తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
నేడు ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవాన్ని జయప్రదం చేయాలని పిలుపు
గోడపత్రిక ఆవిష్కరణ
నవతెలంగాణ-చార్మినార్
సహజ వనరులపై గిరిజనులకు ఉన్న సంప్రదాయ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, వారి ప్రత్యేక సంస్కృతి, భాష, ఆచారాలు, విశ్వాసాలను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డిమాండ్ చేశారు. శనివారం ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా జయప్రదం చేయాలని తెలంగాణ గిరిజన సంఘం పిలుపునిచ్చింది. ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవానికి సంబంధించిన గోడపత్రికను శుక్రవారం హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్‌లో తెలంగాణ గిరిజన సంఘం కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు ఎం. ధర్మ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీరాం నాయక్ ఆవిష్కరించారు. అనంతరం సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఆగస్టు 9 నుంచి 13వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ అవగాహన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గిరిజన తెగల హక్కులు, అస్తిత్వం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు గుర్తింపుగా ఐక్యరాజ్యసమితి 1994లో ఆగస్టు 9ను ప్రపంచ గిరిజన దినోత్సవంగా ప్రకటించిందని గుర్తుచేశారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ఆదివాసీ, గిరిజన తెగల హక్కులు, అస్తిత్వం ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను బలహీనపరిచేలా చట్టాల్లో మార్పులు తీసుకొస్తున్నారని తెలిపారు. అటవీ ప్రాంతాల్లో తరతరాలుగా నివసిస్తున్న గిరిజనులను నిర్వాసితులను చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ సంరక్షణ చట్టం–2023 వంటి నిబంధనలు గిరిజన హక్కులకు భంగం కలిగించే ప్రమాదం ఉందన్నారు. గిరిజన ప్రాంతాల్లోని అటవీ, ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధానాలను కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తోందని విమర్శించారు. 2027 జనాభా లెక్కల్లో మతం విభాగంలో “షెడ్యూల్డ్ ట్రైబ్ విశ్వాసాలు” లేదా “ప్రకృతి ఆరాధకులు” పేరుతో ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనివల్ల గిరిజనుల ప్రత్యేక సంస్కృతిక అస్తిత్వానికి అధికారిక గుర్తింపు లభిస్తుందన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గిరిజనులకు ఇచ్చిన 16 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. భూమి హక్కులు, విద్య, ఉపాధి, సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక భద్రత తదితర అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సౌత్ జిల్లా అధ్యక్షుడు వి. రాంకుమార్, కార్యదర్శి ఎం. బాలు నాయక్, నాయకులు ఆంగోత్ కృష్ణ నాయక్, ఎస్. కిషన్ నాయక్, రంగారెడ్డి జిల్లా నాయకులు ఎం. గోపీ నాయక్, మోహన్, బిందు తదితరులు పాల్గొన్నారు.
సహజ వనరులపై గిరిజనులకు హక్కు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



