Tuesday, July 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆరుతడి పంటలు ప్రోత్సహించాలి

ఆరుతడి పంటలు ప్రోత్సహించాలి

- Advertisement -


ఆగస్టులోనూ సాధారణం కంటే తక్కువే వర్షపాతం
రిజర్వాయర్లలో నీటి నిల్వలు కూడా అంతంతే
కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండాలి
వ్యవసాయ శాస్ర్తవేత్తల సూచనలను రైతులు అమలు చేసేలా చూడాలి : ఎలన్‌‌నినోపై
సమీక్ష‍లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో ఎల్‌‌నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధం చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులు నష్టపోకుండా మొదటి దశ కార్యాచరణ అమలు చేయాలనీ, రైతులు ఆరుతడి పంటల్ని సాగుచేసేలా ప్రోత్సహిస్తూ కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు క్ష‍ేత్రస్థాయిలో ఉండి పర్యవేక్ష‍ించాలని ఆదేశించారు. ఎల్‌‌నినో నేపథ్యంలో సోమవారం పటాన్‌‌చెరులోని ఇక్రిశాట్‌‌లో వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆప్‌ ‌మిల్లెట్స్‌ ‌రీసెర్చ్‌, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయిల్‌ ‌సీడ్స్‌ ‌రీసెర్చ్‌, సెంట్రల్‌ ‌రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ‌ఫర్‌ ‌డ్రైల్యాండ్‌ అగ్రికల్చర్‌, ఐఎంమ్‌‌డీ సంస్థల శాస్ర్తవేత్తలు, వ్యవసాయ, ఇరిగేషన్‌ ‌శాఖల అధికారులతో విస్తృతస్థాయి సమీక్ష‍ను మంత్రి నిర్వహించారు. ఆయా అంశాలపై సూచనలు చేస్తూ శాస్ర్తవేత్తలు నివేదికలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ప్రతిరోజూ 33 జిల్లాల వర్షపాతంపై సమీక్ష‍ించాలనీ, వాతావరణ, భూగర్బజలాలు, వర్షపాతం వివరాలతో మండలాల వారీగా ప్రతి వారమూ బులెటిన్లను మీడియా, సోషల్‌‌మీడియా , వాట్సాప్‌ ‌గ్రూపుల ద్వారా రైతులకు చేరవేయాలని సూచించారు. ఆ బులెటిన్‌లో మండలాల వారీగా నమోదైన వర్షపాతం, రాబోయే వారానికి, నెలాఖరు వరకు ఉండే వాతావరణ పరిస్థితుల అంచనాలు, డ్రై స్పెల్స్ ఏర్పడే అవకాశాలు, గరిష్ఠ–కనిష్ఠ ఉష్ణోగ్రతలు, నేల తేమ పరిస్థితులు, భూగర్భ జలాల లభ్యత, సాగునీటి పరిస్థితి, విద్యుత్ సరఫరా, పంటల స్థితి, రైతులు చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు, ప్రాజెక్టుల నీటి నిల్వలు, ఇన్‌ఫ్లోలు, సాగునీటి లభ్యతపై కచ్చితమైన అంచనాలను పొందుపర్చాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉందన్నారు. శాస్త్రీయ విధానాలతో ఎల్ నినోను ఎదుర్కొనేందుకు డైనమిక్‌ ‌డిస్ర్టిక్ట్‌ ‌స్పెషల్‌ ‌రెస్పాన్స్‌(‌డీఎస్‌ఆర్‌) ‌విధానాన్ని అమలు చేయాలని సూచించారు. వర్షం కురిసినప్పటికీ భూమిలో తగినంత తేమ ఉంటేనే విత్తనాలు వేయాలనీ, తేమ ఏర్పడే వరకు ఎరువుల వినియోగాన్ని వాయిదా వేయాలనీ, తేమను కాపాడే చర్యలు తీసుకోవాలని సూచించారు. పంటల కీలక ఎదుగుదల దశల్లో ప్రాణాధార నీటిపారుదల అందించాలనీ, దీర్ఘకాలిక పొడి పరిస్థితుల నేపథ్యంలో రెండు శాతం యూరియా, లేదంటే ఒక శాతం పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని ఆకులపై పిచికారీ చేయాలని తెలిపారు. అంతర పంటల సాగును ప్రోత్సహించేలా రైతులకు సలహాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వరి సాగు రైతులు తక్కువ కాలంలో పండే రకాలతో డీడీఎస్‌ఆర్‌ ‌విధానాన్ని అనుసరించాలని సూచించారు. వరికి బదులుగా మొక్కజొన్న, సజ్జలు, రాగులు, కందులు, మినుములు, పొద్దుతిరుగుడు, నువ్వులు, అలసందలు, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సాగుచేసిన మొక్కజొన్న, పత్తి పంటలు ప్రస్తుతం మొలక దశలో ఉన్నందున నేల తేమను కాపాడేందుకు కలుపు నియంత్రణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు. రాష్ట్రంలో విత్తనాలు, ఎరువుల కొరత లేదన్నారు. ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో ఎల్-నినో ప్రభావాలు, ప్రత్యామ్నాయ సాగు, నీటి యాజమాన్యం, నేల తేమ సంరక్షణ, వాతావరణ ఆధారిత వ్యవసాయ పద్ధతులు, శాస్త్రవేత్తలు సూచించిన యాజమాన్య చర్యలపై రైతులకు ప్రత్యేక అవగాహన కల్పిస్తామన్నారు. సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్రమోహన్, ఇక్రిశాట్ డిప్యూటి డైరెక్టర్ జనరల్ స్టాన్ఫోర్డ్ బ్లేడ్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, కమిషనర్ కోఆపరేషన్ రాహుల్ రాజ్, హాకా ఎమ్‌‌డీ చంద్రశేఖర్, గిడ్డంగుల శాఖ ఎమ్‌‌డీ లక్ష్మీ, టీజీఎస్‌‌పీడీసీఎల్‌ ‌సీఎమ్‌డీ జితేష్ పాటిల్, అగ్రి, హార్టికల్చర్ యూనివర్సిటీల వీసీలు జానయ్య, రాజిరెడ్డి, ఇక్రిశాట్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ హరికిషన్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -