Sunday, July 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅంతర్జాతీయ ప్రమాణాలతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ

అంతర్జాతీయ ప్రమాణాలతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ

- Advertisement -

​ కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో గోద్రెజ్‌ నిర్మాణం
రూ. 300 కోట్లతో రాష్ట్రంలోనే తొలి ‘ప్రయివేట్‌’ కాంప్లెక్స్
700 మందికి ప్రత్యక్ష ఉపాధి..
 మూడు జిల్లాల్లోని 21 మండలాల రైతులకు సేవలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/కొణిజర్ల

​ ఖమ్మం జిల్లాలో రూ. 300 కోట్ల భారీ పెట్టుబడితో అత్యాధునిక సాంకేతికతతో రాష్ట్రంలోనే తొలి ప్రయివేట్ సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్‌‌ (సమీకృత ఫ్యాక్టరీ) కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్ట్ తుది దశకు చేరి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. దీనిని ఈనెల 20వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. గోద్రెజ్‌ అగ్రోవెట్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ ప్లాంట్ ద్వారా సుమారు 700 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఆయిల్ పామ్ ప్రాసెసింగ్‌తో పాటు నాణ్యమైన విత్తనోత్పత్తి, పరిశోధన, రహదారులు ఈ ప్రాజెక్ట్‌లో రూపు దిద్దుకుంటాయి. జిల్లాలో ఆయిల్ పామ్ సాగును విస్తరించడంతో పాటు, స్థానిక రైతులకు అవసరమైన సదుపాయాలను అందించడానికి ఈ ఫ్యాక్టరీ దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ దివాకర్‌ తెలిపారు.
​ప్రాజెక్టులో భాగంగా..
ప్రాజెక్టు విభాగాల్లో భాగంగా నాణ్యమైన పామాయిల్ మొక్కలను పెంచి రైతులకు అందిస్తారు. అత్యాధునిక సాంకేతికతతో క్రూడ్ పామాయిల్ ఉత్పత్తి చేస్తారు. నాణ్యమైన విత్తనాలు, మొక్కల కోసం రీసెర్చ్ సెంటర్‌‌ను నెలకొల్పుతున్నారు. భూసారం, ఆయిల్ నాణ్యతపై పరిశోధనలు చేసి రైతులకు సాంకేతిక సలహాలు ఇస్తారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 113.5 ఎకరాల భూమిని కేటాయించారు. అక్కడ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లు, నర్సరీ, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్, అధునాతన సీడ్ గార్డెన్‌‌ను ఏర్పాటు చేస్తున్నారు.
ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో రెండు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు నిర్మాణంలో ఉన్నాయి. ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో వేంసూరు మండలం కల్లూరుగూడెంలో రూ.250 కోట్లతో ఒక ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా, గోద్రెజ్‌ అగ్రోవెట్ ఆధ్వర్యంలో గుబ్బగుర్తిలో మరో ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఆయిల్ పామ్ మిల్లులతో పోలిస్తే పూర్తి ఆటోమేషన్‌‌తో ఇది రూపొందుతోంది. రోజుకు 300 టన్నులు, నెలకు సుమారు 9 వేల టన్నుల క్రూడ్ పామ్ ఆయిల్ ఉత్పత్తి చేసేలా దీన్ని రూపొందించారు. భవిష్యత్తులో అవసరాన్ని బట్టి గంటకు 60 టన్నుల సామర్థ్యానికి విస్తరించేలా ప్లాంట్ నిర్మిస్తున్నారు.విద్యుత్ వ్యయంతో పాటు పర్యావరణహిత ఉత్పత్తి విధానం దీని ద్వారా అమల్లోకి రానుంది.
​మూడు జిల్లాల్లో 21 మండలాల రైతులకు సేవలు
రైతులకు సమగ్ర సేవలు అందించేందుకు గుబ్బగుర్తిలో ‘సమాధాన్ వన్ స్టాప్ సొల్యూషన్ సెంటర్’ ఏర్పాటు చేశారు. ఫ్యాక్టరీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత జిల్లాలోని ఆరు మండలాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నాలుగు మండలాలు, సంగారెడ్డి జిల్లాలోని ఆయిల్ పామ్ సాగు ప్రాంతాలు కలిపి మొత్తం 21 మండలాల రైతులకు సేవలు అందనున్నాయి. 700 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా, ఈ నెల 20 నాటికి అన్ని పనులు పూర్తి చేసి ఫ్యాక్టరీని ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆఫీసర్లు సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -