పదేండ్ల పాలన.. రెండేండ్ల పాలనను బేరీజు వేసుకోండి
కరువు రావాలని కొందరు అఘోర పూజలు చేశారు
తొలి విడతలో లక్ష ఇండ్లు లక్ష్యం..22ఏ విషయంలో ఆందోళన వద్దు
ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ శంకుస్థాపనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ– కేపీహెచ్పీ
ప్రజలు తనకు అండగా నిలిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుకు సూచించారు. హైదరాబాద్ కేపీహెచ్బీలో గురువారం ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. కూకట్పల్లి ప్రజలు తనను పార్లమెంట్ సభ్యుడిగా ఆశీర్వదించి గల్లీ నుంచి ఢిల్లీకి పంపించారని గుర్తుచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున కూకట్‌పల్లికి అవసరమైన అభివృద్ధి పనులను ప్రజలు అడిగి చేయించుకోవాలని సూచించారు.
పదేండ్ల పాలన.. రెండేండ్ల పాలనను బేరీజు వేసుకోండి
గత ప్రభుత్వం పదేండ్లపాటు చేసిన పాలనను, తమ ప్రభుత్వం రెండేండ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు బేరీజు వేసుకోవాలని సీఎం కోరారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను చెల్లించుకుంటూనే మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. “నాకు వయసు ఉంది.. ఓపిక ఉంది.. మీకు మంచి చేయాలన్న సంకల్పం ఉంది. తెలంగాణను విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తున్నాం” అని తెలిపారు. రాష్ట్రంలో కరువు రావాలని కొంతమంది పక్క రాష్ర్టానికి వెళ్లి అఘోర పూజలు చేశారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. మంచి మనసుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న తమ సంకల్పానికి దేవుడి ఆశీర్వాదం ఉందన్నారు. 22ఏ విషయంలో మీ సొంత భూములు కోల్పోకుండా చూసే బాధ్యత తనది అని హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఆందోళన అవసరం లేదన్నారు.
సోషల్ మీడియాలో కొంతమంది చేసే అబద్ధపు ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. తెలంగాణలో 3.28 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని సీఎం తెలిపారు. ప్రతి పేద కుటుంబానికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని చెప్పారు. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచేలా ఇందిరమ్మ చీరలను సారెగా అందించామని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని అన్నారు. స్వయం సహాయక సంఘాలకు రూ.65 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించామని తెలిపారు. మహిళలను బస్సులకు యజమానులను చేయడంతో పాటు పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తుల విక్రయానికి శిల్పారామంలో స్టాళ్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు.
లక్ష ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం
పట్టణ ప్రాంతాల్లోని పేదలకు సొంత ఇండ్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం తెలిపారు. తొలి విడతలో లక్ష ఇండ్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పేదలు తమ సొంత భూములను కోల్పోకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదేనని, ఈ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, మాధవరం కృష్ణారావు, ఆరెకపూడి గాంధీ, మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్, కమ్మ సంఘం చైర్మెన్, టీపీసీసీ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ కూకట్పల్లి ఇన్చార్జి బండి రమేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అండగా ఉండండి..అభివృద్ధి చేస్తా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



