సినీ ప్రపంచం అనేది ఎంతో మంది యువతకు ఓ అద్భుతమైన కల. అవకాశాలకోసం నిరంతరం తపిస్తుంటారు. తమకు నచ్చిన రంగంలో రాణించేందుకు పడరాని పాట్లు పడతారు. ఇలాంటి రంగంలో గాడ్‌ఫాదర్ లేకుండా నెట్టుకురావడం అంత సాధ్యం కాదు. కానీ పట్టుదల, ప్రతిభా ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించాడు ఈ బెంగాలీ యువకుడు. చదువుతోపాటు నృత్యం, నటన, మోడలింగ్‌లో రాణిస్తూ బుల్లితెరపై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదటిసారి వెండితెరకు పరిచయమవుతున్న అతని పరిచయం నేటి జోష్‌లో…
కేవలం మూడున్నర సంవత్సరాల వయస్సులోనే సుశోభన్ సోనూ రారు తండ్రిని కోల్పోయాడు. ఆ తర్వాత తల్లి చేతుల్లో పెరిగాడు. వ్యక్తిగత జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. అయినా ఏ మాత్రం కుంగిపోని ధైర్యం ఈ యువకుడి సొంతం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చదువుతో పాటు క్రమంగా నృత్యం, నటన, మోడలింగ్ ప్రపంచంతో అనుబంధం ఏర్పరచుకున్నాడు. బెంగాలీ టెలివిజన్‌లో అనేక ధారావాహికల్లో పనిచేశారు. ఇప్పుడు ‘టేక్ కేర్ భాలోబాసా’ చిత్రంలో ‘జాయ్’ పాత్రలో నటిస్తున్నాడు సుశోభన్
బాధ్యతలన్నీ తల్లి భుజాలపైనే
హౌరాలో జన్మించినప్పటికీ సుశోభన్ బాల్యం మొత్తం కోల్‌కతాలోనే జరిగింది. చాలా చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోవడంతో కుటుంబ బాధ్యతలన్నీ అతని తల్లి భుజాలపైనే పడ్డాయి. ఆ పరిస్థితుల మధ్యనే చదువు, తనకు ఇష్టమైన అంశాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. 2016లో దమ్ దమ్ మోతీజీల్ రవీంద్ర మహావిద్యాలయం నుండి వాణిజ్యంలో డిగ్రీ పొందాడు. చిన్నతనం నుండే సాంస్కతిక కార్యకలాపాల పట్ల అతనికి ఆసక్తి ఉండేది. కుటుంబం అతను సంగీతం నేర్చుకోవాలని కోరుకుంది. కానీ చివరికి నత్యం పట్లనే అతను ఎక్కువ ఆకర్షితుడయ్యాడు. కళాశాలలో చదువుతున్న సమయంలో దాదాపు రెండు సంవత్సరాలు పాశ్చాత్య నత్యంలో శిక్షణ పొందాడు. వివిధ వేదికలపై ప్రదర్శనలిచ్చాడు. ఈ నృత్య ప్రపంచం నుండే నటన పట్ల ఆసక్తి ఏర్పడింది అతనికి.
వివిధ ఆడిషన్లలో…
నటనా ప్రపంచంలో అడుగు పెట్టేందుకు దర్శకుడు పీజూష్ సాహా వద్ద దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు శిక్షణ పొందాడు సుశోభన్. దానితో పాటు వివిధ ఆడిషన్లలో కూడా పాల్గొన్నాడు. కొన్నేళ్ల ప్రయత్నం తర్వాత 2019లో ఆకాష్ ఆఠ్ ఛానెల్ ధారావాహిక ‘ఆనందమరమూ మా’ ద్వారా టెలివిజన్‌లోకి అడుగు పెట్టాడు. మరణించిన దర్శకుడు దేవిదాస్ భట్టాచార్య దర్శకత్వంలో వచ్చిన ఆ ధారావాహికలో వైష్ణవ భక్తుడి పాత్రలో కనిపించాడు అతను.
అనేక ధారావాహికల్లో…
ఆ తర్వాత క్రమంగా బెంగాలీ టెలివిజన్‌లో అనేక ధారావాహికల్లో నటించాడు సుశోభన్. స్టార్ జల్సా ‘మోహర్’, ‘కోరాపాఖీ’, ‘తిత్లీ’, ‘ఖేలాఘర్’లలో పనిచేశాడు. అలాగే జీ బంగ్లా ‘జమునా ఢాకీ’ ధారావాహికలో కూడా నటించాడు. టెలివిజన్‌లో పనిచేయడంతో పాటు వివిధ వ్యాపార ప్రకటనలు, మోడలింగ్ కూడా చేశాడు. కోవిడ్ తర్వాత 2023లో మోడలింగ్ ప్రపంచంలో మరింత చురుగ్గా మారాడు సుశోభన్. హాలిడే ఇన్ హోటల్, డాబర్, అమెజాన్, బిగ్ బజార్, స్పెన్సర్లతో సహా అనేక సంస్థల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నాడు. 2025లో కోల్‌కతాలో నిర్వహించిన ‘ఎత్నిక్ ఎలిగన్స్ 2025’ పోటీలో మొదటి రన్నర్‌అప్‌గా నిలిచాడు.
టేక్ కేర్ భాలోబాసా…
ఇప్పటి వరకు బుల్లితెరపై తన సత్తా చాటుకున్న అతను ఇప్పుడు మొదటి సారి వెండి తెరకు పరిచయం కానున్నాడు. నలుగురు స్నేహితుల సంబంధాలు, స్నేహం, మారుతున్న కాలపు భావోద్వేగాలు చుట్టూ రూపొందిన ‘టేక్ కేర్ భాలోబాసా’ సినిమా ద్వారా మొదటిసారి బెంగాలీ సినిమాలో పనిచేస్తున్నాడు సుశోభన్. వ్యక్తిగత జీవితంలోని ప్రతికూలతలు, నృత్యంతో మొదలైన ప్రయాణం, టెలివిజన్‌లో కొన్నేళ్ల పని, మోడలింగ్ అనుభవం తర్వాత ‘టేక్ కేర్ భాలోబాసా’ సినిమాలో నటన ద్వారా బెంగాలీ సినిమాలో కూడా పనిచేస్తున్న సుశోభన్ సోనూ రారు తనకు నచ్చిన రంగంలో మరెంతో ఎత్తు ఎదగాలని కోరుకుందాం…
– సోపతి డెస్క్



