– తాతా మధు ఎమ్మెల్సీ పదవి రద్దు చేయాలి
– మున్సిపల్ వైస్‌చైర్మన్ జూపల్లి రమేష్‌బాబు
నవతెలంగాణ – అశ్వారావుపేట
దళిత సామాజిక వర్గానికి చెందిన శాసనసభ స్పీకర్‌ను అవమానించేలా అనుచిత పదజాలం ఉపయోగించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని అశ్వారావుపేట మున్సిపల్ వైస్‌చైర్మన్ జూపల్లి రమేష్‌బాబు డిమాండ్ చేశారు. తాతా మధు ఎమ్మెల్సీ పదవిని రద్దు చేసి, ప్రజాస్వామ్యానికి, సభా గౌరవానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరారు.
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా తాతా మధు సభాపతిని అవమానించేలా వ్యవహరించారనే ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజల ఓట్లతో ఎన్నికై, రాజ్యాంగబద్ధ పదవులు చేపట్టిన ప్రజాప్రతినిధులు సభా గౌరవాన్ని, ప్రజాస్వామ్య సంప్రదాయాలను, రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు.
దళిత స్పీకర్‌ను అవమానించడం కేవలం ఒక వ్యక్తిని అవమానించడం కాదని, సమానత్వం, సామాజిక న్యాయం, గౌరవం వంటి రాజ్యాంగ విలువలను అవమానించినట్లేనని రమేష్‌బాబు పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు, ప్రవర్తన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆమోదయోగ్యం కాదన్నారు.
తాతా మధు వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరిపి సభా నియమాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరవధిక దీక్షకు సిద్ధమని హెచ్చరించారు. ఈ పోరాటం వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసమేనని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో జిల్లా నాయకుడు తుమ్మ రాంబాబు, మండల అధ్యక్షుడు చిన్నంశెట్టి సత్యనారాయణ, కౌన్సిలర్లు మిండా హరిబాబు, నార్లపాటి దివాకర్, కాంగ్రెస్ నాయకుడు బండి చెన్నారెడ్డి, నారాయణపురం ఉపసర్పంచ్ ఆకుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.



