విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్‌షిప్‌లను నెలల తరబడి పెండింగ్‌లో పెట్టి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయకుండా చదువునే సంక్షోభంలోకి నెట్టేస్తూ, మరోవైపు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీలివ్వడం, జాబ్‌క్యాలెండర్ ద్వారా ఖాళీలను భర్తీచేస్తామనడం ఎంతవరకు విశ్వసనీయం? చదువుతున్న యువతకు కనీస భరోసా కల్పించలేని పాలన, చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కల్పిస్తామనడం నమ్మశక్యమేనా? ఎందుకంటే, రాష్ట్రంలో గత కొంతకాలంగా స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు తీవ్రమైన సమస్యగా మారాయి. విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా ఆశించిన ఫలితం లేదు. ఈ సమస్య గళ్లీ నిరసనల నుంచి న్యాయస్థానాల వరకు వెళ్లడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పెండింగ్ బకాయిల విడుదల కోసం విద్యార్థి సంఘాలు ఇటీవల అన్ని జిల్లాల్లో ఆందోళనలు చేపట్టగా పోలీస్ యంత్రాంగం వాటిని అణగదొక్కేందుకు చూసింది. కొంతమంది అరెస్టు, మరికొంత మందిని బైండోవర్ కూడా చేసింది. అయితే విద్యార్థుల ఉద్యమాన్ని అడ్డుకోవడంలో ఉన్న చిత్తశుద్ధి బకాయిలు చెల్లించడంలో లేకపోవడం ఇక్కడ విచారించాల్సిన అంశం.
స్కాలర్‌షిప్ అనగానే పాలకులు దాన్ని పెద్ద ఆర్థిక గుదిబండలా చూడటమే అసలు సమస్య. పేద విద్యార్థికి స్కాలర్‌షిప్ అనేది దానం కాదు, అది రాజ్యాంగ బద్ధమైన సామాజిక బాధ్యత. ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా సంక్షేమ పథకం కాదు, ఉన్నత విద్యకు ఆర్థిక అడ్డంకులు తొలగించే సాధనం. వాటిలో జాప్యమంటే వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టడమే అవుతుంది. ఇప్పటికే ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్‌ల జాప్యంపై తెలంగాణ హైకోర్టు పలుమార్లు ప్రభుత్వాన్ని వివరణ కోరింది. విద్యార్థుల ధ్రువపత్రాలను నిలిపి వేయరాదని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అయినప్పటికీ సర్కార్ నిర్లక్ష్యపు ధోరణితోనే వ్యవహరిస్తోంది. స్కాలర్‌షిప్ అందకపోతే దాని ప్రభావం కేవలం ఒక విద్యార్థిపైనే ఉండదు, ఒక కుటుంబం మొత్తం ఆర్థిక ఒత్తిడికి గురవుతుంది. తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు చెల్లించాల్సి వస్తుంది. చాలామంది విద్యార్థులు చదువు మధ్య లోనే నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడు తుంది. ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు. పేదరికం నుంచి బయటపడే మార్గమే మూసుకు పోతుంది.
ప్రభుత్వం సంక్షేమం గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా, విద్యార్థులకు ఇవ్వాల్సిన చట్టబద్ధమైన ఆర్థిక సహాయాన్ని సకాలంలో అందించలేకపోతే ఆ మాటలకు విలువుండదు. విద్యపై పెట్టే ఖర్చును వ్యయంగా కాకుండా భవిష్యత్తుపై పెట్టు బడిగా చూడాలి. కానీ నిధుల విడుదలలో జాప్యం, పరిపాలనా నిర్లక్ష్యం, స్పష్టమైన కార్యాచరణ లేకపోవడం వల్ల ప్రతి ఏడాది ఇదే సమస్య పునరావృ తమవుతోంది. ఈ సమస్యలో మరో బాధా కరమైన అంశం కళాశాలల పరిస్థితి. ప్రభుత్వ బకాయిలు రాకపోవడంతో కొన్ని విద్యాసంస్థలు ఆర్థిక ఇబ్బం దులు ఎదుర్కోవడం వాస్తవం. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయంబర్స్ మెంట్ దాదాపు రూ. పదిహేను వందల కోట్లు పెండింగ్‌లో ఉన్నట్టు యాజమాన్యాలు చెబుతున్నాయి. చెల్లించాలని ఎన్ని వినతులు చేసినా, కళాశాలలు మూసేస్తామని హెచ్చరించినా సర్కార్ పెడచెవిన పెట్టడంతో అంశం కోర్టుదాకా వెళ్లింది. ‘ఆర్థిక సమస్యలు న్నాయి. ఒకేసారి చెల్లించడం కష్టం. కొద్దికొద్దిగా ఇస్తాం’ అంటూ సర్కార్ కాలయాపన చేస్తోంది. దాని ప్రభావం నేరుగా విద్యార్థులపై పడుతోంది. ‘సర్కార్ ఫీజు చెల్లించడం లేదని, మీరే అది చెల్లించాలని’ యాజ మాన్యాలపై నుంచి ఒత్తిడి పెరుగుతోంది.
పైగా కోర్టు కూడా విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవచ్చని చెప్పడం సమస్యను జటిలం చేసినట్టు విద్యార్థి సంఘాల విమర్శ! ప్రభుత్వ నిర్లక్ష్యపు వైఖరికి విద్యార్థులను బలిచేయడం ఎంత తప్పో, అదేవిధంగా యాజమాన్యాల ఆర్థిక ఇబ్బందులను విస్మరించడం కూడా సరైంది కాదు. కోర్టు కూడా రెండు పక్షాల హక్కులను సమతుల్యం చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ, ఈ మొత్తం సంక్షోభానికి మూల కారణం ప్రభుత్వం బకాయిలను విడుదల చేయకపోవడం. ప్రస్తుతం ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ, యువతకు ఉపాధి, అభివృద్ధి వంటి హామీలను ఇస్తోంది. అవన్నీ స్వాగ తించదగినవే. కానీ ఇప్పటికే చదువుతున్న విద్యార్థులకు బకాయిలు సకాలంలో చెల్లించలేని ప్రభుత్వం, రేపు లక్షలాది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినప్పుడు యువతలో సహజంగానే సందేహాలు తలెత్తుతాయి. అందువల్ల వెంటనే పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల న్నింటినీ విడుదల చేయాలి. యాజమాన్యాలు కోర్టుల చుట్టూ, విద్యార్థులు నిరసనల బాటలో తిరగాల్సిన పరిస్థితి రాకూడదు. పేద విద్యార్థి చదువు ఆగకుండా చూడటం ఏ ప్రభుత్వానికైనా మొదటి బాధ్యత. దాన్ని నిర్వర్తించినప్పుడే ఉద్యోగాల హామీలు, అభివృద్ధి వాగ్దానాలు ప్రజల్లో విశ్వాసాన్ని పొందగలవు.
బకాయిలు భారమా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



