బీజేపీ నిర్ణయాలతో
చేనేత రంగానికి తీవ్ర అన్యాయం
5 శాతం జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి
చేనేత సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలి
సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ బహిరంగలేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నల కడుపు కొడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) విమర్శించారు. ఈ మేరకు రాష్ట్రంలోని నేతన్నల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి శుక్రవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్ హయాంలో అమలైన చేనేత సంక్షేమ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నేతన్నలకు ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ అమలు కాలేదని తెలిపారు. చేనేత రంగం విషయంలో బీజేపీ-కాంగ్రెస్ వైఖరి ఒక్కటేనని విమర్శించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలతోనూ నేతన్నలకు తీవ్ర నష్టం జరుగుతున్నదని తెలిపారు. చేనేత రంగానికి కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు, హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డు, పవర్లూమ్ బోర్డులను రద్దు చేయడం, హౌస్ కమ్ వర్క్‌షెడ్ వంటి పథకాలను ఎత్తేయడం, చేనేత ఉత్పత్తులపై ఐదు శాతం జీఎస్టీ విధించడం వంటి నిర్ణయాలు చేనేత రంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని పేర్కొన్నారు.
చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే విధానాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని సూచించారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ కలిసి చేనేత రంగాన్ని సంక్షోభం వైపు నెడుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేనేత సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా నిలిపేసిందని ఆరోపించారు. ప్రస్తుతం ‘నేతన్న బీమా’ అమలు కావడం లేదనీ, ‘నేతన్నకు చేయూత’ పథకం చెల్లింపులు పూర్తిగా ఆగిపోయాయని వివరించారు. చేనేత సహకార సంఘాలకు ఇవ్వాల్సిన పావలా వడ్డీ రుణాలు, మార్కెటింగ్ రిబేట్లు నిలిచిపోయాయనీ, బతుకమ్మ చీరలు, ప్రభుత్వ యూనిఫారాల వంటి ప్రభుత్వ ఆర్డర్లలో నేతన్నలకు గతంలో ఇచ్చిన ప్రాధాన్యతను తగ్గించారని విమర్శించారు. ప్రభుత్వ ఆర్డర్లు అన్ని కమీషన్ల కోసం ప్రయివేట్ సంస్థలకు, వ్యక్తులకు అప్పజెప్తున్నారని తెలిపారు. నేతన్నల కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయనీ ప్రశ్నించారు. చేనేత భరోసా కింద ప్రతి ఏటా రూ.18 వేల ఆర్థిక సాయం, అనుబంధ కార్మికులకు రూ.ఆరు వేల సహాయం, రూ.లక్ష వరకు వ్యక్తిగత రుణమాఫీ, చేనేత సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ రుణాల మాఫీ, కేంద్రం విధిస్తున్న ఐదు శాతం జీఎస్టీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్న హామీల్లో ఒక్కటీ అమలు కాలేదని విమర్శించారు. రెండున్నరేండ్లు గడిచినా నేతన్నలకు ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని తెలిపారు. ‘నేతన్న బీమా’, ‘నేతన్నకు చేయూత’ పథకాలను వెంటనే ప్రారంభించి బకాయిలు విడుదల చేయాలని కోరారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన చేనేత భరోసా, రుణమాఫీ, జీఎస్టీ రీయింబర్స్మెంట్ హామీలను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోసపూరిత వైఖరిని వీడి నేతన్నల కుటుంబాలకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
నేతన్న కడుపు కొడుతున్న కాంగ్రెస్ సర్కారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



