Saturday, August 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‌చట్టబద్ధమైన అనుమతుల సమీక్ష సరికాదు

‌చట్టబద్ధమైన అనుమతుల సమీక్ష సరికాదు

- Advertisement -

సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టుకు అనుమతులివ్వాలి
తెలంగాణ న్యాయమైన నీటి హక్కులను కాపాడాలి
కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌‌కు హరీశ్‌‌రావు లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా, సాంకేతికంగా అనుమతులు పొందిన తెలంగాణకు చెందిన ఏడు ప్రాజెక్టులను మళ్లీ సమీక్షించే అంశాన్ని ఈనెల 18న జరిగే గోదావరి రివర్‌ ‌మేనేజ్‌‌మెంట్‌ ‌బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశం ఎజెండాలో చేర్చడాన్ని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌‌రావు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ ‌పాటిల్‌‌తోపాటు, ఆ శాఖ కార్యదర్శికి శుక్రవారం ఆయన లేఖ రాశారు. కేంద్రం ఇప్పటికే చట్టబద్ధంగా ఇచ్చిన అనుమతులను జీఆర్‌ఎంబీ సమావేశం సమీక్షించడం సరికాదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అత్యున్నత సంస్థలు చట్టబద్ధంగా అనుమతులు ఇచ్చాక ఆ నిర్ణయాలను మళ్లీ సమీక్షించే లేదా రద్దు చేసే అధికారం జీఆర్‌ఎంబీలాంటి కింది స్థాయి సంస్థకు ఏ మాత్రం ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణలోని కాళేశ్వరం, చౌటుపల్లి హనుమంత్ రెడ్డి, ముక్తేశ్వరం, చనాక-కొరాట, మోడికుంటవాగు, కడెం-గూడెం, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ వంటి కీలక ప్రాజెక్టులకు సుదీర్ఘ ప్రక్రియ తర్వాతే అనుమతులు వచ్చాయని గుర్తు చేశారు. ఇప్పుడు వాటిని మళ్లీ సమీక్షించాలని ఎజెండాలో పెట్టడం సరికాదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఇచ్చిన అనుమతులను మళ్లీ సమీక్షించేలా అవకాశం ఇస్తే, భవిష్యత్తులో జలశక్తి శాఖ, సీడబ్ల్యూసీ ఇచ్చే ప్రతి అనుమతిపైనా అనిశ్చితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల తెలంగాణలో సాగునీటి అభివృద్ధి కుంటు పడటంతోపాటు, కోట్లాది మంది రైతుల జీవనోపాధి, తాగునీటి భద్రత ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. ఎజెండాలో పేర్కొన్న వివాదాస్పద అంశాలను తొలగించాలని డిమాండ్‌ ‌చేశారు. పెండింగ్‌లో ఉన్న సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ అనుమతులను తక్షణమే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ న్యాయమైన నీటి హక్కులను కాపాడేందుకు ఏపీ పునర్విభజన చట్టం 2014, సెక్షన్ 85 కింద తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -