సబ్సిడీ సొమ్ము నేరుగా వారి ఖాతాల్లోకే బదిలీ : మండలిలో మంత్రి తుమ్మల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రైతులు తమకు అవసరమైన వ్యవసాయ పనిముట్లను, తమకు నచ్చిన కంపెనీ నుంచి కొనుగోలు చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం యాంత్రీకరణ పథకాన్ని అమలు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు.
శాసనమండలిలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. తయారీదారులు, సరఫరాదారులు అందించే ఉత్పత్తులను ఫార్మ్ మెషినరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ లేదా కేంద్ర వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన సంస్థల వద్ద పరీక్షించిన తర్వాతే రైతులకు సరఫరా చేస్తున్నామని తెలిపారు.
యాంత్రీకరణ పథకం కింద రైతులకు అందించే పరికరాలు వారు కోరుకున్న విధంగా లభించడం లేదనీ, సబ్సిడీపై అందించే యంత్రాలకు, మార్కెట్లో లభించే యంత్రాలకు తేడా ఉంటుందని ఎమ్మెల్సీ సత్యం ప్రస్తావించారు. సబ్సిడీ పరికరాలకు ఇచ్చే కొటేషన్ ధరలు, మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసం ఉంటోందని పేర్కొన్నారు. డిమాండ్ ఉన్న యంత్రాలను ఎక్కువగా అందించాలని, డ్రోన్లను కూడా అధిక సంఖ్యలో అందించాలని కోరారు.
దీనిపై మంత్రి తుమ్మల స్పందిస్తూ, ఎమ్మెల్సీ ప్రస్తావించిన అంశాలు గతంలో ఉన్న పరిస్థితులకు సంబంధించినవనీ, ప్రస్తుతం ఆ విధానం లేదని స్పష్టం చేశారు. రైతులు తమకు నచ్చిన పనిముట్టును, తమకు నచ్చిన కంపెనీ నుంచి కొనుగోలు చేసుకునే విధంగా ప్రస్తుత యాంత్రీకరణ విధానాన్ని రూపొందించామని తెలిపారు. రైతులు కోరుకునే విధంగా వ్యవసాయ పనిముట్లు అందుబాటులో ఉండేలా ఎంప్యానెల్మెంట్ కమిటీలో వారికి కూడా భాగస్వామ్యం కల్పించినట్టు తెలిపారు. రైతులకు అందాల్సిన సబ్సిడీ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తున్నామని చెప్పారు.
ఇమామ్‌ల వేతనం పెంపు పరిశీలనలో ఉంది…. :
మైనార్టీ శాఖ మంత్రి అజారుద్ధీన్
ఇమామ్, మౌజమ్ల గౌరవ వేతనం పెంపు పరిశీలనలో ఉందని మైనార్టీ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్ధీన్ తెలిపారు. శాసనమండలిలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రస్తుతం వారి గౌరవ వేతనం రూ.5 వేలుగా ఉందని తెలిపారు. గౌరవ వేతనం అందని ఇమామ్, మౌజమ్‌లకు సంబంధించి సమాచారాన్ని ఇస్తే వారికి కూడా అందజేస్తామని పేర్కొన్నారు.
రైతులు కోరుకున్న పనిముట్లే అందిస్తున్నాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



