నవతెలంగాణ-హైదరాబాద్: నేపాల్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రముఖ ర్యాప్ గాయకుడు బాలెన్ షాకు (బాలేంద్ర షా) భారత ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య స్నేహబంధాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మోదీ ‘ఎక్స్’ వేదికగా తన సందేశాన్ని పంచుకున్నారు. “నేపాల్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన బాలెన్ షాకు హృదయపూర్వక అభినందనలు. మీ నాయకత్వంపై నేపాల్ ప్రజలు ఉంచిన నమ్మకానికి ఈ నియామకం నిదర్శనం. ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాల కోసం భారత్-నేపాల్ స్నేహాన్ని, సహకారాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు మీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను” అని మోదీ పేర్కొన్నారు.
శుక్రవారం నేపాల్ నూతన ప్రధానిగా రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) పార్లమెంటరీ పార్టీ నేత బాలెన్ షా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 76(1) ప్రకారం బాలెన్ షాను ఆ పదవిలో నియమించినట్లు నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.



