నాణ్యమైన విద్యకోసం
ఏం చేయాలో మీరే చెప్పండి
ఒక్కో విద్యార్థిపై రూ.1.8 లక్షలు ఖర్చు చేస్తున్నా
తల్లిదండ్రులు ఎందుకు ప్రయివేటుకు పంపుతున్నారో ఆలోచించండి
టీచర్ల సమస్యలు పరిష్కరించే బాధ్యత నాదే
ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటించి వచ్చిన ఉపాధ్యాయ బృందంతో
సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందనీ, దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని సీఎం ఏ రేవంత్రెడ్డి అన్నారు. వారిద్దరి బాధ్యతను తానే స్వయంగా తీసుకుంటానన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామనీ, అదే సమయంలో ఉపాధ్యాయ సంఘాలు వారి కోసం కాకుండా విద్యార్థుల కోసం పోరాడాలని సూచించారు. గత ప్రభుత్వంలో ఏనాడూ 1వ తేదీ జీతాలివ్వలేదని గుర్తు చేశారు. ఆ పరిస్థితిని తాము మార్చామన్నారు. ప్రభుత్వం కోసం పని చేసే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వకపోతే అది పాలకుల వైఫల్యమేనని గుర్తించి, సరిదిద్దామని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్ కోసం పూర్తిగా అంకితం కావాలని ఆకాంక్షించారు. ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో ఇటీవల పర్యటించి వచ్చిన ఉపాధ్యాయుల బృందంతో గురువారం హైదరాబాద్ లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఆయన ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రిగా తనను వైదొలగాలని కొందరు కోరుతున్నారనీ, అయితే దానికిగల కారణాలు కూడా వారే చెప్పాలన్నారు. ‘‘విద్యార్థులకు నర్సరీ నుంచి ఇంటర్ వరకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ ఇస్తున్నందుకా?, టీచర్ల నియామకాలు, పదోన్నతులు నిర్వహించినందుకా?, ఐటీఐలను ఏటీసీలుగా మార్చి, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినందుకా?.. ఎందుకు నేను రాజీనామా చేయాలో చెప్పాలి’’ అని అడిగారు. తాను విద్యాశాఖను జిజ్ఞాసతో దగ్గర పెట్టుకున్నానని చెప్పారు. ఎల్కేజీ పిల్లలకు ఓట్లు ఉండవని చమత్కరించారు. గత ప్రభుత్వంలో మాదిరిగా రెవెన్యూ, ఆర్థిక, సాగునీరు వంటి కీలక శాఖలు తన వద్ద లేవని అన్నారు. భవిష్యత్ తరాన్ని ఉత్తమంగా, ఉన్నతంగా తీర్చిదిద్దడమే ఆ శాఖ మంత్రిగా తన బాధ్యత అని స్పష్టంచేశారు.
డిసెంబర్లోగా విద్యాభివృద్ధి నివేదిక ఇవ్వండి
విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ఇంకా ఏం చేయాలో సూచించాలని ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కోరారు. వచ్చే విద్యా సంవత్సరానికి ఏం చేస్తే బాగుంటుందో డిసెంబరులోగా నివేదిక రూపొందించి సమర్పించాలని ఆదేశించారు. ప్రతి మండలాన్ని ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసి ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. సమాజంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు విద్య పునాదిగా పని చేస్తుందన్న తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ వ్యాఖ్యలను సీఎం గుర్తు చేశారు. అందుకే విద్య రంగానికి, కరువును పారదోలేందుకు సాగునీటిపారుదలకు నెహ్రూ ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. ఆయన దూరదృష్టితోనే నేడు తెలంగాణ 2 కోట్లా 85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేయగలిగిందని తెలిపారు. హరిత విప్లవం, పంచవర్ష ప్రణాళికలు తెచ్చిన నాయకులు ఎవరో ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు.
నాటి గురుకులాలే నేటి ‘నవోదయాలు’
మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు ఏర్పాటు చేసిన గురుకులాలే నేటి నవోదయ విద్యాలయాలకు స్ఫూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆనాటి నాయకులు తెచ్చిన సంస్కరణలతో విద్య అందిందనీ, ఆకలి తీరిందని వివరించారు. కానీ నేటి ప్రపంచంతో పోటీ పడాలంటే అది సరిపోదని తెలిపారు. ప్రతీ పేదవాడిని ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దాలనీ, నాణ్యమైన విద్య, పౌష్టిక ఆహారం అందిచడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ఆ దిశగా తెలంగాణను తీర్చి దిద్దే ప్రతినిధులు ఉపాధ్యాయులేనని అన్నారు. వెనకబాటుతనానికి ఆస్తులు, అంతస్తులతో సంబంధం లేదనీ, విద్య లేకపోవడమే అసలైన వెనకబాటుతనమని ముఖ్యమంత్రి తెలిపారు.
విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి
ఒక్కో విద్యార్థిపై రాష్ట్ర ప్రభుత్వం రూ.1.8 లక్షలు ఖర్చు చేస్తున్నా… తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రయివేటు స్కూళ్లకే ఎందుకు పంపుతున్నారో ఆలోచించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. తల్లిదండ్రులు ఒక్కో పిల్లవాడిపై ఏడాదికి సుమారు రూ.50 వేలు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. అయితే తమ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఈ యేడాది సర్కారు బడుల్లో లక్ష మంది విద్యార్థులు అదనంగా చేరారని చెప్పారు. విద్యతోపాటు నైపుణ్యాలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఇంగ్లీష్ ఒక్కటే ముఖ్యమనుకుంటే చైనా ప్రపంచాన్ని ఎలా శాసిస్తోంది? అని సీఎం ప్రశ్నించారు.
జర్మనీ, జపాన్ వైపు చూడండి
ఉద్యోగాల కోసం 25 ఏండ్లుగా అమెరికా వైపు చూశామనీ, ఇప్పుడు ఎక్కువ అవకాశాలు ఉన్న జర్మనీ, జపాన్, సింగపూర్ లాంటి దేశాలపై దృష్టి సారించాలని సూచించారు. 12వ తరగతి తర్వాత విద్యార్థికి ప్రపంచంపై సంపూర్ణ అవగాహన రావాలన్నారు. దాన్ని కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని గుర్తుచేశారు. ప్రపంచ దేశాలు మనవైపు చూసేలా ప్రభుత్వ విద్యా సంస్థలను తీర్చిదిద్దుతామని, అందుకే అందరూ సహకరించాలని కోరారు. సమాజంలో మానవ సంబంధాలు విచ్ఛిన్నమైతే కుటుంబాలు, దేశాలు నిలబడలేవని చెప్పారు. విద్యావ్యవస్థలో విద్యతో పాటు మానవ సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఉపాధ్యాయులు తమ అనుభవాలు పంచుకోవాలి
ఉపాధ్యాయులు తమ అనుభవాలను పిల్లలతో పంచుకోవాలని సూచించారు. వారు ఉపాధ్యాయుల వద్దే ఎక్కువ సమయం గడుపుతారని, అందువల్ల తల్లిదండ్రులతో సమానమైన బాధ్యత టీచర్లపై ఉంటుందని గుర్తుచేశారు. విద్యార్థుల కోసం ఎంత ఖర్చు చేయడానికైనా తన ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ సంవత్సరం మాదిరిగానే ఐఏఎస్, ఐపీఎస్ లతో సమానంగా ప్రతీ ఏటా ఉపాధ్యాయులను విదేశాలకు పంపి చదువుకునేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. నాణ్యమైన విద్యపై అధ్యయనం చేసేందుకు అవసరమైన ఖర్చులను ప్రభుత్వమే భరించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని డే స్కాలర్ విద్యార్థులకు కూడా బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, పాఠశాల విద్య సంచాలకులు డాక్టర్ ఇ.నవీన్ నికోలస్, ఫిన్ లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటించి వచ్చిన అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అంతకు ముందు ఉపాధ్యాయుల బృందం పర్యటన విశేషాలతో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను సీఎం తిలకించారు. కాగా “టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్ పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్ చేంజ్” కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయ బృందం ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటించింది.



