దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తూ, కోట్లమంది నమ్మకాన్ని గెలుచుకున్న ‘లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (ఎల్‌ఐసీ) సెప్టెంబర్ 1న 70వ సంస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. స్వాతంత్య్రానంతరం ప్రైవేట్ మోసాల నుంచి ప్రజల సొమ్ముకు రక్షణ కల్పిస్తూ, సావెరిన్ గ్యారెంటీతో పొదుపు సంస్కృతిని పెంచేం దుకు చేపట్టిన బీమా రంగ జాతీయీకరణ దేశ ఆర్థిక చరిత్రలో విప్లవాత్మక మైలురాయి. సామాజిక బాధ్యతగా భద్రతతో కూడిన ఇన్సూరెన్స్ సేవలను అందిస్తూ, సమీకరించిన నిధులతో దేశాభివృద్ధిలో భాగస్వామిగా మారిన ఎల్‌ఐసీ విజయప్రస్థానాన్ని ఈ సందర్భంగా స్మరించుకోవాలి.
245 ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రజల నుంచి వసూలు చేసిన ప్రీమియం మొత్తాలను స్వప్రయోజనాలకు వినియోగిస్తూ పాలసీదారులను మోసం చేస్తున్న నేపథ్యంలో భారతీయ జీవిత బీమా వ్యాపారాన్ని జాతీయం చేసి ఎల్‌ఐసీని ఏర్పాటు చేశారు. గత ఏడు దశాబ్దాలుగా జాతీయీకరణ లక్ష్యాలను కొనసాగిస్తూ ఎల్‌ఐసీ దేశ ఆర్థిక రంగానికి వెన్నెముకగా నిలిచింది. ఎల్‌ఐసీ పెట్టుబడుల్లో 82 శాతం ప్రభుత్వ సెక్యూరిటీలతో పాటు మౌలిక సదుపా యాల అభివృద్ధికి వినియోగమవుతున్నాయి. 1956లో రూ.5 కోట్ల మూలధనంతో ప్రారంభమైన ఎల్‌ఐసీ, 2011లో రూ.100 కోట్ల మూలధనానికి చేరింది. 31.03.2026 నాటికి 14.57 లక్షల మంది ఏజెంట్లు, 3,836 కార్యాలయాలు ఉన్నాయి. 25.35 కోట్ల వ్యక్తిగత పాలసీదారులతో పాటు 10 కోట్లకు పైగా గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీదారులు ఉన్నారు.2025-26లో ఎల్‌ఐసీ మొత్తం ఆదాయం రూ.9,79,078 కోట్లు, ప్రీమియం ఆదాయం రూ.5,35,984 కోట్లుగా నమోదైంది. పాలసీదారులకు రూ.4,96,104 కోట్లు చెల్లించింది. సంస్థ మొత్తం ఆస్తుల విలువ రూ.59,03,876 కోట్లు కాగా, లైఫ్ ఫండ్ రూ.51,63,872 కోట్లుగా ఉంది. ప్రీమియం ఆదాయంలో 56.66 శాతం మార్కెట్ వాటాతో ప్రైవేటు, విదేశీ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. మొత్తం సర్‌ప్లస్ రూ.1,23,266 కోట్లుగా నమోదైంది. ఈ సంవత్సరంలోనే ఎల్‌ఐసీ ప్రభుత్వానికి రూ.12,207 కోట్ల డివిడెండ్ అందించింది. ప్రతి ఏడాది సుమారు రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులను దేశ ఆర్థికాభివృద్ధికి అందిస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వానికి సుమారు రూ.40 వేల కోట్ల డివిడెండ్ చెల్లించింది. ఎల్‌ఐసీ ఎంబెడెడ్ వాల్యూ రూ.7.89 లక్షల కోట్లుగా ఉంది.
బీమా రంగంలో ప్రైవేటు, విదేశీ సంస్థలకు అవకాశం కల్పించి 24 ఏండ్లు గడిచినా ఎల్‌ఐసీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 2025-26లో రూ.2,60,464 కోట్ల తొలి ప్రీమియం ఆదాయంతో 1.84 కోట్ల పాలసీలను సాధించి, 65.16 శాతం మార్కెట్ వాటాతో లీడర్‌గా నిలిచింది. అదే ఏడాది 2.54 కోట్ల క్లెయిమ్‌లకు రూ.3,12,771 కోట్లు చెల్లించి, 99.44 శాతం డెత్ క్లెయిమ్‌లను పరిష్కరించింది. ప్రస్తుతం ఎల్‌ఐసీ 14 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
అయితే ఎల్‌ఐసీ వాటాల విక్రయంపై విమర్శలు వెల్లువెత్తాయి. తొలుత 3.5 శాతం వాటాను రూ.20,557 కోట్లకు డిజిన్వెస్ట్‌మెంట్ చేశారు. సంస్థ ఎంబెడెడ్ విలువను తక్కువగా చూపించారనే విమర్శలు వచ్చాయి. 76 లక్షల దరఖాస్తులతో ఎల్‌ఐసీ ఐపీఓ మూడు రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. అనంతరం మరో 6.5 శాతం ప్రభుత్వ వాటాను ‘ఆఫర్ ఫర్ సేల్’ ద్వారా ఉపసంహరించగా, రూ.31,552 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరాయి. ప్రజల విశ్వాసానికి ప్రతీకగా ఉన్న ఎల్‌ఐసీ వాటాలను విక్రయించడం విమర్శలకు దారితీసింది.స్టాక్ మార్కెట్‌లో ఎల్‌ఐసీ షేరు కొంతకాలం డిస్కౌంట్‌తో ట్రేడవడంతో మదుపరులు నిరుత్సాహానికి గురయ్యారు. అయితే షేరు మార్కెట్ విలువకు, సంస్థ అంతర్గత విలువకు గణనీయమైన వ్యత్యాసం ఉంది. ఎల్‌ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 63.7 బిలియన్ డాలర్లుగా నమోదై దేశంలో అత్యధిక క్యాపిటలైజేషన్ కలిగిన కంపెనీల్లో 10వ స్థానంలో నిలిచింది. ప్రైవేటు సంస్థలతో పోలిస్తే ఎల్‌ఐసీ పనితీరు మెరుగ్గా ఉండటంతో పాటు నిర్వ హణ వ్యయం కూడా తక్కువగా ఉంది. లాభాలకే కాకుండా సామాజిక శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇవ్వడం ఎల్‌ఐసీ ప్రత్యేకత. ఫార్చూన్-500 జాబితాలో నిలిచిన ఎల్‌ఐసీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ వాటాలను విక్రయించి బడ్జెట్ లోటును పూడ్చుకోవడం సమంజసం కాదు. 2047 నాటికి ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్స్ అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్న సమయంలో ఎల్‌ఐసీని మరింత బలోపేతం చేయాలి. ప్రజలకు సామాజిక భద్రత కల్పిస్తూ, దేశ ఆర్థికాభివృద్ధికి భారీగా పెట్టుబడులు అందిస్తున్న ఎల్‌ఐ సీ వంటి ప్రభుత్వరంగ సంస్థలో ప్రభుత్వ వాటాలను డిజిన్వెస్ట్ మెంట్ పేరుతో విక్రయించడం ప్రజామోద యోగ్యం కాదు. ప్రజల విశ్వా సానికి ప్రతీకగా నిలిచిన ఎల్‌ఐసీని కాపాడటం ప్రభుత్వ బాధ్యత.
జి. కిషోర్ కుమార్, 9440905501



