Wednesday, July 8, 2026
E-PAPER
Homeఎడిట్ పేజివిద్యుత్‌ సంస్థలపై ప్రయివేటు పడగ

విద్యుత్‌ సంస్థలపై ప్రయివేటు పడగ

- Advertisement -

ప్రభుత్వరంగ విద్యుత్ సంస్థలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రయివేటీకరణ విధానాల నీడ మరింత ముసురుతోంది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లోని కీలక విభాగాలను ప్రయివేటు సంస్థలకు అప్పగించే చర్యలు, ‘రైతు డిస్కం’ ఏర్పాటు ప్రయత్నాలు, మరోవైపు కేంద్రం తీసుకొచ్చిన 2025 విద్యుత్ సవరణ బిల్లు కలిసి తెలంగాణ విద్యుత్ రంగ భవిష్యత్తుపై ఆందోళనలు పెంచుతున్నాయి. ప్రధాని మోడీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ బిల్లు ఆమోదం పొందితే విద్యుత్ రంగం పూర్తిగా ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదముంది. ఇప్పటికే తెలంగాణ విద్యుత్ సంస్థలను ప్రయివేటీకరిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చాలా వేగంగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇది గమనించిన తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్లు జేఏసీగా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా గత పది రోజులుగా నిరసన తెలుపుతున్నారు. విద్యుత్ రంగ సంస్థలు ప్రయివేటీకరణ కాకుండా అడ్డు కుంటేనే స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.
​ రాష్ట్రంలో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లోని స్టేజ్ 1, 2 యూనిట్లకు సంబంధించి కూల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్, ఆపరేషన్ మెయింటెనెన్స్, మెకానికల్ ఎలక్ట్రికల్ పనులను ప్రయివేటు సంస్థకు అప్పగించేందుకు జెన్కో టెండర్లు పిలిచింది.

ఈ జనవరి నుంచి ఇప్పటివరకు పరిణామాలను చూస్తే.. ‘రైతు పవర్ విస్కం’ పేరుతో ఒక కొత్త డిస్కం ఏర్పాటు చేయడానికి కావాల్సినవి సిద్ధం చేసుకుని, వీటి లైసెన్స్ కోసం ఈఆర్‌సీలో బహిరంగంగా విచారణ కూడా పూర్తిచేసింది. ఇక లైసెన్స్ ఇవ్వడం ఆలస్యంగా మారిం దంటూ రైతు డిస్కం, ఇటు వైటీపీఎస్‌లో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా 2003 విద్యుత్ చట్టంలో భాగంగా మన విద్యుత్ సంస్థలు ప్రయివేటీకరణ అనివార్యం అయిపోయింది. ఈ ప్లాంట్ నిర్మించి ఏడాది కాకముందే ప్రయివేటీకరణ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. 2025 ఆగస్టులో ఉత్పత్తి ప్రారంభించిన ఈ సంస్థ మన డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క గత ఆగస్టు నెలలో జాతికి అంకితం చేశారు. 2,800 ఎకరాల్లో నిర్మించిన పవర్ ప్లాంట్ దేశంలోనే అతి పెద్ద పవర్ ప్లాంట్‌లో రెండవది. అత్యధికంగా గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాలను ప్రభుత్వం ఆక్రమించి అటవీ భూములతో పాటు రైతులు తమ భూములు, ఇండ్లను కూడా కోల్పోయి భూములిచ్చారు. దాంతో సుమారు రూ.30 నుంచి 35 వేల కోట్లతో నిర్మించిన ఈ ప్లాంట్ ఏడాది తిరగకముందే స్టేజీ 1, 2 లను ప్రయివేటు కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతుంది. ఈ ప్లాంట్ నిర్మాణం కోసం భూములిచ్చిన రైతు కుటుంబ సభ్యులకు, ఇండ్లు కోల్పోయిన పేదలకు పూర్తిస్థాయిలో ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. జెన్కో నిర్మాణం కోసం భూములిస్తే సర్కారు నౌకరి వస్తుందని ఆశతో ఖరీదైన భూములను త్యాగం చేశారు. ప్రస్తుతానికి ప్రయివేట్‌కి ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది. దీనిని ఐక్యంగా ఎదుర్కోలేకపోతే మిగిలిన 3, 4, 5 స్టేజీలు కూడా టెండర్లు పిలిచే అవకాశం ఉంది.

అలాగే 2014 సంవత్సరంలో ఎన్డీఏ నాయకత్వంలో మోడీ.. ప్రధానమంత్రి అయినప్పటి నుంచి స్వదేశీ పెట్టుబడిదారుల కన్ను విద్యుత్ సంస్థలపై పడింది. వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తయారైన 2003 విద్యుత్ చట్టంలోని ప్రయివేట్ పెట్టుబడుదాలకు కావాల్సినన్ని ప్రయోజనాలు కల్పించారు. అయినప్పటికీ పెట్టుబడిదారులకు సంతృప్తి కలుగలేదు. అనేక సవరణలతో విద్యుత్ సంస్థలను వాడుకొని అధిక లాభాలు సంపాదించాలనే కోరిక పెట్టుబడిదారులకు ఉన్నట్టు తెలుస్తుంది. ఉదాహరణకు బీఎస్‌ఎ‌న్‌ఎల్ టవర్లపై రిలయన్స్ నెట్‌వర్క్ మాదిరిగా మన నెట్‌వర్క్‌ను వాడుకొని కేవలం బిల్లింగ్ చార్జీలు మాత్రమే విద్యుత్ సంస్థ లకు చెల్లిస్తారు. ఉదయ్ ఆదిత్య, ఆర్డీఎ‌స్‌ఎస్ అనే పేర్లతో కొత్త కొత్త ప్రతిపాదనలు ముందుకు తెస్తూ రాష్ట్ర డిస్కమ్‌లకు ఆర్థిక సాయం చేస్తామని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను ప్రలోభాలకు గురిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం చేసే ప్రయత్నాలను వ్యతిరేకించకుండా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం ఆదేశాలను ఆచరణలో పెడుతోంది. దీనిలో భాగమే మన తెలంగాణ రైతు డిస్కం, వైటీపీఎస్ స్టేజీ 1, 2లో జరిగే ప్రయివేటీకరణ ప్రయత్నాలు. కేంద్ర ప్రభుత్వం చేసే ప్రయోగాలతో రాబోయే ఐదేండ్లల్లో సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీలు పూర్తిగా రద్దు చేయాలని కూడా 2025 విద్యుత్ సవరణ బిల్లులో స్పష్టంగా ఉన్నాయి.

2003 విద్యుత్ చట్టంలో ప్రయివేటు కంపెనీలు డిస్ట్రిబ్యూషన్ చేయాలనుకుంటే నెట్‌వర్క్ వారు ఏర్పాటు చేసుకోవాలని ఉంది. కానీ, 2025 విద్యుత్ సవరణ బిల్లులో విద్యుత్ సంస్థలకు ఉన్న నెట్‌వర్క్‌నే షేర్ చేసుకో వచ్చని సవరణలో పెట్టారు. అంటే కంటెంట్ చర్యలు సిస్టం అమల్లోకి రాబోతుందని స్పష్టమవుతుంది. 2003 విద్యుత్ చట్టంలో జనరేటింగ్ స్టేషన్ పెట్టుకోవడానికి లైసెన్స్ తీసుకోవాల్సిన పనిలేదు. కాబట్టి ప్రయివేటు ఉత్పత్తి చేసిన కరెంట్‌ను మన నెట్‌వర్క్‌లోకి వస్తే గ్రిడ్డు ప్రమాదంలో పడుతుంది. కాబట్టి ప్రయివేటు ఉత్పత్తి చేసే విద్యుత్‌ను మన లైసెన్స్ మీదకు రావడం వల్ల మన జనరేటింగ్ స్టేషన్‌లో ఉత్పత్తి చేసే విద్యుత్ తగ్గిస్తున్నారు లేదా ఆపేస్తున్నారు. ఇదే చట్టంలో సంప్రదాయత ఇంధనం సోలార్, గాలి, చెత్తతో తయారయ్యే విద్యుత్ 25శాతం వరకు ఉండాలనేది 2003 చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి డిస్కమ్‌లను ప్రయివేటీకరించే పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రయివేటీకరణ విధానాలను అడ్డుకోవాలి. లేదంటే భవిష్యత్తులో ఈ విద్యుత్‌ ‌భారాన్ని ప్రజలే భరించాల్సి వస్తుంది.
రాళ్లబండి కృష్ణమూర్తి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -