కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద ఎస్ఎఫ్ఐ నిరసన
నవతెలంగాణ – ముషీరాబాద్
దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాల ఆశలను మోస్తున్న నీట్-2026 పరీక్ష పేపర్ లీకేజీ మోడీ ప్రభుత్వ ఘోర వైఫల్యమని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్ష నిర్వహణ అవినీతి, నిర్లక్ష్యం, కోచింగ్ మాఫియా – అధికార యంత్రాంగం కుమ్మక్కు కారణంగా విద్యార్థులకు శాపంగా మారిందన్నారు. నీట్ పరీక్షను పారదర్శకంగా నిర్వహించడంలో పూర్తిగా విఫలమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.రజినీకాంత్ మాట్లాడుతూ.. సుమారు 22.79 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ నేడు అంధకారంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2024లో జరిగిన పేపర్ లీక్ ఘటనపై అప్పట్లోనే కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే నేడు ఇంత పెద్ద స్కాం పునరావృతమైందని చెప్పారు. రీక్షా వ్యవస్థను కేంద్రం కోచింగ్ మాఫియాకు, కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టిందని ఆరోపించారు. ఈ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, విఫలమైన ఎన్‌టీఏను రద్దు చేయాలని లేదా పూర్తిగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. లీకేజీకి కారణమైన అధికారులు, మధ్యవర్తులు, కోచింగ్ మాఫియాను వెంటనే అరెస్టు చేయాలన్నారు.
నష్టపోయిన విద్యార్థులకు మానసిక ధైర్యం కల్పించాలని, ఆర్థిక పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, రాష్ట్రాలకు తమ సొంత ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునే హక్కును కల్పించాలని, విద్యను కార్పొరేట్ వ్యాపారంగా మార్చే విధానాలను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. నాగరాజు మాట్లాడుతూ.. కాక్రోక్ జనతా పార్టీ కొన్ని రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరవధిక దీక్ష చేపట్టినా కేంద్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు. నిరసన చేస్తున్న వారికి కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శానిటేషన్ పనులను నిలిపివేసి నీరు, కరెంటు సౌకర్యాలు లేకుండా చేస్తోందన్నారు. పరీక్షల రద్దు, అవకతవకల కారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు ఎం. మమత, శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డి. కిరణ్, శ్రీకాంత్, ఆఫీస్ బేరర్స్ రాజు, కార్తీక్, రాష్ట్ర కమిటీ సభ్యులు నరేష్, లెనిన్, రమేష్, మధు, జ్యోతిబసు, రాజ్ కుమార్, స్మరన్, రవితేజ, సైదా, అక్బర్, శ్రీనాథ్ హైదరాబాద్ నాయకులు నాగేందర్, అంజి, జ్ఞాపిక, లోహి, జాన్సీ, హారిక పాల్గొన్నారు.
‘నీట్’ లీకేజీ మోడీ ప్రభుత్వ ఘోర వైఫల్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



