రేపు అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద బహిరంగ నిరసన
15న సమాచార్ భవన్ దగ్గర టీడబ్ల్యూజేఎఫ్ పిలుపు
నవతెలంగాణ-హైదరాబాద్
వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలపై తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) పోరుబాట పట్టింది. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 13 సోమవారం అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద బహిరంగ నిరసనకు పిలుపునిచ్చింది. ఈమేరకు ఆ సంఘం రాష్ట్ర యాక్టింగ్ ప్రెసిడెంట్ పి రాంచందర్, ప్రధానకార్యదర్శి బి.బసవపున్నయ్య శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, ఇండ్లస్థలాలు, హెల్త్‌కార్డులను వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్రిడిటేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ, అందులో తీవ్ర జాప్యం జరుగుతున్నదన్నారు. ఒకే యూనియన్‌కు చెందిన వాళ్లను అక్రిడిటేషన్ కమిటీల్లో నియమించడం మూలంగా నియంతృత్వం రాజ్యమేలుతోందని తెలిపారు. అధికారులు నామమాత్రంగా మిగిలిపోయారని గుర్తు చేశారు. ఏకపక్షంగా కార్డులు జారీచేస్తున్నారని అన్నారు. గత 40 ఏండ్లుగా జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వలేదన్నారు. వెంటనే ఆ ప్రక్రియ చేపట్టి త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా హెల్త్‌కార్డులు ఇవ్వాలని కోరారు. ఈసమస్యలను మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే బహిరంగ నిరసన కార్యక్రమానికి టీడబ్ల్యూజేఎఫ్ పిలుపునిచ్చిందన్నారు. అలాగే ఆర్టీసీ, మెట్రోలలో ప్రయాణాన్ని ఇక నుంచి పూర్తిస్థాయిలో ఉచితంగా ఇవ్వాలని కోరారు. అలాగే రైల్వే పాసులను పునరుద్ధరించేలా రాష్ర్ట ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఈ బహిరంగ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఫెడరేషన్ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఇవే సమస్యలపై హైదరాబాద్‌లోని సమాచార, పౌరసంబంధాల శాఖ కార్యాలయం సమాచార్ భవన్ వద్ద బహిరంగ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు నాయకత్వం ప్రకటించింది.
జర్నలిస్టుల సమస్యలపై పోరుబాట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



