Thursday, March 5, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఅధికారులను మారిస్తే ఫలితాలు రావు

అధికారులను మారిస్తే ఫలితాలు రావు

- Advertisement -

వెబ్‌సైట్‌లో విద్యాకమిషన్‌ నివేదిక మాయం
ఆరోగ్య శాఖ పరిస్థితి అధ్వాన్నం
ఎంజీఎంలో ఎలుకలు, జడ్చర్లలో కుక్కలు
కలెక్టర్లను బెదరించడం సరికాదు
అసెంబ్లీని భ్రష్టుపట్టించిన ప్రభుత్వం : మీడియా చిట్‌చాట్‌లో మాజీమంత్రి హరీశ్‌రావు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను పూటపూటకు మార్చడం వల్ల పాలనలో ఫలితాలు రాబోవని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పాలించడం రావడం లేదన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మీడియాతో హరీశ్‌రావు చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభాగాధిపతులు సగటున ఎనిమిది నెలలు కూడా పని చేయడం లేదని చెప్పారు. విద్యుత్‌ శాఖలో ఈ రెండేండ్ల కాలంలో ఐదుగురు అధికారులు మారారని గుర్తు చేశారు. ఈ బదిలీలతో విద్యుత్‌ శాఖ అతలాకుతలం అయ్యిందనీ, అవినీతి మయం అయ్యిందని అన్నారు. 140 మంది ఐఏఎస్‌లను బదిలీ చేశారనీ, 20 మంది కలెక్టర్లను మార్చారని వివరించారు. ఢిల్లీతో సమన్వయం ఉండాల్సిన కీలక శాఖల్లో అధికారులను తరచూ మార్చడం వల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లుతోందని చెప్పారు.

కలెక్టర్‌కు జిల్లాపై అవగాహన రావడానికే ఆర్నెల్లు పడుతుందన్నారు. ఈలోపే మార్చిన కలెక్టర్లు ఎంతో మంది ఉన్నారని అన్నారు. కలెక్టర్లను బదిలీ చేయడం వల్ల వారి నైతిక స్థైర్యం దెబ్బతింటుందని చెప్పారు. ఇంజినీరింగ్‌ శాఖలో రిటైర్డ్‌ అధికారులు కీలక పదవుల్లో ఉండటం వల్ల అవినీతి ఎక్కువ జరుగుతోందన్నారు. కలెక్టర్లను కనీసం రెండేండ్లు ఒకే చోట ఉంటేనే ఫలితాలు వస్తాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలెక్టర్లను బెదిరించడం మంచి పద్దతి కాదన్నారు. వారి అక్రమాలకు అధికారులు సహకరించనందుకే సీఎం వారిని బదిలీ చేస్తున్నారనీ, బెదిరిస్తున్నారని ఆరోపించారు. అధికారులను సీఎం బ్లాక్‌ మెయిల్‌ చేయడం మానుకోవాలని సూచించారు.

వికారాబాద్‌ కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ లగచర్ల ఆందోళన సందర్భంగా అనేక హామీలు ఇచ్చారనీ, వాటిని అమలు చేయాల్సి వస్తుందనే ఆయన్ను బదిలీ చేశారని వివరించారు. ఐటీ కార్యదర్శిగా సీఎస్‌ ఎలా పని చేయగలుతారని ప్రశ్నించారు. 20 శాతం జీవోలు ఆన్‌లైన్‌ లో ఉంచుతున్నారనీ, 80 శాతం జీఓలు ఆఫ్‌లైన్‌లో ఉంచుతున్నారని విమర్శించారు. కోర్టు ఆదేశించినా జీవోలు ఆన్‌లైన్‌లో పెట్టడం లేదన్నారు. వరంగల్‌ ఎంజీఎంలో ఎలుకలు, జడ్చర్ల ఆస్పత్రిలో కుక్కలున్నాయనీ, రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఒక నీతి, కౌన్సిలర్లకు మరో నీతా?అని ప్రశ్నించారు. అసెంబ్లీ వ్యవస్థను భ్రష్టు పట్టించారని విమర్శించారు. హౌజ్‌ కమిటీలు వేయడం లేదనీ, డిప్యూటీ స్పీకర్‌, చీఫ్‌ విప్‌ పదవులు ఖాళీగా ఉన్నాయని అన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి మేనల్లుడి మనుషులు నియో పొలీస్‌లో అక్రమ మైనింగ్‌ చేస్తున్నారని విమర్శించారు. లెటర్‌లో పదెకరాలు ఇస్తే 15 ఎకరాల్లో మైనింగ్‌ జరుగుతోందన్నారు. మంత్రి పొంగులేటి సంస్థ రాఘవ కన్‌స్ట్రక్షన్‌ ఎలాంటి అనుమతుల్లేకుండా రాజేంద్రనగర్‌లో మైనింగ్‌ దందా నడుపుతున్నదని వివరించారు. గురువారం నిజనిర్ధారణ కోసం బీఆర్‌ఎస్‌ బృందం వెళ్తున్నదని అన్నారు. ఖమ్మంలో ఇండ్లు కూలగొట్టి జాగా ఇస్తామంటున్నారనీ, ప్రభుత్వంపై ఒత్తిడి తేగలుగుతున్నామని చెప్పారు.తాను మంత్రిగా ఉన్నప్పుడు జర్నలిస్టులు హెల్త్‌ కార్డు జీఓ ఇచ్చానని గుర్తు చేశారు. వారికి కేటాయించిన రూ.16 కోట్ల బడ్జెట్‌లో ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదని అన్నారు. విద్యాకమిషన్‌ ఇచ్చిన నివేదిక బాగుంటే వెబ్‌సైట్‌ నుంచి ఆ నివేదిక ఎందుకు మాయమైందని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఇద్దరు కార్యదర్శుల విధానం ఎప్పుడూ లేదన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -