Wednesday, September 16, 2026
E-PAPER
Homeఎడిట్ పేజినా తెలంగాణ గడ్డ

నా తెలంగాణ గడ్డ

- Advertisement -

లడాయి అడ్డా…
నా తెలంగాణ గడ్డ!
ఈ మట్టికి మహత్యం ఉంది,
ఈ నేలకో చరిత్ర ఉంది.
పొలిమేర దాటిన ప్రతి గాలికి
పోరాటపు వాసన ఉంది,
పల్లె దారిలో నడిచే ప్రతి అడుగుకీ
పౌరుషపు జాడ ఉంది.

ఇది కేవలం మట్టి కాదు…
మా తల్లుల కన్నీళ్లతో తడిసిన నేల,
మా తండ్రుల నెత్తుటితో
ఎర్రబడిన నేల,
బానిస సంకెళ్లను తెంచిన
బతుకు బాట నేల.
​​​
గీడ కులం లేదు…
గీడ మతం లేదు…
మనిషే మనిషికి బంధువు!
రామ్ అయినా… రహీం అయినా…
రాబర్ట్ అయినా-
మన రక్తం ఒక్కటే,
మన బతుకు ఒక్కటే,
మన గమ్యం ఒక్కటే!

నైజాం నీడలో
నలిగిన బతుకుల్ని
ఈ నేల ఇంకా మర్చిపోలేదు.
మతం పేరుతో
మనుషుల్ని విడదీసే
గుంటనక్కల గుసగుసలు
జాగ్రత్తగా పసిగట్టాలి.

చరిత్రను వక్రీకరిస్తే
నిజం అబద్ధం అయిపోదు.
రక్తంతో రాసిన పుటల్ని
రాజకీయ రంగుతో చెరపలేరు.
మతోన్మాదపు వాతకు
తగిలిన పుండు
ఒక్క మాటతో మానదు-
మనిషితనం మందుగా
మన ఐక్యతే ఔషధం!

ప్రతి పోరాటంలో ప్రజల శ్వాస ఉంది!​
ఆ శ్వాసను
సంఘటించిన శక్తి-
ప్రజల మధ్య నిలిచిన
కమ్యూనిస్టు ఉద్యమం!

భూమి కోసం, భుక్తి కోసం,
విముక్తి కోసం
నడిచిన అడుగులన్నీ
ఈ నేల జ్ఞాపకాలే!

ఎర్రజెండా అంటే
కేవలం ఒక రంగు కాదు-
కష్టజీవి చెమటకు గౌరవం,
రైతు హక్కుకు భరోసా,
కార్మికుడి శ్రమకు విలువ,
అణగారిన మనిషికి గొంతు.
​ఈ నేలపై
ఎన్ని జెండాలు ఎగిరినా-
కష్టజీవి గుండెలో
ఎర్రజెండా జ్ఞాపకం నిలిచే ఉంటుంది.
ఎందుకంటే…
తెలంగాణ గడ్డ
పోరాటం నేర్పిన గడ్డ!
– కొండూరు భాస్కర్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -