Tuesday, August 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమోడీ సర్కారుకు గుణపాఠం తప్పదు

మోడీ సర్కారుకు గుణపాఠం తప్పదు

- Advertisement -

ప్రజావ్యతిరేక విధానాలు మానుకోవాలి
నాలుగు లేబర్‌ కోడ్లు రద్దు చేయాలి
రాష్ట్ర వ్యాప్తంగా జైల్‌భరో విజయవంతం
అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు
నాయకుల అరెస్టులు.. తోపులాటలు
మహిళల పట్ల పోలీసుల దురుసు ప్రవర్తన
నవతెలంగాణ- మొఫసిల్‌ యంత్రాంగం

​కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోకపోతే మోడీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు.. వెంటనే ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలి.. కార్మిక కోడ్‌లను రద్దు చేయాలి.. విద్యుత్‌ సవరణ చట్టాన్ని నిలిపేయాలి..’ అంటూ కార్మిక, కర్షక, యువజన, విద్యార్థులు, ప్రజలు నినదించారు. క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సోమవారం వామపక్ష పార్టీలు, సీఐటీయూ, తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఐద్వా, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర వ్యాప్తంగా జైల్‌భరో కార్యక్రమంలో భాగంగా రాస్తారోకోలు, ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు. పోలీసులు అడుగ డుగునా అడ్డుకోవడంతోపాటు నాయకులు, కార్మికులను పోలీ సులు అరెస్టు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.ఉమ్మడి మెదక్‌ జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలలో రాస్తారోకోలు నిర్వహించారు. సంగారెడ్డిలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, రాష్ట్ర కార్యదర్శి బీరం మల్లేశం, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జి.జయరాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సిద్దిపేట, మెదక్‌ జిల్లా కేంద్రాల్లో రాస్తారోకో నిర్వహించారు.

​ఖమ్మం జిల్లాలో..
ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నాయకుల్ని, కార్మికుల్ని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. బోనకల్‌లోని ఖమ్మం బస్టాండ్‌ సెంటర్‌లో సుమారు రెండు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. ఎర్రుపాలెం మండలంలో పోలీసులు నాయకులను అడ్డుకొని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. తల్లాడ, సత్తుపల్లిలో అరెస్టు చేశారు. ఏన్కూరు తహసీల్దార్‌ కార్యాలయం నుంచి ప్రధాన రహదారి మీదుగా పాత చెక్‌ పోస్ట్‌ వరకు నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి, ప్రధాన సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. నేలకొండపల్లిలో ఖమ్మం కోదాడ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. వేంసూరులో మర్లపాడు సెంటర్‌లో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రాస్తారోకో సందర్భంగా పోలీసులు సుమారు 150 మంది ఆందోళనకారులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 10 మంది నేతలపై నమోదు చేసినట్టు నాయకులు తెలిపారు. చర్లలో ర్యాలీగా వెళ్లి అంబేద్కర్‌ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. అరెస్టులకు నిరసనగా కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని జైల్‌భరో నిర్వహించారు. భద్రాచలం పట్టణంలోని బ్రిడ్జి సెంటర్‌ వద్ద భారీగా రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా తోపులాట జరిగింది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కొత్తగూడెం రైల్వేస్టేషన్‌ సెంటర్‌లో రహదారిపై బైటాయించారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి వన్‌టౌన్‌, త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్లకు తరలించారు.

​చిరిగిన పోతినేని చొక్కా.. కార్యకర్తకు అస్వస్థత
కొత్తగూడెం సూపర్‌బజార్‌ సెంటర్‌లో మానవహారం చేపట్టి రోడ్డుపై బైటాయించిన సీఐటీయూ, ఏఐకేఎస్‌, ఏఐఏడబ్ల్యూయూ నాయకులు, కార్యకర్తలను పోలీసులు బలవం తంగా అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు దురుసుగా ప్రవర్తించి నాయకులు, కార్యకర్తలను ఈడ్చుకెళ్లారు. మహిళలను బలవంతంగా తరలించే క్రమంలో మహిళా కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు మహిళలకు గాయాలయ్యాయి. ఒకరికి ముక్కు నుంచి రక్తం కారింది. ధర్నాలో పాల్గొన్న రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావును పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని వాహనంలో తరలించే క్రమంలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ఆయన చొక్కా చిరిగిపోయింది. మరో కార్యకర్త స్పృహ తప్పి పడిపోవడంతో వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

​ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో..
మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రంలోని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ, బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం ముందు రాస్తారోకో నిర్వహించారు. ఈ క్రమంలో నాయకులు పోలీసులు బలవంతంగా డీసీఎంలో ఎక్కించి తరలిస్తుండగా కార్మికులు, రైతులు అడ్డుకున్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్‌ చౌరస్తాలో రోడ్డుపై బైటాయించారు. మక్తల్‌ పట్టణంలోనూ భారీ, ర్యాలీ రాస్తారోకో చేపట్టగా పోలీసులు అరెస్టు చేశారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో జైల్‌భరోలో పాల్గొన్న పలువురిని అరెస్టు చేశారు. గద్వాల జిల్లా కేంద్రంలో జైల్‌భరోలో సీపీఐ(ఎం), ప్రజాపంట్‌, టీఆర్‌ఎస్‌, బహుజన రాజ్యాధికారం నాయకులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది.

​ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో..
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కేంద్రంలో ర్యాలీ తీసి సాగర్‌ హైవేపై బైటాయించారు. పోలీసులు నాయకులను అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. దీంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. అదనపు బలగాలతో పోలీసులు నాయకులను అరెస్టు చేసి వివిధ పీఎస్‌లకు తరలించారు. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోనూ జైల్‌భరో జరిగింది.

​ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో..
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో జైల్‌భరో విజయవంతమైంది. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో అంబేద్కర్‌ చౌక్‌ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు కార్మికులు, రైతులు పెద్ద సంఖ్యలో ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఆదిలాబాద్‌లో కార్మిక సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌ చౌక్‌లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో బస్టాండ్‌ వద్ద రాస్తారోకో నిర్వహించారు. చెన్నూర్‌లో భారీ ర్యాలీ తీశారు. బెల్లంపల్లిలో నిరసన వ్యక్తం చేశారు. తాండూర్‌లో ర్యాలీ చేపట్టిన అనంతరం జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌నుంచి బస్టాండ్‌ చౌరస్తా వరకు భారీ ర్యాలీగా వెళ్లి రాస్తారోకో చేపట్టారు.

​ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా జైల్‌ భరో
‘జైలు భరో’ కార్యక్రమం ఉమ్మడి జిల్లా వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తతకు దారితీసింది. జనగామ, హనుమకొండ(సుబేదారి), మహబూబాబాద్‌, మరిపెడ, తొర్రూరు, కేసముద్రం, ములుగు తదితర ప్రాంతాల్లో భారీ రాస్తారోకోలు, ప్రదర్శనలు నిర్వహించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో పలుచోట్ల తోపులాటలు, వాగ్వాదాలు జరిగి, స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. జనగామ జిల్లా నెహ్రూ పార్క్‌ వద్ద రాస్తారోకో నిర్వహించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట భారీ రాస్తారోకో నిర్వహించారు. సుబేదారి పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైటాయించి ధర్నా చేశారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. మరిపెడలో భారీ ర్యాలీ చేపట్టారు. తొర్రూరులో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించగా, పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట జరిగింది. ములుగు జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారి 163పై రాస్తారోకో చేశారు.
​స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలి

సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య
కరీంనగర్‌, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లా కేంద్రాలు సహా పెద్దపల్లి జిల్లాలోని కార్మికక్ష్షేత్రం గోదావరిఖనిలో భారీ ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. గోదావరిఖని టీ-జంక్షన్‌ వద్ద జరిగిన రాస్తారోకోలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌. వీరయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం దేశ వనరులను విదేశీ సంస్థలకు తాకట్టు పెడుతోందని ఆరోపించారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో కళాభారతి నుంచి భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. అనంతరం పలువురు నాయకులను అరెస్టు చేశారు. రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు తీసి రాస్తారోకోలు చేపట్టారు.

​అడుగడుగునా పోలీసుల ఆంక్షలు
నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో కార్మిక రైతు సంఘాలు జైల్‌భరో కార్యక్రమాన్ని నిర్వహించాయి. శాంతియుతంగా నిరసన చేపట్టిన నాయకులపై పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. నిజామాబాద్‌లో ఎన్‌టీఆర్‌ చౌరస్తా వరకు ర్యాలీ తీయగా.. పోలీసులు నాయకులను ఈడ్చు కుంటూ వాహనాల్లో ఎక్కించి పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ర్యాలీగా వెళ్తున్న వారిని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. నాయకులను లాక్కుంటూ తీసుకెళ్లి డీసీఎంలలో పోలీస్‌ స్టేషన్‌లకు తరలించారు.

​కార్పొరేట్లకు అనుకూలంగా బీజేపీ ప్రభుత్వం: జూలకంటి
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని బస్టాండ్‌ ముందు రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు ధర్నా చేస్తున్న జూలకంటితో పాటు ఆయా సంఘాల నాయకులను బలవంతంగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటి బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన క్విట్‌ ఇండియా ఉద్యమస్ఫూర్తితో కార్పొరేట్‌ పెట్టుబడిదారులకు, మతోన్మాదులకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు.సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ ప్రదర్శన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జాతీయ రహదారి వైపు ప్రదర్శనగా వెళ్తున్న నిరసనకారులను పోలీసులు పలుచోట్ల అడ్డుకోవడంతో పరిస్థితిఉద్రిక్తంగా మారింది. మహిళా నాయకులను అరెస్టు చేసే క్రమంలో సూర్యాపేట డీఎస్పీ దురుసుగా వ్యవహరించారని ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మల్లు లక్ష్మి, ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర నాయకులు మండారి డేవిడ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ప్రజల హక్కుల కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని అన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ర్యాలీ, ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండీ.జహంగీర్‌ మాట్లాడుతూ కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులు, రైతుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు.

హైదరాబాద్‌లో..
హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ చౌరస్తాలో భరో కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు పాల్గొని ప్రసంగించారు. నాయకులను పోలీసులు అరెస్టు చేసి అనంతరం విడుదల చేశారు. సంతోష్‌నగర్‌ చౌరస్తాలో రాస్తారోకోలో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఈసీఐఎల్‌ కమలానగర్‌లో భారీ ర్యాలీ, రాస్తారోకో చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -