Tuesday, August 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమున్సిపల్‌ కమిషనర్‌ చొరవతో చిన్నారికి పునర్జన్మ

మున్సిపల్‌ కమిషనర్‌ చొరవతో చిన్నారికి పునర్జన్మ

- Advertisement -

పసికందుకు ‘జస్విక శ్రీ’ అని
 నామకరణం చేసిన కమిషనర్‌
ప్రజావాణిలో చిన్నారి తల్లిదండ్రుల కృతజ్ఞతలు
నవతెలంగాణ- గాంధీ చౌక్

ఖమ్మం నగరంలోని ఓ చిన్నారికి ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ‘జస్విక శ్రీ’ అని నామకరణం చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన కాంపాటి రాకేష్, మాధవి దంపతులకు 2026 మే 9న ఆడబిడ్డ జన్మించింది. జన్మించిన 12 రోజుల అనంతరం చిన్నారి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్టు కుటుంబ సభ్యులకు తెలిసింది. చిన్నారి వైద్య చికిత్సకు పెద్ద మొత్తంలో ఖర్చు అవసరం కావడంతో ఆ కుటుంబం ఆందోళనకు గురైంది. ఈ విషయాన్ని ఖమ్మం నగరపాలక సంస్థలో శానిటేషన్ విధులు నిర్వహిస్తున్న చిన్నారి నాయనమ్మ నరసమ్మ మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న కమిషనర్ వెంటనే స్పందించి హృదయ స్వచ్ఛంద సంస్థతో పాటు ప్రభుత్వ సహకారంతో చిన్నారి గుండె శస్త్రచికిత్సకు అవసరమైన రూ.14 లక్షల ఆర్థిక సహాయం మంజూరయ్యేలా కృషి చేశారు. ఈ సహాయంతో జులై 28న చిన్నారికి గుండె శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించగా ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా కోలుకుంది. దాంతో చిన్నారి తల్లిదండ్రులు తమ కుమార్తెను సోమవారం మున్సిపల్ కమిషనర్ కార్యాలయానికి తీసుకువచ్చి గ్రీవెన్స్ కార్యక్రమంలో తమకు అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారికి ఏదైనా పేరు పెట్టాలని మున్సిపల్ కమిషనర్‌‌ను కుటుంబ సభ్యులు కోరారు. కమిషనర్ సంతోషం వ్యక్తం చేస్తూ చిన్నారికి ‘జస్విక శ్రీ’ అని నామకరణం చేశారు. చిన్నారి సంపూర్ణ ఆరోగ్యంతో, సంతోషంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఆపదలో ఉన్న కుటుంబానికి సకాలంలో స్పందించి వైద్య సహాయం అందేలా కృషి చేసిన కమిషనర్‌‌కు చిన్నారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -