కోటీశ్వరులకు రైతుబంధు పథకమా? : హైకోర్టు వ్యాఖ్యలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సంక్షేమ పథకాల పేరిట విచక్షణ లేకుండా ఉచితాలను విస్తరించటమనేది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలోకి నెడుతుందంటూ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ఆర్థిక అత్యవసర పరిస్థితి తలెత్తే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. అర్హతలతో సంబంధం లేకుండా పథకాలు అమలు చేయడం వల్ల ప్రభుత్వంపై అసహజమైన భారం పడుతోందని పేర్కొంది. కంటోన్మెంట్ బోర్డుకు రూ.33.42 కోట్ల బకాయిల చెల్లింపుల విషయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంతో దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ ను జస్టిస్ నగేశ్ భీమపాక శనివారం విచారించారు. హైకోర్టు జారీ చేసిన బెయిలబుల్ వారెంట్‌ల నేపథ్యంలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా కోర్టుకు హాజరయ్యారు. ఇప్పటికే రూ.25.70 కోట్లు చెల్లించామని, మిగిలిన మొత్తాన్ని ఆరు నెలల్లో విడతల వారీగా చెల్లిస్తామని ఆయన కోర్టుకు తెలిపారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కోర్టు ఆదేశాలిచ్చి రెండేండ్లు రెండేళ్లు దాటినా అవి అమలు కాలేదని ఆక్షేపించారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి పాలనలో సమిష్టి బాధ్యతపై ప్రశ్నలు లేవనెత్తారు. సమాజంలో పౌరులు తమ బాధ్యతలను నిర్వర్తించని పరిస్థితిలో ప్రభుత్వ యంత్రాంగం మాత్రమే బాధ్యత వహించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రానికి లక్షల కోట్ల ఆదాయం వస్తున్నప్పటికీ అప్పులు, వేతనాలు, ఇతర ఖర్చులు పోగా మిగిలే మొత్తం చాలా పరిమితమని, అందులో అధిక భాగం సంక్షేమ పథకాలకే వెళ్తోందని హైకోర్టు పేర్కొంది. ఈ పరిస్థితి కొనసాగితే భవిష్యత్తు తరాలకు ఏం మిగులుతుందన్న ప్రశ్నను ప్రభుత్వం ఆలోచించాలని సూచించింది. ఉచితాల అమలు విధానం లోపభూయిష్టంగా ఉందని, అనర్హులకు పెద్దవాట చేరుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఖరీదైన వాహనాలు, మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నవారే ఉచిత బియ్యం కోసం రావడం వంటి వాటిని ఉదహరిచింది. ప్రభుత్వ సంక్షేమ ఉచిత పథకాల అమల్లో లక్ష్యభ్రంశం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపింది. అర్హులైన వారికి సహాయం అందించడం తప్పుకాదని, అయితే కోటీశ్వరులకు కూడా రైతుబంధు వంటి పథకాలు అందడం వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపుతోందని వ్యాఖ్యానించింది. సమాజంలో పని చేయాలనే మనస్తత్వం తగ్గిపోతున్నదన్న అంశంపై కూడా న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను రప్పించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఉచితాలపై అధిక ఆధారపడటం వల్ల ప్రజల్లో పనికి విలువ తగ్గిపోతుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
అధికారులపై పెరుగుతున్న కేసుల భారంపై కూడా కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఒక్కో అధికారిపై వేల సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉండడం వల్ల పరిపాలనలో నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతోందని తెలిపింది. ఈ పరిస్థితుల్లో ఎవరైనా అధికారిగా ఉన్నా సమర్థవంతంగా పని చేయడం కష్టసాధ్యమని అభిప్రాయపడింది. అప్పులు తీర్చేందుకు ప్రభుత్వ ఆస్తులను విక్రయించడం వంటి చర్యలపై కూడా కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. కుటుంబ ఆదాయానికి మించి ఖర్చు చేస్తే ఎలా సమస్యలు వస్తాయో, అదే విధంగా ప్రభుత్వ ఆర్థిక నిర్వహణలో కూడా నియంత్రణ అవసరమని సూచించింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యయ నియంత్రణ అవసరమని స్పష్టం చేసింది. విద్యా వ్యవస్థలోనూ మార్పుల అవసరాన్ని కోర్టు ప్రస్తావించింది. చదువుపై దృష్టి తగ్గిపోవడం, విద్యార్థులు వ్యవస్థను దుర్వినియోగం చేయడం వంటి అంశాలు సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది. కష్టపడి చదివే వారికి మాత్రమే సాయాన్ని కేంద్రీకరించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రాష్ట్రంలో అధిక శాతం కుటుంబాలు సంక్షేమ పథకాలపై ఆధారపడుతున్న పరిస్థితిని ప్రస్తావిస్తూ, ఈ విధానం దీర్ఘకాలంలో కొనసాగడం సాధ్యం కాదని కోర్టు హెచ్చరించింది. సమాజం మొత్తం ఉత్పాదకతను కోల్పోతే దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడుతుందని పేర్కొంది. ఇది రాజకీయ వ్యాఖ్య కాదని, సాధారణ పౌరుడు వ్యక్తం చేసే ఆందోళనగా భావించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. మొత్తం పరిస్థితిని సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వం సముచిత నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. చివరగా కంటోన్మెంట్ బోర్డు చెల్లింపుల అంశంపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సందీప్‌కుమార్ సుల్తానియాను ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేశారు.
పోలీస్ స్టేషన్ కార్మికులకు కనీస వేతనాలు తప్పనిసరి
స్పష్టం చేసిన హైకోర్టు
పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్న స్వీపర్లు, అటెండర్లు, స్కావెంజర్లు తదితరులకు కనీస వేతనాలు చెల్లించాలంటూ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఈ చెల్లింపులు తుది తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. నల్గొండ జిల్లాకు చెందిన ఉప్పల మల్లికార్జునతో పాటు మరో 48 మంది కార్మికులు తమకు కనీస వేతనాలు అమలు కాకపోవటాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ నగేశ్ భీమపాక విచారించారు. పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది కనీస వేతనాల చట్టం అమల్లో ఉన్నప్పటికీ అవి సరైన విధంగా అమలు కావడంలేదని వివరించారు. సుప్రీంకోర్టు తీర్పులు కూడా కనీస వేతనాల ప్రాధాన్యతను స్పష్టం చేశాయని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున ఔట్‌సోర్సింగ్ విధానంలో కార్మికులను నియమిస్తున్నామని, నిర్ణయించిన వేతనాలే చెల్లిస్తున్నామని వాదించారు. అయితే పిటిషనర్లు ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్నందున వారికి కలెక్టర్ ప్రకటించిన కనీస వేతనాల ప్రకారం చెల్లింపులు జరగాలని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.
సల్కం చెరువు కేసులో
ఉన్నతాధికారులకు నోటీసులు
పాతబస్తీలోని బండ్లగూడ ప్రాంతంలో సల్కం చెరువు భూముల వ్యవహారంలో కోర్టుకు తప్పుడు వివరాలు సమర్పించారనే ఆరోపణలపై హైకోర్టు కీలక చర్యలు చేపట్టింది. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. సంబంధిత భూమి చెరువుకు చెందిందనే అంశంపై గతంలో కోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చినా, వాటికి విరుద్ధంగా అధికారులు కొత్త వివరాలు సమర్పించారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఎఫ్‌టీఎల్ నోటిఫికేషన్ ప్రక్రియలోనూ అక్రమాలు జరిగాయని, నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి సంబంధిత అధికారులను ప్రతివాదులుగా చేర్చడానికి అనుమతిస్తూ, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. కేసు విచారణను ఈనెల 11వ తేదీకి వాయిదా వేశారు.
అతిగా ఉచితాలు.. అస్తవ్యస్తంగా ఆర్థిక వ్యవస్థ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


