Saturday, July 11, 2026
E-PAPER
Homeసోపతినియంతలది కుక్కచావు

నియంతలది కుక్కచావు

- Advertisement -

జుట్టుపోలుగాడు : సెల్యూట్‌ అమెరికా. గీ ట్రంప్‌గాడికి అమెరికా 250 ఏళ్ల సొతంత్ర వేడుకల్లో పాల్గొనడం గొప్ప సరదాగా వుందెహె. గీ టైమ్‌లో నేను అమెరికా అద్యక్షునిగా వుండటం పెపంచకం చేసుకున్న గొప్ప అదృష్టం. ఏ అమెరికా అద్యక్షుడైనా రెండు సార్లే కుర్సీపై కూకునేది. నేనొక్కడ్నే మూడోసారి కూకున్నా. ఏందెహె అలా నోరు తెరచి చూస్తున్నారు? అదే నేను మొత్తుకునేది. నా జోకులు, నా పంచ్‌లు, నా ట్వీట్లు అర్థం కాకపోతే ఎలా… నా రెండో ఇజయాన్ని గా బైడెన్‌గాడు మోసం చేసి కాజేశాడు. ఎవడేమనుకుంటే నాకేంది? నే చెప్పాల్సింది చెప్తా. గీ అమెరికా ఎప్పుడూ వరల్డ్‌ ఫస్టే. ఏ మాత్రం కిందకు జారనివ్వను. గిది నా శపథం. ప్రామిస్‌. ఇకపోతే అమెరికాకు బద్ద శత్రువు కమ్యూనిజం. ‘సేవ్‌ అమెరికా చట్టాన్ని’ మనం తెచ్చుకోవాలి. లేకపోతే మనకు లోలోపలే దుష్మన్‌లు పెరిగిపోతారు. ఎందుకంటే వాళ్లకు కమ్యూనిస్టు భూతం పట్టుకుంది. గీ చట్టం ప్రకారం అమెరికా ఓటర్లు అందరికీ ఓటరు గుర్తింపు ఉండాలి. వారి పౌరసత్వం వారే రుజువు చేసుకోవాలి.

చావు బతుకుల మధ్యున్న, మంచ మీదున్నోళ్లు తప్ప తక్కిన వాళ్లందరూ బూత్‌కు వచ్చి కచ్చితంగా ఓటెయ్యాల్సిందే. పోస్టల్‌ ఓట్లు వుండవు. ఇందులో ఏ దాపరికం లేదు. మోసాలు గీసాలు జాన్తానై. అసలు ఇసయ ఏంటంటే నేను మొదటిసారి అద్యక్షుడైనప్పటి నుండి మిలిటరీ బడ్జెట్‌ పెంచేశా. అమెరికా సైన్యాన్ని పెపంచకానికే మొనగాడుగా చేశా. అయితే గా మిలట్రీ సైన్యాన్ని ఇష్టమొచ్చినట్టు వాడి పెపంచశాంతిని దెబ్బతీయడం నాకిష్టం లేదెహె. నాలోని శాంతిదూతను గమనించరేంది? జర ఇనుకోండి. మళ్లీ చెప్తున్నా. కమ్యూనిజానికి అమెరికా పూర్తి వ్యతిరేకం. అదో భయంకర భూతం. దాని వికృత రూపాన్ని అమెరికాకు చూపిస్తానంటే కుదరదు. ఆ ప్రాణాంతక ముప్పును నేనొప్పుకోను. పెపంచ యుద్ధం కన్నా పెమాదం అది. అమెరికా ఎప్పటికీ కమ్యూనిస్టు దేశం కాదు, కాదు. కాదెహె.

కేతిగాడు : కమ్యూనిస్టులు.. కమ్యూనిస్టులు.. కమ్యూనిస్టులు.. కార్మిక కర్షక జనావళికి ఎంతో ఇష్టులు ఈ మార్క్సిస్టులు’. ‘శ్రమజీవే జగతికి మూలం/ చమటోడ్చక జరగదు కాలం/ రేపన్నది మనదే నేస్తం/ శ్రమశక్తే విశ్వ సమస్తం’ ఒక జాతిని మరో జాతి, ఒక దేశాన్ని మరో దేశం, ఒక మనిషిని మరో మనిషి దోచుకునే కాలం ఇంకానా.. ఇకపై సాగదు. అరె ట్రంప్‌గా.. ఈ కమ్యూనిస్టుల మాటలు పాటలు కవితలు వినుకో. మార్క్స్‌ – ఏంగెల్స్‌లు కమ్యూనిస్టు ప్రణాళిక రాయకముందు చరిత్ర గతి వేరు. ఇప్పుడు వేరు. మనిషిని మనిషిగా గుర్తించి గౌరవించి దోచుకోని వ్యవస్థ ఏదైనా వుందంటే అది కమ్యూనిస్టు సోషలిస్టు వ్యవస్తే. శక్తి కొలది శ్రమ – అవసరం కొద్దీ ఆహారం. అందరి బతుకు భద్రత. అభివృద్ధి, వ్యక్తిగత ఆస్తులకు చెల్లుచటి, కష్టజీవులకు న్యాయం – ఇలా పనిచేసేది కమ్యూనిస్టు సోషలిస్టు వ్వవస్థే. 1917లో కామ్రేడ్‌ లెనిన్‌ నాయకత్వాన సోవియట్‌ రష్యా ఏర్పాటైన తర్వాత ఎన్ని దేశాలు ఆ సైద్ధాంతిక భావజాలంతో విముక్తి బాట పట్టాయి. చైనా లాంటి దేశాలు నేడు ఎంతగా అభివృద్ది అవుతున్నాయి. అదీ నీ అమెరికాకు పోటీగా. ప్రపంచానికి కావాల్సింది అలాంటి విముక్తి, రక్షణ, అభివృద్ధి కాని నీలాంటి దోపిడీ యుద్ధోన్మాదులు కాదురోరు.

జుట్టుపోలుగాడు : వార్ని… నాకే నీతులు చెప్తావేందిరోరు. ఎక్కడైనా.. ఎప్పుడైనా, ఎవడైనా… గీ ట్రంప్‌గాడి కనుసన్నల్లో బతకాల్సిందే. ఇరాన్‌ను చూడండి. అక్కడ ఈ రోజు నాయకులందరూ ఒక్కచోటే గుమికూడారు. నేను ఒక్కసారి ఉఫ్‌ అంటే అందరూ ఎగిరిపోతారు. కానీ నేనలా చెయ్యను. ఎందుకంటే నేను అలా చేస్తే మరి నాతో చర్చలు జరపడానికి, ఆ తర్వాత ఎవరుంటారు? ఏంటి మళ్లీ నోరు తెరిచారు. నేను నెత్తికొట్టుకునేది గందుకే. నా మాటల్లో జోకేందో.. నిజమేందో మీకు తెలియడంలా.. నాది అతి అని అందరూ అనుకుంటున్నారు. కానీ అసలు అతి ఇరాన్‌ ప్రజలదే. గా చనిపోయిన ముసలి నేతను ఒకపక్క ద్వేషిస్తూనే మరో పక్క దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు. ఛ.. ఛ..

బంగారక్క : (కోపంతో ఊగిపోతూ..) అరే ట్రంప్‌గా నోర్ముయ్యరా.. శవాలపై పైసలు ఏరుకునే బాపతి కన్నా నీవు మరీ నీచం. నీ భయంకర యుద్ధోన్మాదం సరే.. కానీ మనిషిపోతే మనిషికొచ్చే ఏడుపును కూడా హేళన చేసే స్థితికి దిగజారావ్‌. తమ ప్రియతమ నాయకునికి కడసారి కన్నీటి వీడ్కోలు చెప్పేందుకు లక్షల సంఖ్యలో ప్రజలు, పిల్లాపాపలతో తరలిరావడం నీవు తట్టుకోలేకపోతున్నావు. వారు గుండెలవిసేలా బాదుకుంటూ రోదిస్తుంటే నీకు నవ్వొస్తుందా..? అసలు నీవు మనిషివేనా.. ‘మా మాట ఒక్కటే ప్రతీకారం’ అని మౌనంగా ఆ ఇరాన్‌ ప్రజలు ప్లకార్డులు పట్టుకోవడం నీకు కనిపించలేదా..? కావాలని నీవు చూళ్లేదా..? ఈ శతాబ్దపు ఘనమైన శ్రద్ధాంజలిగా జనాలు పేర్కొంటుంటే నీ వికృత వితండవాదమేంది? అందరిమీద అవాకులు చవాకులు పేలడం పెద్ద గొప్ప అనుకుంటున్నావ్‌. ఎప్పుడు ఎవడి చావు ఎలా వస్తుందో ఎవడికీ తెలియదు. ‘నాకు ఎదురే లేదని’ విర్రవీగిన నాజీ హిట్లర్‌ సైన్యాన్ని సోవియట్‌ ఎర్రసైన్యం రెండు కోట్లమంది బలిదానంతో మట్టికరిపించింది. ప్రపంచ మానవాళిని విముక్తి చేసింది. చివరకు హిట్లర్‌ కుక్క చావు చచ్చాడు. ఏవడూ బాధపడలా గుర్తుంచుకో..

– కె.శాంతారావు, 9959745723

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -