– వారం రోజులో 25 కుంటలు,చెరువుల నింపేందుకు చర్యలు
నవతెలంగాణ-చందంపేట
డిండి ప్రాజెక్టు నుంచి చందంపేట, నేరేడుగొమ్ము మండలాలకు కాల్వల ద్వారా సాగునీరందిస్తామని దేవరకొండ శాసన సభ్యులు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్రకుమార్ తెలిపారు. సోమవారం డిండి ప్రాజెక్టు నుంచి చందంపేట, నేరుడుగొమ్ము మండలాలకు కాల్వల ద్వారా నీటిని ఎమ్మెల్యే వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చందంపేట, నేరుడుగొమ్ము మండలాలో వారం రోజులో 25 కుంటలు, చెరువుల నింపేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. మే నెలలో చెరువులు కుంటలు నింపుతున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. నిజం కాలం నాటి కాల్వలకు మరమ్మతులు చేసి నీరు అందించిన ఘనత కేసీఆర్‌కు ఉందన్నారు. చందంపేట, నేరేడుగొమ్ము మండలాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా సాగు,తాగు నీరందిస్తున్నట్టు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విదంగా వేసవి కాలంలో పంటలకు నీరు అందించడం జరిగింది అని ఆయన తెలిపారు. నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యమన్నారు.గతంలో 60 ఏండ్లు పాలించిన వారు ఎవరు కూడా డిండి ప్రాజెక్టు నుంచి చందంపేట, నేరేడుగొమ్ము మండలాలకు నీరందించలేదన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గోపిరాం, జెడ్పీటీసీ కేతావత్ బాలు,బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ముత్యాల సర్వయ్య, గోసుల అనంతగిరి,రమావత్ మోహన్ కృష్ణ, పల్స వెంకటయ్య,జక్కుల మున్నయ్య, బైరెడ్డి కొండల్ రెడ్డి,పాషా,బొడ్డుపల్లి కృష్ణ,శోభన్, సైదులు పాల్గొన్నారు.