పూర్ణాహుతికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు
రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ప్రజల సర్వతోముఖ శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెల పదో తేదీన నాగార్జున సాగర్‌లో మహా వరుణయాగం నిర్వహిస్తున్నామనీ, పూర్ణాహుతి కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలనీ, కృష్ణా–గోదావరి మహానదులు జలకళతో పరవళ్లు తొక్కాలనీ, నాగార్జునసాగర్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జలాశయాలు, రిజర్వాయర్లు, చెరువులు సంపూర్ణంగా నిండిపోవాలని, ఎల్‌నినో వంటి ప్రకృతి వైపరీత్యాల ప్రభావం తెలంగాణపై లేకుండా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ మహాయాగాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కృష్ణానది తీరాన నాగార్జునసాగర్ జలాశయం విజయవిహార్ ప్రాంగణంలో యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది ఋత్వికులు, 11 హోమకుండాలు, వేదఘోషల మధ్య అత్యంత వైభవోపేతంగా మహా వరుణయాగం నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. పూర్ణాహుతికి సీఎం హాజరవుతారని తెలిపారు. వరుణయాగంలో ప్రజలు, రైతులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.



