బీఆర్‌ఎస్‌ను నిలదీసిన కడియం
ముందుగా కవిత వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలి..!
బీఆర్‌ఎస్ అసత్య ప్రచారాలతో రైతులు, యువత మోసపోవద్దు
కాళేశ్వరం కుంగిపోవడానికి కేసీఆర్, హరీష్‌రావే బాధ్యత వహించాలి
మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి
నవతెలంగాణ – స్టేషన్ ఘనపూర్
బీఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడానికి ముందు కేసీఆర్, హరీష్‌రావు బాధ్యత వహించాలని, ఆ తర్వాతే ప్రజల ముందుకు రావాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. అధికారం కోల్పోయిన అక్కసుతో బీఆర్‌ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ రైతులు, యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ ఫండ్‌లో ఉన్న రూ.1400 కోట్లు క్విడ్ ప్రొకో ద్వారా వచ్చాయని, స్వయంగా కల్వకుంట్ల కవిత చెప్పిన విషయంపై కేసీఆర్, హరీష్‌రావు, కేటీఆర్ ముందుగా సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే కడియం సవాల్ విసిరారు.
సోమవారం నిర్వహించిన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్‌నీనో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, దేశంలోని ఏ నదిలోనూ ఆశించిన స్థాయిలో నీటి ప్రవాహం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో కరువు వచ్చిందని హరీష్‌రావు మాట్లాడడం బాధ్యతాయుత నాయకుడికి తగదన్నారు. ప్రస్తుతం గోదావరిలో కేవలం 16 వేల క్యూసెక్కుల ప్రవాహమే ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం లేదని స్పష్టం చేశారు. కనీసం 2లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంటేనే నీటిని ఎత్తిపోయడం సాధ్యమని నీటిపారుదల నిపుణులు చెబుతున్నారని తెలిపారు. మెడిగడ్డ, కాళేశ్వరానికి గుండెలాంటిదని, అది పనిచేయకపోతే మొత్తం ప్రాజెక్టు పనిచేయదన్నారు.
రైతులు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. “కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి అన్నారం నింపండి… ఏమైనా జరిగితే బాధ్యత మేమే తీసుకుంటాం” అని హరీష్‌రావు చెప్పడం సిగ్గుచేటని, కాళేశ్వరం కుంగిపోవడానికి కేసీఆర్, హరీష్‌రావే బాధ్యత వహించాలన్నారు. నీటిపారుదల శాఖలో భారీ అవినీతి జరిగిందని స్వయంగా కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించిన విషయానికి కూడా బీఆర్‌ఎస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కొన్ని పత్రికలు, యూట్యూబ్ ఛానళ్లు ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తూ రైతులు, యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని అన్ని రిజర్వాయర్లను దేవాదుల ద్వారా నింపేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వారం రోజుల్లో సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతులు, యువత, ప్రజలు బీఆర్‌ఎస్ అసత్య ప్రచారాలను నమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అంబటి కిషన్ రాజ్, వైస్ చైర్మన్ నీల రాజమ్మ, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, బూత్ స్థాయి ఏజెంట్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



