కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన
వ్యవసాయానికి నిరంతరం ఇవ్వాలని డిమాండ్
ప్రాంతీయ బేధాలు చూడొద్దని విజ్ఞప్తి
నవతెలంగాణ-సిద్దిపేటరూరల్, మిరుదొడ్డి, నంగునూరు
కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నాయని.. కోతల్లేకుండా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా అన్నధాతలు రోడ్డెక్కారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ స్టేజీ వద్ద, నారాయణరావుపేట మండల కేంద్రంలో సబ్‌స్టేషన్ ఎదుట, అక్బర్‌పేట-భూంపల్లి మండలంలో జాతీయ రహదారి కూడవెల్లి బ్రిడ్జీపై, నంగునూరు మండలం రాంపూర్ క్రాస్ వద్ద జాతీయ రహదారిపై రైతులు శుక్రవారం రాస్తారోకోలు, ఆందోళనలు చేపట్టారు. కనీసం 10 గంటలు కూడా సరిగ్గా కరెంట్ ఇవ్వట్లేదని అన్నదాతలు వాపోయారు. కరెంట్ కోతల వలన చేతికొచ్చిన పంట కండ్ల ముందే ఎండిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. హుస్నాబాద్, మెదక్ ప్రాంతాల్లో 12 గంటలైనా ఇస్తున్నారని.. కానీ సిద్దిపేటపై అక్కసుతో 10 గంటలు కూడా ఇవ్వట్లేదని రైతులు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రాంతీయ బేధాలు చూడకుండా కోతల్లేకుండా కరెంట్ సరఫరా చేయాలని కోరారు. కాగా జాతీయ రహదారిపై రైతులు బైటాయించడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆయా మండలాలకు సంబంధించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.
రోడ్డెక్కిన అన్నదాతలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



