Friday, September 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాహుల్ గాంధీపై అక్రమ కేసులు ఎత్తివేయాలి

రాహుల్ గాంధీపై అక్రమ కేసులు ఎత్తివేయాలి

- Advertisement -

–  ఖర్గేను అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
– ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
నవతెలంగాణ –  కామారెడ్డి
: కుల వివక్షకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ పోరాడుతోందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై కుల వివక్షకు పాల్పడిన ఘటనను ప్రశ్నించిన లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

నిజాంసాగర్ చౌరస్తా నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.ఈ  కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ దేశంలో కుల వివక్ష, అంటరానితనం, మనిషిని మనిషిగా తక్కువ చేసి చూసే విధానాలకు స్థానం లేదన్నారు. ఖర్గే పాల్గొన్న సభా ప్రాంగణాన్ని గంగా జలాలతో శుద్ధి చేశారంటూ వచ్చిన ఘటన తీవ్రంగా ఖండించదగినదని అన్నారు. ఖర్గే దళిత నాయకుడు కావడం వల్లే ఆయన పాల్గొన్న ప్రదేశాన్ని శుద్ధి చేయాల్సి వచ్చిందనే భావన అత్యంత దురదృష్టకరమన్నారు. ఇది ఖర్గేను అవమానించడమే కాకుండా రాజ్యాంగాన్ని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను అవమానించడమేనని పేర్కొన్నారు.

కులం మనిషి పుట్టుకను నిర్ణయించవచ్చని, కానీ అతని గౌరవాన్ని నిర్ణయించదని షబ్బీర్ అలీ అన్నారు. ప్రతి భారతీయుడికి ఆత్మగౌరవంతో జీవించే హక్కు ఉందని, రాజ్యాంగం కల్పించిన సమానత్వాన్ని ఎవరూ కాలరాయలేరని తెలిపారు. కుల వివక్షకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులోనూ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

ప్రజా సమస్యలను ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీ గొంతును అక్రమ కేసులతో అణచివేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రజల తరఫున ప్రశ్నించడం రాహుల్ గాంధీ హక్కు అని, ప్రశ్నించే గొంతును కేసులతో భయపెట్టాలని చూస్తే కాంగ్రెస్ కార్యకర్తలు మరింత బలంగా ప్రజల మధ్య నిలబడతారని అన్నారు. రాహుల్ గాంధీపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఖర్గేను అవమానించిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

కేసీఆర్ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలి
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై షబ్బీర్ అలీ తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని ఆరోపించారు. ప్రజల కోసం పనిచేయని నాయకుడికి ప్రతిపక్ష నేత పదవి ఎందుకని ప్రశ్నిస్తూ, కేసీఆర్ వెంటనే ఆ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

కామారెడ్డి నుంచి పోటీ చేసిన కేసీఆర్ ఈ ప్రాంత ప్రజలకు ఏం చేశారో, వారి సమస్యలపై అసెంబ్లీలో ఏం మాట్లాడారో ప్రజలకు వివరించాలని కోరారు. భారీ వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయిన సమయంలో బాధితులను పరామర్శించేందుకు కేసీఆర్, కేటీఆర్ రాలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ నాయకత్వం ప్రజల పక్కన నిలబడలేదన్నారు.

బీఆర్‌ఎస్ ఖాతాలో వందల కోట్ల రూపాయల నిధులు ఉన్నాయని చెబుతున్నారని, కామారెడ్డి ప్రజలకు ఆ నిధుల నుంచి ఎంత సహాయం చేశారో చెప్పాలని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. కనీసం ఒక్క రూపాయి అయినా బాధితులకు అందించారా అని నిలదీశారు. 
వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధం 
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల మన్ననలు పొందుతున్నాయని షబ్బీర్ అలీ అన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఏం చేసిందో, కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల్లో ఏం చేసిందో ప్రజల ముందే చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. అభివృద్ధి, సంక్షేమం, విద్య, వైద్యం, రైతులు, మహిళలు, యువత, పేదల సంక్షేమం తదితర అన్ని రంగాల్లో పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును పోల్చుకుందామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. రైతులకు మద్దతు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, స్మార్ట్ రేషన్ కార్డులు, విద్యా సంస్థల అభివృద్ధి, ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల బలోపేతం వంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని అన్నారు.

ప్రజల గొంతును అణచలేరు
జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ కుల వివక్షకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో పోరాడుతోందన్నారు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించిందని, దళిత నాయకుడైన ఖర్గేను అవమానించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. రాహుల్ గాంధీపై కేసులు పెట్టి ప్రజల గొంతును అణచలేరని, కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుందని అన్నారు. మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి చర్యలు తీసుకుంటోందన్నారు. కుల వివక్ష, రాజ్యాంగ వ్యతిరేక చర్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు.ఈ  కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఐరేని సందీప్, పీసీసీ జనరల్ సెక్రటరీ ఇంద్రకరణ్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్లు గూడెం శ్రీనివాస్ రెడ్డి, అంతంపల్లి సుధాకర్ రెడ్డి, భీమ్ రెడ్డి, నవసిలాల్ నాయక్, అనంత రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు నరేందర్ రెడ్డి, పాత రాజు, అంకం కృష్ణారావు, ఆశబోయిన శ్రీనివాస్, రాజా గౌడ్‌తో పాటు జిల్లా కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -