అడుగంటిన వేలాది బోరుబావులు
ఇసుక ఆధారంగా ఫిల్టర్పాయింట్లతో సాగు
దుందుభిపై నమ్మకంతో … లక్ష ఎకరాలలో వరి, మిర్చి, పత్తి సాగు
నీరు లేక ఆకాశం వైపు రైతన్న చూపు
ఆగస్టు దాటుతున్నా… రాని వరదలు
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
‘‘కాల్వలు రాకున్నా…రిజర్వాయర్లు లేకున్నా…దుందుభీ నది ఒకసారి పారితే చాలు ఏడాదంతా పంటలు పుష్కలంగా పండుతాయి. అతి తక్కువ ఖర్చుతో 30 పీట్ల వరకూ ఫిల్టర్ పాయింట్లు వేసుకొని పంటలకు నీటిని మల్లిస్తాం. దుందుభీ నది మాకు కన్నతల్లి లాంటిది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో ఎగువన ఆశించిన స్థాయిలో వర్షాలు లేక నదిలోకి చుక్క నీరు రాలేదు. దీనికి తోడు నీటినిల్వ ఉండకుండా ఇసుకను తోడేస్తున్నారు. ఆన్లైన్ పేరుతో ఆప్‌లైన్‌లో ఇసుకను తరలించినా.. మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇప్పటికైనా ఇసుక మాఫియాను కట్టడి చేసి కల్వకుర్తి ఎత్తిపోతల కాల్వ నీటిని దుందుభీకి మళ్లించి పంటలను కాపాడండి’’ ఇదీ బోరుబావుల రైతుల ఆవేదన. దుందుభీ నది కృష్ణానదికి ఉపనది. ఇది రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల గుండా 200 కిలోమీటర్లు ప్రవహిస్తోంది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కొండల నుంచి ఈ నది మొదలవుతోంది. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ జలాశయం వద్ద కృష్ణానదిలో కలుస్తోంది. బాలానగర్, రాజాపూర్, మిడ్జిల్, కల్వకుర్తి, తాడూరు, తెలకపల్లి ఉప్పునుంతల, వంగూరు మండలాల పరిధిలో దుందుభీ నది ప్రవహిస్తోంది. నదిపరివాహక ప్రాంతాల్లో పది వేల బోరు బావులున్నాయి. బోరుబావుల ద్వారా 50 వేల ఎకరాల్లో వరి, 50 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగుచేస్తున్నారు. ఎగువన కురిసిన వర్షాలకు జూన్, జులై ప్రారంభంలో నదికి వరదలు వస్తాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందుతుంది. సుమారు 30 నుంచి 40 పీట్ల వరకు ఇసుక ఉంటుంది. ఇసుకలో 25 పీట్ల దాక నీరుంటుంది. ఒక సారి నదిలోకి నీరు వస్తే ఏడాది అంతా సాగునీరు అందేది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవలేదు. ఉన్న తేమ ఇసుక తవ్వకం వల్ల వట్టిపోయింది. దీంతో ఈ ఖరీఫ్‌లో పంటలు సాగు చేసేది ఎలా అని రైతులు ఆవేదన చెందుతున్నారు.
పడిపోతున్న ఫిల్టర్ పాయింట్లు
దుందుభీనదిలో ఉండే సుమారు 10 వేల ఫిల్టర్ పాయింట్లు ధ్వంసం అవుతున్నాయి. తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఫిల్టర్ పాయింట్లు తవ్వుతారు. 30 ఫీట్లు వేయడానికి 10 వేల ఖర్చు అవుతుంది. ఈ బావుల్లో ఇసుకలోంచి వచ్చే ఊట నీటితో పంటలు సైతం సమృద్ధిగా పండుతాయి.
వరి సాగు కష్టమే
రామలు, గుట్టలపల్లి, తాడూరు మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా
దుందుభీ వాగులోకి చుక్క నీరు రాలేదు. ప్రతి ఏటా నది ఆధారంగా వరి సాగు చేస్తాం. కొంత కాలంగా ఇసుక తీయడంతో ఫిల్టర్ పాయింట్లు డ్రై అవుతున్నాయి. దీంతో కాల్వల నీరు రావడంలేదు. పత్తి, వరి, మక్క, వేరుశనగ వంటి పంటలు సాగు చేయడం కష్టమే.
ఇసుక అక్రమాలను అరికట్టాలి
ప్రభాకర్ రెడ్డి , నడిగడ్డ, తెలకపల్లి మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా
ఇసకను పరిమితులకు మించి అక్రమంగా తరలించడం వల్ల ఈ ప్రాంత రైతులు అధికంగా నష్టపోతున్నారు. ఒక వైపు ఎల్‌నినో మరో వైపు ఇసుక తవ్వడం వలన నదిలో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. పాలకులు చొరవ చూపి ఇసుక అక్రమాలను అరికట్టాలి.
ఇసుక మాఫియా ఆగడాలు
దుందుభీ నదిలో 40 పీట్ల మేర ఇసుక రీచ్‌లున్నాయి. నదిలో విచ్చలవిడిగా ఇసుకను తోడేయడం వల్ల భూగర్భంలో ఇసుక పొరలు తగ్గి నీటి మట్టం పడిపో తుంది. దీంతో ఫిల్టర్ పాయింట్లు డ్రై అవుతు న్నాయి. నీటి లభ్యత ఉన్నప్పుడు పత్తి, వేరు శనగ, వరి, మొక్కజొన్న పంటలు ఏపుగా పండేవి. ఇసుకను తవ్వేయడం వల్ల భూగర్భజలాలు తగ్గి సాగు నీటి సమస్య ఏర్పడుతోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొంతమంది రాజకీయ నేతల కనుసైగల్లోనే ఇసుక దందా సాగుతోందనే ఆరోపణలున్నాయి.
కాల్వల ద్వారా నదిలోకి నీళ్లను మళ్లించి పంటలకు ఇవ్వాలి
జిల్లాలో పంటల సాగుపై ఎల్‌నినో ప్రభావం అధికంగా ఉంది. నది పరివాహక ప్రాంతంలో ఇసుక మాఫియా సైతం విజృంభిస్తోంది. రాత్రీ పగలు తేడా లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. ఇసుక తీయడం వల్ల నదిలోని నీరంతా ఇంకిపోతుంది. ఇసుక అక్రమాల విషయంలో పాలకులు సైతం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. లిప్టుల ద్వారా నీటిని నదిలోకి మల్లించాలి. లేకపోతే ఖరీఫ్‌కు నీటి కష్టాలు ఉంటాయి.
-ఎ. శ్రీనివాసులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి, నాగర్‌కర్నూల్



