Monday, July 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంహైటెక్‌ హంగులతో ''ముంచాడు''

హైటెక్‌ హంగులతో ”ముంచాడు”

- Advertisement -

​రూ.6 వేల కోట్ల స్కామ్‌]
దేశవ్యాప్తంగా వేలల్లో బాధితులు

కూకట్‌పల్లి, కొండాపూర్‌లో హైటెక్‌ హంగులతో కార్యాలయాలు
వేల మందిని ముంచి గుజరాత్‌లో చిక్కిన నిందితుడు
షేర్స్‌ బజార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
ఎండీ అరెస్ట్‌ బాధితుల్లో 1500 మంది తెలుగువారే


నవతెలంగాణ – మరిపెడ
”రూ.లక్ష పెట్టుబడి పెట్టండి. సంవత్సరానికి 48 శాతం వడ్డీ చెల్లిస్తాం. కంపెనీలో వాటాలు సైతం ఇస్తాం” అంటూ దేశవ్యాప్తంగా వేల మందిని ముంచిన షేర్స్‌ బజార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, కిసాన్‌ పరివార్‌ లిమిటెడ్‌ సంస్థల వ్యవస్థాపకుడు నేనావత్‌ భూపాల్‌ నాయక్‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఈ రెండు కంపెనీల పేరుతో నిందితుడు దేశ వ్యాప్తంగా దాదాపు 6 వేల మందిని మోసగిం చినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. బాధితుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే 1500 మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది.

హైటెక్‌ హంగులతో కార్యాలయాలు
మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం కందికొండలో కిసాన్‌ పరివార్‌ వ్యవసాయ క్షేత్రంతో మహబూబాబాద్‌ జిల్లా ప్రజలకు సుపరిచితునిగా మారిన నేనావత్‌ భూపాల్‌ నాయక్‌ షేర్‌ మార్కెట్‌ ఎనలిస్ట్‌గా చేసేవాడు. తక్కువ వ్యవధిలో డబ్బు సంపాదించాలని పథకం వేసిన అతను, 2020లో షేర్స్‌ బజార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, కిసాన్‌ పరివార్‌ లిమిటెడ్‌ పేరుతో రెండు సంస్థలను ఏర్పాటు చేశాడు. కూకట్‌పల్లి, కొండాపూర్‌లో దాదాపు 30 మంది ఉద్యోగులు, హైటెక్‌ హంగులతో కార్యాలయాలను ఏర్పాటు చేశాడు. ఎస్బీపీఎల్‌ సంస్థ ద్వారా స్టాక్‌ ట్రేడింగ్‌ చేస్తామని, సెబీలోనూ రిజిస్టర్‌ అయిందని ఆన్‌లైన్‌తో పాటు వేర్వేరు మార్గాల్లో ప్రచారం చేసేవాడు.

ప్రకృతి వ్యవసాయం అంటూ ప్రచారం
కిసాన్‌ పరివార్‌ లిమిటెడ్‌ సంస్థ రైతుల నుంచి భూములు సమీకరించి, ప్రకృతి వ్యవసాయం చేస్తోందని ప్రచారం చేసేవాడు. ఇదంతా నమ్మి ఎవరైనా ముందుకొస్తే కొన్ని పథకాల గురించి వివరించేవారు. ప్లాన్‌ ఏ కింద పెట్టుబడికి 18 శాతం లాభం, ప్లాన్‌ బీ కింద 30 శాతం, ప్లాన్‌ సీ కింద 48 శాతం చొప్పున వార్షిక లాభం ఉంటుందని ప్రచారం చేశారు. ఒకవేళ 12.5 లక్షల పెట్టుబడి పెడితే 5 గుంటల భూమి రిజిస్ట్రేషన్‌ చేసి, 24 శాతం చొప్పున లాభం ఇస్తామని నమ్మించారు. ఇది నమ్మి వందలాది మంది బాధితులు రూ.కోట్లలో డబ్బు బదిలీ చేశారు. కొందరు బంగారం, పొలాలు అమ్మి రూ.కోటికి పైగా పెట్టుబడులు పెట్టారు. సంస్థ ప్రతినిధులు కొద్ది నెలలు లాభాలు ఇచ్చినా గతేడాది సెప్టెంబరు నుంచి చెల్లింపులు ఆపేశారు. బాధితులు డబ్బు గురించి అడిగితే కొంత ఆలస్యంగా ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత పత్తాలేకుండా పోవడంతో బాధితులు మోసపోయినట్లు గుర్తించారు.

ఈవోడబ్ల్యూ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు
మోలకు చెందిన విశ్రాంత నేవీ అధికారి సంజీవ్‌ గుప్తా సహా మరో 10 మంది భూపాల్‌ నాయక్‌ మాటలు నమ్మి ఈ రెండు సంస్థల్లో రూ.4.51 కోట్ల పెట్టుబడులు పెట్టారు. బాధితుల ఫిర్యాదుతో సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ పోలీస్‌ స్టేషన్‌లో జూన్‌ 15న కేసు నమోదు చేశారు. నిందితుడు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మోసాలు చేసినట్టు పోలీసులు అనుమానించారు. గుజరాత్‌లో కేసు నమోదు కాగా, భూపాల్‌ పారిపోయే అవకాశముందని భావించి లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. నింధితుడు 10 రోజుల కిందట శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నించే సమయంలో గుజరాత్‌ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఈ సమాచారం అందుకున్న సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ పోలీసులు పీటీ వారెంట్‌ మీద భూపాల్‌ను హైదరాబాద్‌కు తీసుకువచ్చి నిందితుడిని రిమాండ్‌ చేశారు. ఈ మోసంలో భూపాల్‌కు మరికొందరు సహకరించినట్టు బాధితులు తెలిపారు.

కిసాన్‌ పరివార్‌ పేరుతో జిల్లాలో ప్రచార కార్యక్రమాలు !
ప్రధాన నిందితుడు భూపాల్‌ నాయక్‌ మహబూబాబాద్‌ జిల్లాలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. 2023 శాసనసభ ఎన్నికల్లో ఎస్టీ రిజర్వ్‌ స్థానం డోర్నకల్‌ నుంచి పోటీ చేస్తానంటూ హంగామా చేశాడు. కాంగ్రెస్‌ పార్టీ తరపున బరిలో ఉంటానని ప్రయత్నాలు చేశాడు. లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ ప్రజలు, మీడియా దృష్టిని ఆకర్షించాడు. కాంగ్రెస్‌ ‌పార్టీ పట్టించుకో కపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ ‌వేసినా అది స్క్రూటినీలోనే పోయింది. కిసాన్‌ పరివార్‌ పేరుతో కొన్ని ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మండల స్థాయి ఏజెంట్లను నియమించుకున్నాడు. నియోజక వర్గంలో బైక్‌లు, ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేశాడు. గ్రామాల్లో మంచి నీటి కోసం బోర్లు తవ్వడం, విద్యార్థులకు బస్‌పాస్‌లు, ఆర్థిక సహాయాలు చేస్తూ వార్తల్లో నిలిచాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -