నవతెలంగాణ – పలిమేర
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమేర మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీస్ లో నాలుగు రోజుల కింద కుక్క చనిపోయింది. ఆ కుక్క ఎట్లా ఆఫీసులోకి చొరబడిందో తెలియదు కానీ బయటికి రాలేక తిండి లేక అందులోనే చనిపోయింది కావచ్చు అని అభిప్రాయ పడుతున్నారు ప్రజలు. ఇదిలా ఉంటే నాలుగు రోజులుగా ఆఫీసులో కుక్క పడి చనిపోయి ఉన్నా కనీసం తాళాలు తెరిచి దాన సంస్కారాలు చేయడానికి కూడా ఎవరూ రాలేదు. మండలం ఏర్పడి 10 సంవత్సరాల అవుతున్న ఇప్పటికీ ప్రజలు మహదేవపూర్ వెళ్లి పనులు చేయించుకోవలసి వస్తుందనడానికి ఇది నిదర్శనం.
గిరిజన ప్రజల ఓట్లపై ఉన్న ఆసక్తి వారి సమస్యలు తీర్చడానికి మాత్రం రాజకీయ నాయకులకు పట్టింపు ఉండట్లేదు. ఏం చేసినా చెల్లుతుంది ఈ గిరిజనులతో అయ్యేదేంటి అనే భావనతో ఆఫీసర్లు కూడా ఈ వైపు కన్నెత్తి చూడడం లేదు. మారుమూల ప్రాంతం అక్కడికి పోయి ఎవరుంటారు. అంటూ ఆఫీసర్లు మండలం వైపు రావడమే మర్చిపోయారు. పనిమేలను కనీసం మండలంగా కూడా గుర్తించట్లేదు. కలెక్టర్ పర్యటనకు వచ్చినప్పుడు ఈ ప్రాంత ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రి అయినటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు పర్యటనకు వచ్చినప్పుడు అధికారులు సంకలలో ఫైలు పెట్టుకుని సలాములు కొడుతూ పని సాగిస్తున్నారు.
అంతేకానీ ప్రజల అవసరాల నిమిత్తం ఏర్పాటు చేసిన ఆఫీసులలో కూర్చుని వారి పని పట్ల నిబద్ధతను మాత్రం చూపెట్టడం లేదు. ఎన్నోసార్లు మండల ప్రజలు మండల కేంద్రంలో ఆఫీసులో ఉండాలని మొరపెట్టుకున్న విని నాదుడే లేకుండా పోయాడు. కలెక్టర్ కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తూ ఉండడంతో మండలంలో పనిచేసే అధికారులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. జీతం తీసుకోవడానికే అధికారులైనట్టు వ్యవహరిస్తున్నారు. సార్ మాకు ఈ పని చేయాలి అని అడిగిన ప్రజలను చీత్కరిస్తూ మీకు పని ఉంటే మహదేవపూర్ మండలానికి రండి.. అక్కడే ఆఫీసు ఉంది అంటూ మొఖం మీద చెప్పేస్తున్నారు.
ఇకనైనా తీరు మార్చుకొని మండల కేంద్రంలో అధికారులు సేవలు పున:ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టి గిరిజనుల బాధలు తీర్చాలని మండల ప్రజలు కోరుతున్నారు.



