మోసాలకు పాల్పడుతున్న నలుగురి అరెస్ట్
నవతెలంగాణ-సిటీబ్యూరో
‘గుప్త నిధుల’ పేరుతో ప్రజలను మోసగిస్తున్న ముఠా గుట్టును రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. విశ్వనీయ సమాచారం అందుకున్న శంషాబాద్ జోన్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రాజేంద్రనగర్ పోలీసుల భాగస్వామ్యంతో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. రెండు కార్లు, ఆటో, రెండు మోటార్ సైకిళ్లు, నాలుగు సెల్ ఫోన్లుతోపాటు 25 నకిలీ (బంగారు పూత పూసిన) నాణేలు, ఆరు కేజీల బొగ్గు, నాలుగు కేజీల మట్టిని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్సు డీసీపీ కెఎస్.రావు తెలిపిన వివరాల ప్రకారం..
గుడిమల్కాపూర్‌కు చెందిన మహ్మద్ మునావర్ అలియాస్ మున్నా, ఈసీఐఎల్ జవహర్ నగర్‌కు చెందిన సయ్యద్ అలీ అష్రఫ్, మహ్మద్ హాజీ, కీసర యాదగిరిపల్లికి చెందిన మహ్మద్ సల్మాన్ ఒక ముఠాగా ఏర్పడ్డారు. ప్రధాన నిందితుడు మహ్మద్ మునావర్ చదువు పూర్తయిన తర్వాత కార్ల డెంటింగ్, పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగించాడు. అయితే, వచ్చే ఆదాయం కుటుంబ ఖర్చులకు సరిపోకపోవడంతో, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక కుట్ర పన్నాడు. ఇండ్ల కింద పూడ్చిపెట్టిన గుప్త నిధులను బయటకు తీసే ప్రత్యేక విద్య తనకు వచ్చని ప్రచారం చేసుకుంటూ అమాయకులను మోసం చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో తన స్నేహితులైన సయ్యద్ అలీ అష్రఫ్, మహ్మద్ హాజీ, మహ్మద్ సల్మాన్‌ను సంప్రదించి తన పథకాన్ని వివరించాడు. సులభంగా డబ్బు సంపాదించొచ్చని భావించిన వారు కూడా ఇందుకు అంగీకరించారు. తమకు ప్రత్యేక శక్తులు ఉన్నాయని, వారి నివాస స్థలాల కింద భూమిలో గుప్త నిధులు ఉన్నాయని అమాయక ప్రజలను నమ్మించేవారు. వారు సూచించిన ప్రదేశంలో గుంత తీసిన తర్వాత, ముందే సిద్ధం చేసుకున్న బొగ్గు, నకిలీ బంగారు నాణేలు ఉన్న సంచిని రహస్యంగా అందులో ఉంచేవారు. ఆ తర్వాత పూజలు చేసి, ఆ బొగ్గు బంగారంగా మారడానికి కొంత సమయం పడుతుందని చెప్పి అందినకాడికి దండుకొని అక్కడి నుంచి పరారయ్యేవారు. ఈ ముఠా వివిధ ప్రాంతాల్లో దాదాపు 11 మందిని మోసం చేసి, సుమారు రూ. కోటి వరకు వసూలు చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. తెలియని వ్యక్తుల మాటలను నమ్మి ప్రజలెవరూ మోసపోవద్దని డీసీపీ సూచించారు. ఎవరైనా ఇటువంటి అక్రమ లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కేసును ఛేదించడంలో శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.రవి, సబ్ ఇన్స్పెక్టర్లు కె.మన్సూర్ అలీ, నర్సింగరావు, ఎస్.శేషు, ఇతర టాస్క్‌ఫోర్స్ సిబ్బందితోపాటు రాజేంద్రనగర్ పోలీసులు పాల్గొన్నారు.
గుప్త నిధుల పేర కుచ్చుటోపీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



