆధునిక రోలింగ్ స్టాక్, నెక్స్ట్-జెన్ రైల్వే కోచ్‌ల తయారీ కోసం నిర్మిస్తున్న ఈ ప్లాంట్ భౌగోళిక స్వరూపాన్ని ఆర్‌విఎన్‌ఎల్ అధికారులు మినియేచర్ మోడల్ ద్వారా వివరించారు. మెయిన్ షెడ్, బోగీ షాప్, పెయింట్ షాప్, వీల్ షాప్, టెస్టింగ్ షాప్‌లను సతీష్ కుమార్ స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్ఎమ్j పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ యూనిట్ అందుబాటులోకి వస్తే అత్యాధునిక కోచ్‌ల తయారీతో పాటు ఈ ప్రాంతానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.
జనగాం, చర్లపల్లి టెర్మినల్ తనిఖీ
కాజీపేట నుంచి చర్లపల్లి మార్గమధ్యంలో జనగాం రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేసి పునరాభివృద్ధి పనులను సమీక్షించారు. చర్లపల్లి రైల్వే స్టేషన్లో కొత్త రైలు టెర్మినల్‌లోని ట్రాక్‌లు, పాయింట్లు, క్రాసింగ్‌లు, యార్డ్‌ను పరిశీలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాక్‌మెన్, గ్యాంగ్‌మెన్‌లతో మాట్లాడి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగల్ ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను సందర్శించిన చైర్మన్, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యాంటీ-కొలిజన్ సిస్టమ్ ‘కవచ్ 4.0’ అమలు తీరుపై అధికారులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్షించారు. అనంతరం రైల్ నిలయంలో ఎస్సీఆర్ అధికారులతో జోన్ సాధారణ పనితీరుపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
మర్యాదపూర్వకంగా చైర్మెన్‌ను కలిసిన కలెక్టర్
రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్‌ను హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందించి స్వాగతం పలికారు. జిల్లాలో కొనసాగుతున్న రైల్వే అభివృద్ధి పనులు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రగతి, మౌలిక వసతుల విస్తరణపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రైల్వే ఉన్నతాధికారులతో పాటు ఆర్డీఓ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
సీఆర్బీకి రైల్వే జేఏసీ వినతిపత్రం
కాజీపేట పర్యటనకు వచ్చిన రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్‌కు తెలంగాణ రైల్వే జేఏసీ కమిటీ ప్రతినిధులు పలు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగులకు, అయోధ్యపురం భూ నిర్వాసితులకు, యాక్ట్ అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన వారికి, రిటైర్డ్ ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు. 40ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటును పూర్తి చేయాలని కోరారు. స్పందించిన చైర్మన్ డివిజన్ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని, ఉద్యోగాల భర్తీ విషయంలో రైల్వే నిబంధనల ప్రకారమే నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ కొండ్ర నర్సింగారావు, వైస్ చైర్మన్లు పాక వేదప్రకాష్, వి. తిరుపతి, కో-కన్వీనర్లు పి. రమేష్, జి. భాస్కర్, ఎస్. రమేష్ కుమార్ పాల్గొన్నారు.



