అభివృద్ధి అంటే ఇప్పుడు అక్షరాలా విధ్వంసమే…. ఆకాశాన్ని తాకే భవనాలు, వందల కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్ వేలు, మెట్రో రైళ్లు, స్మార్ట్ సిటీలు,ఏఐ డేటా సెంటర్లు, భారీ పరిశ్రమలే అని మన పాలకులు భావిస్తున్నారు. కానీ ఈ అభివృద్ధి కోసం అడవులు నరికివేయడం, కొండలను పిప్పిచేయడం, చెరువులను పూడ్చివేయడం, నదులను కలుషితం చేయడం జరుగుతోంది. ఇది నిజమైన అభివృద్ధా? ప్రకృతిని కాపాడుతూ భవిష్యత్తు తరాల అవస రాలను దృష్టిలో పెట్టుకొని చేసే అభివృద్ధిని సుస్థిర అభివృద్ధి అంటాం, కానీ ఇల్లు పీకి పందిరేయడం కాదు. అడవులు, నదులు, సముద్రాలు, వన్యప్రాణులు, గాలి ఈ సహజ వనరులేమి అపరిమితమైనవి కావు. ఈ పరి మితమైన వనరులను విధ్వంసం చేస్తూ, దుర్వినియోగ పరుస్తూ సాగించే మన ప్రయాణం భవిష్యత్తు తరాలకు శాపంగా మారక తప్పదు.
సహజ వనరుల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పారిస్ ఒప్పందం ప్రకారం ఈ ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని గత తొమ్మిదేండ్ల నుంచి ప్రతియేటా జూలై 28న నిర్వహించుకుంటున్నాం. పారిస్ ఒప్పందాన్ని ఏ దేశం కూడా సీరియస్‌గా తీసుకున్నట్లు కన్పించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, గ్లోబల్ వార్మింగ్‌ను అరికట్టడానికి 195 దేశాలు కుదుర్చుకున్న చట్టబద్దమైన అంతర్జాతీయ ఒప్పందం ఇది. ఏ దేశానికి ఆదేశం ప్రకృతి పరిరక్షణకు స్వంతంగా ప్రణాళికలు చేసుకొని అమలు చేసుకోవాలన్న ఒప్పందం ఒప్పందంగానే మిగిలింది. మొక్కుబడిగా కొన్ని సమావేశాలు, ఫ్లకార్డులతో కొన్ని ప్రదర్శనలు, నినాదాలతోనే సరిపుచ్చుతున్నాం. పరిరక్షణకు పెద్దగా కార్యాచరణలేవీ కన్పించడం లేదు. ప్రకృతిని పరిరక్షించుకోకపోతే మనకు భవిష్యత్తు లేదన్న సత్యాన్ని విస్మరిస్తున్నాం.
ప్రతి సంవత్సరం ప్రపంచంలో సుమారుగా కోటి హెక్టార్ల అటవీ విస్తీర్ణం నష్టం వాటిల్లుతోంది. భారత్‌లో అరవై ఆరు వేలకు పైగా హెక్టార్ల సహజ అటవీ ప్రాంతం కనుమరుగవుతోంది. భారత్‌లో 7,13,789 చ.కి. మీటర్ల అటవీ విస్థీర్ణం ఉంది,దేశ భూభాగంలో ఇది 21.7 శాతం మాత్రమే. ఇక తెలంగాణలో ఈ విస్థీర్ణం 26,904 చ.కి.మీటర్లు ఉండగా, మొత్తం భౌగోళిక విస్థీర్ణంలో 24.69 శాతం మాత్రమే. ఇటీవల నివేదికల ప్రకారం 105.87 శాతం మేర అటవీ విస్థీర్ణం తగ్గిందని తెలుస్తోంది. ఇది మంచి పరిణామం కాదు.అంటే ప్రపంచవ్యాప్తంగా అడవులు రోజురోజుకూ కుంచించుకు పోతున్నాయి. అడవుల్ని, సముద్రాలను నాశనం చేసు కుంటే ఇక మొత్తం ప్రకృతిని మనం ప్రమాదంలోకి నెట్టినట్లే. ఈ విధ్వంసం వల్ల ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం పది లక్షల జీవజాతులు అంతరించే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల టన్నులకు పైగా ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుండగా, అందులో కనీసం ఎనలభై లక్షల టన్నుల వ్యర్ధాలు సముద్రా లలోకి చేరుతున్నాయి. సముద్రాలను వ్యర్ధాలతో ముంచి,కాలుష్యమయం చేసుకుంటున్నాం అంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు. మనిషి చేసే ఈ తప్పిదాల వల్ల సమస్త జీవరాశి ప్రమాదంలోకి నెట్టబడుతోంది. మనం పీల్చేగాలిలోని ఆక్సిజన్‌లో దాదాపుగా 50 నుంచి 70 శాతం ఆక్సిజన్ సముద్రాల వల్లే ఉత్పత్తి అవు తుందన్న స్పృహ మనిషికి ఎందుకు లేదు.దాదాపుగా జీవులన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా సముద్రాల పైనే ఆధారపడి జీవిస్తున్నాయన్నది కాదనలేని సత్యం.
ఇక అత్యంత సహజ వనరైన నీటిని మనిషి దారుణంగా దుర్వినియోగం చేస్తున్నాడు. రానున్న దశాబ్దాల లో నీటి కొరత మనిషిని అతలాకుతలం చేస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు చమురు కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. వచ్చే రెండు దశాబ్దాల కాలంలో నీటి కోసం దేశాల మధ్య యుద్ధాలను చూస్తాం! ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న మంచి నీటిలో సుమారుగా 70 శాతం కేవలం వ్యవ సాయ రంగానికే వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ రంగంలో నీటి వినియోగంలో విప్లవాత్మమైన మార్పు తెచ్చుకుని పొదుపు చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇక ఇటీవల ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల ప్రకృతి మరింత ప్రమాదంలో పడింది. ప్రపంచ వ్యాప్తంగా 11,700 డేటా సెంటర్లు ఉంటే ఇందులో సగం ఒక్క అమెరికాలోనే ఉన్నాయి. డేటా సెంటర్ల ఏర్పాటుపై అక్కడి ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది,దాంతో భారత్‌తో సహా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో డేటా సెంటర్ల ఏర్పాటునకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. భారత్‌లో ఇప్పటికే 150 ఉండగా మరో 30 రావడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిలో అటు వైజాగ్, ఇటు హైదరాబాద్‌కు కూడా డేటా సెంటర్లు రానున్నాయి. డేటా సెంటర్ల నిర్వాహణకు భారీ ఎత్తున విద్యుత్, నీరు అవసరం పడుతుంది. ఐక్యరాజ్య సమితి మేధో సంస్థ తాజా లెక్కల ప్రకారం 2030 నాటికి భూమి మీద డేటా సెంటర్లు మొత్తం కలిపి 328 టీఎంసీల నీటిని వాడుకుంటాయని తెలిపింది.ఒక డేటా సెంటర్ ఒక మెట్రో నగరానికి అవసరమైనంత విద్యుత్‌ను వినియో గిస్తుందని ఒక అంచనా. డేటా సెంటర్లు ఏర్పాటు చేసే ప్రాంతాలలో నీరు, విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుంది. మనిషికి అవసరమైన ఎన్నో పనుల్ని సులువుగా వేగంగా చేసి పెట్టే ఆధునిక సాంకేతికత వైపు మనిషి పరుగులు పెట్టి , వచ్చే ముప్పును పెడచెవిన పెడుతున్నాడు.
ఇక వ్యవసాయ రంగంలో కూడా బిందు,తుంపర సేద్యంతో పాటు మరింత ఆధునిక పద్ధతుల్ని ఇముడ్చు కోవాలి. లేకపోతే 2050 నాటికి ప్రపంచ జనాభాలో సుమారుగా యాభై శాతం మంది నీటి కొరతను ఎదుర్కొనే ప్రాంతాల్లో నివసించే దుస్థితి ఏర్పడుతుందన్న హెచ్చరికల్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ప్రకృతి విధ్వంసం వల్ల విపరీతంగా పెరిగిపోతున్న ఈ ఉష్ణోగ్రతలతో పంట దిగుబడులు 10 నుంచి 25 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇన్ని హెచ్చరికలు వస్తున్నా పాలకులు భూతాపాన్ని తగ్గించే చర్యలకు ఏమాత్రం ఉపక్రమించడం లేదు. పెట్టుబడిదారుల ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ప్రకృతిని పరిరక్షించుకోవాలన్న స్పృహ సర్వత్రా రావాలి. ముఖ్యంగా విద్యార్థులకు ప్రాథమిక స్థాయినుంచే కలిగించాలి. తరగతి గదిలో ప్రతి క్లాస్ చివరి ఐదు నిముషాలు ప్రకృతి ,కాలుష్యం, అడవుల సంరక్షణ, వాతావరణ మార్పులు, జీవ వైవిధ్య నష్టం, నీటి పొదుపు లాంటి అంశాలపై విద్యార్థులకు వివరించాలి. సహజ వనరుల దుర్వినియోగం వల్ల కలిగే నష్టాల్ని కథల రూపంలో చెపితే ఇంకా మంచిది. మన జీవనంతో పాటు సమస్త జీవరాశుల ఉనికి ప్రకృతిని మంచిగా ఉంచినంత వరకే , మరి ఆ ప్రకృతిని కాపాడుకోకపోతే భవిష్యత్తే ప్రశ్నార్ధకమవుతుంది.
(జూలై 28, ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం)
పి.వి.రావు, 9010153065
భవిష్యత్తులో ‘‘పానీపట్టు’’ యుద్ధాలే!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



