సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి
మంత్రి వివేక్ హామీ
గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టీకరణ
సంక్షేమ చట్టం అమలుకు త్వరలో మార్గదర్శకాలు
నేటి నుంచి తలపెట్టిన సమ్మె విరమణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్ల యూనియన్లతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కార్మికుల సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించటంతో శనివారం నుంచి నిర్వహించతలపెట్టిన సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు యూనియన్ ప్రతినిధులు ప్రకటించారు. గిగ్, ప్లాట్ఫామ్ కార్మికుల సమస్యలపై చర్చించేందుకు ఆ శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి శుక్రవారం సచివాలయంలో యూనియన్ల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ప్రధాన డిమాండ్లు, సంక్షేమం, సామాజిక భద్రత తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. గిగ్, ప్లాట్ఫామ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడంతోపాటు వారి హక్కులను పరిరక్షించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. దాన్ని సమర్థంగా అమలు చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందిస్తోందని చెప్పారు. వాటిని త్వరలోనే అమల్లోకి తీసుకొస్తామని వెల్లడించారు. చట్టానికి సంబంధించిన మార్గదర్శకాలు అమల్లోకి వచ్చే వరకు గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్లు, యూనియన్లు ఓపిక పట్టాలని కోరారు. కార్మికులకు మేలు జరిగేలా అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. చర్చలపై గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్ల యూనియన్ల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. తమ సమస్యలు, డిమాండ్లపై మంత్రి సానుకూలంగా స్పందించడంతోపాటు వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారని తెలిపారు. ఈ సమావేశంలో కార్మికశాఖ అదనపు కమిషనర్ గంగాధర్, రవాణా శాఖ అధికారులు, గిగ్, ప్లాట్ఫామ్ యూనియన్ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
గిగ్ వర్కర్లతో ప్రభుత్వ చర్చలు సఫలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



