Sunday, March 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఎన్‌ఈపీ–2020 అమలు పేరుతో విద్యను వాణిజ్యీకరణ దిశగా నెట్టొద్దు : ఎస్ఎఫ్ఐ

ఎన్‌ఈపీ–2020 అమలు పేరుతో విద్యను వాణిజ్యీకరణ దిశగా నెట్టొద్దు : ఎస్ఎఫ్ఐ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యా రంగంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యావిధానం -2020 (ఎన్‌ఈపీ–2020) అమలు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేయడం ఆందోళనకరమని ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ అభిప్రాయపడుతోంది.

విద్యా వ్యవస్థను సమానత్వం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం అనే విలువలపై నిర్మించాల్సిన అవసరం ఉన్న సమయంలో ఎన్‌ఈపీ–2020 మాత్రం విద్యను కార్పొరేట్ ప్రయోజనాలకు అనుగుణంగా మార్చే ప్రమాదకర మార్గాన్ని సూచిస్తోంది. ఇలాంటి విద్యవిధానం కాంగ్రెస్ నాయకత్వంలో ప్రభుత్వం అమలుకు పూనుకోవడం దుర్మార్గపు చర్య.

ఎన్‌ఈపీ–2020 అమలు పేరుతో మల్టిపుల్ ఎంట్రీ–ఎగ్జిట్, నాలుగేళ్ల డిగ్రీ, అకాడెమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ వంటి విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థుల విద్యా ప్రయాణాన్ని అస్థిరంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది.

మధ్యలో ఎగ్జిట్ అనే పేరుతో విద్యార్థులను బయటకు నెట్టే విధానమే దీనిలో దాగి ఉంది. ముఖ్యంగా పేద, గ్రామీణ, అట్టడుగు వర్గాల విద్యార్థులు ఆర్థిక ఒత్తిడితో చదువు మధ్యలో వదిలేయాల్సిన పరిస్థితులు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఈ విధానం విద్యార్థులకు అవకాశాలు పెంచేలా కాకుండా అసమానతలను పెంచేలా పనిచేస్తుంది.

ఇప్పటికే ఉన్నత విద్యలో ఫీజులు భారీగా పెరుగుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు, స్కాలర్‌షిప్‌లు సకాలంలో విడుదల కాకపోవడంతో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ కళాశాలలు మౌలిక సదుపాయాల కొరతతో, అధ్యాపకుల కొరతతో నడుస్తున్నాయి. ఈ పరిస్థితులను సరిచేయకుండా ఎన్‌ఈపీ అమలు చేయడం విద్యార్థుల భవిష్యత్తుతో ప్రమాదకర ప్రయోగాలు చేయడమే అవుతుంది.

అదే సమయంలో ఎన్‌ఈపీ–2020 పరిశోధన, స్వయం ప్రతిపత్తి పేరుతో ప్రభుత్వ బాధ్యతలను తగ్గించి కార్పొరేట్ రంగానికి విద్యను అప్పగించే దిశగా తీసుకెళ్తోంది. విద్యను హక్కుగా కాకుండా మార్కెట్ వస్తువుగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. దేశంలో సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులో ఉండాలంటే ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయడం తప్ప మరో మార్గం లేదు.

అందువల్ల రాష్ట్రంలో ఎన్‌ఈపీ–2020కు బదులుగా ప్రజా విద్యను బలోపేతం చేసే ప్రత్యామ్నాయ విధానం అవసరం అని ఎస్ఎఫ్ఐ భావిస్తోంది. అందులో ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై జీడీపీలో కనీసం 6 శాతం ఖర్చు చేయాలి. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కళాశాలలను బలోపేతం చేసి కొత్త ప్రభుత్వ విద్యాసంస్థలను స్థాపించాలి. ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. విద్యార్థులకు ఉచిత లేదా తక్కువ ఖర్చుతో ఉన్నత విద్య అందుబాటులో ఉండే విధంగా ఫీజులను నియంత్రించాలి.

పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు పూర్తిగా అమలు చేయాలి. పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ప్రభుత్వ హాస్టళ్లను, మెస్ సౌకర్యాలను మెరుగుపరచాలి. ప్రతి విద్యార్థికి విద్య హక్కు అనే భావనతో సమాన అవకాశాలు కల్పించాలి.

రాష్ట్రంలో ఈ విధానం అమలు చేయడానికి ముందు విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు, ప్రజా సంస్థలతో విస్తృత చర్చలు జరపడం అవసరం. ప్రజాస్వామ్య చర్చలు లేకుండా పై నుంచి విధానాలను రుద్దడం విద్యా వ్యవస్థకు హానికరం.

ఎన్ఈపి అమలైతే అణాగారిన వర్గాలు విద్యకు దూరం అయ్యి‌,భారీగా ఫీజులు పెరుగుతాయి.ప్రజాపాలన పేరుతో అధికారం చేపట్టిన కాంగ్రెసు ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయవద్దని ఎస్ఎఫ్ఐ కోరుతుంది.ఇప్పటికే రాష్ట్రంలో యూనివర్శీటీలు అంపశయ్యపై ఉన్నాయని ఈ విధానం అమలై ప్రైవేటు విద్యకు లాభసాటి అవుతోందని, ఫలితంగా రాష్ట్ర యూనివర్శీటీలు నష్టపోతాయని అందుకే ఈ విధానం వెనక్కి తీసుకోవాలని కోరుతుంది.

కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఎన్‌ఈపీ–2020 అమలు ప్రక్రియను తక్షణం నిలిపివేసి ప్రజా విద్యను బలోపేతం చేసే ప్రత్యామ్నాయ విధానంపై చర్చలు ప్రారంభించాలని ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను ఐక్యం చేసి ఉద్యమాలు నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -