– తెలంగాణలో విజయవంతం చేయాలి
– పేదలకు 10 లక్షల ఎకరాల భూమి పంచకుంటే హైదరాబాద్‌ను ముట్టడిస్తాం : అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
సామినేని రామారావు నగర్ నుంచి కె.శ్రీనివాసరెడ్డి
మే 15న ఉపాధి హామీ చట్టం కార్మికుల సమ్మె దేశ వ్యాప్తంగా జరుగనున్నదని, తెలంగాణలోనూ ఆ సమ్మెను జయప్రదం చేయాలని అఖిల భారత వ్యవ సాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గుర్తించిన 10లక్షల ఎకరాలభూమిని పేదలకు పంచాలని జూన్ నుంచి ఉద్యమం చేయనున్నట్టు ప్రకటించారు. ఆ భూములను పంచకపోతే హైదరా బాద్‌ను ముట్టడిస్తామని హెచ్చరించా రు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లోని సామినేని రామారావు నగర్లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. 33వేల కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార పదార్థాలను దేశంలో పండి స్తున్నామని, మోడీ, రేవంత్‌రెడ్డి, దేశ ప్రజలు తిండి తినగలుగుతు న్నారంటే రైతులే కారణమని చెప్పారు. అంబానీ, అదానీ, కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చేందుకు డబ్బులుంటాయని విమర్శించారు. యూరియాకు మూడేండ్ల కిందట రూ.2 లక్షల కోట్లు కేటాయిస్తే.. ఆ తర్వాత రూ.1.5 కోట్లు, ఈ ఏడాది రూ.1.15 కోట్లు మాత్రమే కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. ఉపాధిహామీ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయడం ఏంటి? అని నిలదీశారు. కేరళలో ఒకే రోజు పేద లకు ఐదు లక్షల ఇండ్లను పంపిణీ చేసిన ఘనత విజయన్ సర్కారుదని కొనియాడారు. ఆ రాష్ట్రంలో ఉచిత వైద్యం అందిస్తున్నా రన్నారు. రోజువారీ కూలి రూ.1000 నుంచి 1200 వరకు ఉంటుందని తెలి పారు. 40 వేల స్కూళ్లను డిజిటలీకరణ చేశారని గుర్తుచేశారు. అలాంటి కేరళ వామపక్ష ప్రభు త్వంతో రేవంత్‌రెడ్డి తన సర్కార్‌ను పోలికపెట్టి చూపడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గిరిజన ప్రాంతాల్లో రైతులపై దాడులు చేస్తున్నారని, ఆధిపత్య కుల ధోరణి అధికమైందని పలు ఉదహరణలను ఎత్తిచూపారు.
రైతు భరోసా నిధుల కోతపైనే సర్కారు దృష్టి
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్
రైతు భరోసాను ఎలా కోత పెట్టాలా అనే ఆలోచనే తప్ప మరొకటి రాష్ట్ర సర్కారుకు లేదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ విమర్శించారు. రైతు భరోసా నిధుల కోతపై సర్కారు దృష్టి పెట్టిందని, దాని కోసం ముగ్గురు మంత్రులతో సబ్‌కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. రైతు భరోసా రూ.7500 ఇచ్చే దాకా పోరాడాలని పిలుపునిచ్చారు. దిగుమతి పత్తిపై సుంకాన్ని జీరో శాతానికి తగ్గించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా నుంచి ఇటీవల దిగుమతి చేసుకున్న 40 లక్షల బేళ్ల పత్తి వల్ల రాష్ట్రంలో పత్తి రేటు పడిపోయిందన్నారు. క్వింటాకు రూ.8150 చెల్లించాల్సి ఉన్నా, రూ.6 వేలే ఇస్తున్నారన్నారు. సుంకాల తగ్గింపు పామాయిల్ రైతులపైనా తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. కేంద్రం విధానాలపై రైతాంగ ఐక్య ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇప్పటివరకు రెండు విడతల నిధులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రైతుల్లో అసంతృప్తి, ఆందోళనలు రేకెత్తినప్పుడు, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎకరాకు రూ.6 వేలు వేశారని తెలిపారు. 30 శాతం ఉన్న కౌలు రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రుణ అర్హత కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఏంటని ప్రశ్నించారు. నాలుగు పంటలకు మద్దతు ధర ఏమైందని నిలదీశారు. దీనిపై ఐక్య ఉద్యమాలకు సన్నద్ధం అవుతున్నామని చెప్పారు.
సంపద మూలకారకులకే ఎక్కువ కష్టాలు
రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి
రైతులు, కూలీలు, కార్మికులు లేకపోతే సంపద లేదని, వారికే ఎక్కువ కష్టాలకు గురవుతున్నారని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రూ.50 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో, రూ.4 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో రైతులకు కేటాయిస్తున్నదని నామమాత్రమేనని తెలిపారు. అభివృద్ధి అంటే ఆస్తులను అమ్మడం, నిరుద్యోగిత, అసమానతలను పెంచడమేనా? అని ప్రశ్నించారు. కేంద్రం నూటికి పది శాతం ఉన్న వారి బాగు కోసం కొత్త చట్టాలను తెచ్చిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు డిక్లరేషన్‌ను ప్రకటించినా భూభారతి, మద్దతు ధరలు ఏవీ సక్రమంగా అమలు కావడం లేదని, పోరాటాల ద్వారానే సాధించుకోవాలని పిలుపునిచ్చారు. అందుకు మహాసభలో కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.
ప్రతికూల పరిస్థితుల్లోనూ పోరాటాలు
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని
తెలంగాణ రైతు సంఘం ప్రతికూల పరిస్థితుల్లోనూ పోరాటాలు నిర్వహిస్తున్నదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు తెలిపారు. కొత్తగూడెంలో సామినేని రామారావునగర్, కాసాని ఐలయ్య ప్రాంగణంలో నిర్వహిస్తున్న మహాసభలో అనేక అంశాలపై తీర్మానాలు చేసి కార్యాచరణ రూపొందించనున్నట్టు తెలిపారు. 2013 భూసేకరణ చట్టం అమలు కోసం చట్టం, రైతు డిక్లరేషన్ అమలు కోసం కార్యాచరణ రూపొందిస్తామన్నారు. భూభారతి ద్వారా భూ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ఉద్యమించేందుకు పోడు సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ చేపట్టనున్నట్టు తెలిపారు. ల్యాండ్ పూలింగ్, ఆదివాసీల సమస్య, వివిధ అంశాలపై రైతు సంఘం చేసిన కృషిని ఈ మహాసభలో సమీక్షించుకుంటామని చెప్పారు.
15న ఉపాధి కార్మికుల సమ్మె
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



