విక్రమ్-1 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేసి, ప్రపంచం మెప్పు పొందిన స్కైరూట్ ఏరోస్పేస్ వెలసిన హైదరాబాద్ లోనే మూఢ నమ్మకాల ఉనికిపై, అదీ బాధ్యతాయుత పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు పదే పదే మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మన కండ్ల ముందే ప్రపంచం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అద్భుతాలను నమోదు చేస్తూ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్తుంటే…మన పేరు గొప్ప ప్రజాప్రతినిధులు ‘అపోహల వంటకాల’తో సమాజాన్ని వెనక్కు లాగడం అసంబద్ధమే. ఎల్ నినో ఎఫెక్ట్ తో తెలంగాణలోనే కాదు, యావత్ దేశంలోనూ ఇతర దేశాల్లోనూ దుర్భిక్షం నెలకొంటోందని, వచ్చే సెప్టెంబరు కల్లా తీవ్రత పెరుగుతుందని శాస్త్రవేత్తలు, నిపుణులు, ఇతరులు అంచనా వేస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఎల్ నినో ప్రభావం మీద ఇదివరకే కమిటీ వేయించి, నివేదిక కూడా తెప్పించుకున్నది. ఇదంతా నాణానికి ఒకవైపు, మరోవైపు రాష్ట్రంలో కీలక బాధ్యతల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, యంగ్ లీడర్లు కొందరు సరికొత్త పల్లవి అందుకున్నా రు. తెలంగాణలో కరువు కాటకాలు తాండవించాలని ఓ నేత క్షుద్ర పూజలు చేయించారంటూ వాగ్ధాటి దట్టించారు. ఈ తరం నాయకులూ శాస్త్రీయ ఆధారాలు లేని చేతబడుల గురించి కబుర్లు చెప్తుండడం విస్మయం కలిగిస్తోంది. కర్నాటక, తమిళనాడు ల్లోని ఫలానా ఆలయాల్లో ఆయన పూజలకు ఆయా నెలల్లో పూనుకున్నా రని కథనాలు వండి వార్చారు.
ఇంకా దుష్ట పూజలు చేయించబోతుంటేనే తాము బహిర్గతం చేస్తున్నామని కూడా సెలవిస్తున్నారు. చేతబడులు, క్షుద్ర పూజల వివాదాలు, ఆరోపణలు కొత్తకాదు. కానీ, జెన్ ఎక్స్ నుంచి నేటి జెన్ జీ, జెన్ ఆల్ఫా వరకూ ఆ కబుర్లు వినపడడం అవాంఛనీయం. సదరు రాష్ట్ర పెద్ద(ల) వ్యూహం, రాజకీయ లబ్ధి ఏందో కానీ, ఎండ్ ఆఫ్ ది డే వారి పార్టీ ప్రతిష్టకే మసక. తెలంగాణ కరువు కోరల్లో చిక్కుకోవాలని ఎవరు మాత్రం దుష్ట పూజలు చేస్తారు? పైగా అది మూఢనమ్మకం కూడా. పెద్ద పదవు ల్లోని నేతల నోట ఇట్లా అశాస్త్రీయ వ్యాఖ్యలు చర్వితచరణంగా దొర్లడం శోచనీయం. నిజంగానే క్షుద్ర పూజలు, చేతబడులు పనిచేస్తే ఉదాహరణకు అమెరికా – ఇరాన్ ఇంతటి ఘర్షణల దాకా పోకుండా వాటిపైనే ఆధారపడకపోవునా? మూఢ నమ్మకాలపై చైతన్యంతోపాటు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాల్సిన నేతలే ఇట్లా అపోహలను వ్యాప్తి చేయడం తగదు. రాజకీయ ఆరోపణలు చేసేందుకు ఎన్నో అంశాలు ఉంటాయి. కానీ ఈ రకమైన అభూత కల్పనలతో విమర్శలకు తావివ్వకూడదు.
ఇ. దుర్గాప్రసాద్, 9440850384



