ఆగస్టులో రూ.2 లక్షల కోట్ల వసూళ్లు
ముంబయి : దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ఆగస్టులో దిగుమతుల ప్రధాన మద్దతుతో వృద్ధిని నమోదు చేశాయి. 2026 ఆగస్టు నెలలో స్థూల జిఎస్టి వసూళ్లు రూ.1.99 లక్షల కోట్లకు చేరాయి. గతేడాది ఇదే నెలలోని రూ.1.74 లక్షల కోట్లతో పోల్చితే 15 శాతం పెరుగుదల చోటుచేసుకుందని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. గడిచిన నెలలో దిగుమతులపై పన్ను వసూళ్లు భారీగా పెరగడం ఈ వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచింది. అయితే జులైలో నమోదైన రూ.2.11 లక్షల కోట్లతో పోలిస్తే ఆగస్టు వసూళ్లు స్వల్పంగా తగ్గాయి.
ఆగస్టులో దేశీయ లావాదేవీల నుంచి వచ్చిన జీఎస్టీ ఆదాయం రూ.1.37 లక్షల కోట్లుగా నమోదయ్యింది. దిగుమతులపై పన్ను వసూళ్లు ఏకంగా 29 శాతం పెరిగి రూ.62,604 కోట్లకు చేరాయి. పన్నుల విభాగాల వారీగా సీజీఎస్టీ రూ.38,413 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.46,316 కోట్లు, ఐజీఎస్టీ రూ.1.15 లక్షల కోట్లుగా ఉంది. దేశీయ డిమాండ్‌తో పాటు దిగుమతి కార్యకలాపాలు కూడా పన్ను వసూళ్ల పెరుగుదలకు తోడ్పడ్డాయని గ్రాంట్ థార్టన్ భారత్ భాగస్వామి మనోజ్ మిశ్రా తెలిపారు. కాగా.. జీఎస్టీ మండలి 57వ సమావేశం సెప్టెంబర్ 12న న్యూఢిల్లీలో జరగనున్నట్లు జీఎస్టీ కౌన్సిల్ సెక్రటేరియట్ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. దీనికి ముందుగా సెప్టెంబర్ 11న ఉదయం 11:00 గంటల నుంచి అధికారుల ఉన్నత స్థాయి సమావేశం కూడా జరగనుంది.
జీఎస్టీకి దిగుమతుల కిక్కు
- Advertisement -
- Advertisement -



