– మతాల కోసం కాదు చరిత్రకు సంఫ్ ముస్లీంలీగ్ వక్రీకరణలు
– శివాజీ భారతజాతికి సింబల్ : ఎస్వీకే వెబినార్‌లో ప్రొఫెసర్ రాం పునియాని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాజుల మధ్య జరిగిన యుద్ధాలు ఆయా రాజ్యాల విస్తరణ కోసం జరిగినవే తప్ప ఆ రాజుల వ్యక్తిగత మతాల విస్తరణకు జరిగినవి కావని ముంబై ఐఐటీ విశ్రాంత అధ్యాపకులు ప్రొఫెసర్ రాం పునియాని తెలిపారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్.వినయ కుమార్ సమన్వయంతో ”ఛత్రపతి శివాజీని ఎందుకు స్మరించుకోవాలి?” అనే అంశంపై ఆదివారం నిర్వహించిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సంఫ్‌ు పరివార్, ముస్లీంలీగ్, హిందూ మహాసభ తదితర సంస్థలు వక్రీకరణలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మనుస్మృతిని తిరిగి అమల్లోకి తెచ్చి బ్రాహ్మణీయ ఆధిక్యతతో తమ పెత్తనం కొనసాగించేందుకు బీజేపీ పరమత ద్వేషం పెంచుతున్నదని విమర్శించారు. శాస్త్రీయత లేకుండా మూఢనమ్మకాలతో నిండిన సమాజాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగా ఛత్రపతి శివాజీతో పాటు అక్బర్, మహారాణా ప్రతాప్ తదితర రాజులకు వారి పేర్లను బట్టి ఆయా మతాలకు ఆ రాజులను చిహ్నాలుగా చూపిస్తున్నారని విమర్శించారు. అయితే ఆ రాజులు ఏ మతాలకు చెందిన వారైనా… వారి సైన్యంలో హిందువులు, ముస్లింలు ఉన్నారని గుర్తుచేశారు. ఇలాంటి విషయాలను పక్కన పెట్టి ఘర్‌వాపసీ పేరుతో ఆర్ఎస్ఎస్ హింసను ప్రేరేపిస్తున్నదని విమర్శించారు. ముస్లింలుగా, క్రైస్తవులుగా హిందువులు మారడానికి సంఫ్‌ు ప్రచారం చేస్తున్న రాజుల పాలన కారణం కాదనీ, హిందూమతంలో ఉన్న కులవ్యవస్థ, అంటరానితనమేనని స్పష్టం చేశారు.
అరబ్ దేశాల నుంచి సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసుకునేందుకు కేరళ మల్ బార్ వచ్చిన వారితో మొదటిసారి అక్కడి హిందువులు ఇస్లాంను స్వీకరించారని తెలిపారు. అదే విధంగా మరి కొందరు హిందువులు క్రైస్తవంలోకి వెళ్లారని తెలిపారు. ఛత్రపతి శివాజీ గొప్ప విలువలతో కూడిన రాజు అని తెలిపారు. ఆ కాలంలో హిందూ జాతీయవాద భావనే లేదనీ, కేవలం నేటి పాలకులు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం నాటి రాజులకు ఈ భావనను అంటగడుతున్నారని కొట్టిపారేశారు. మత రాజకీయ జాఢ్యం పాకిస్తాన్, ఉత్తర భారతదేశంలో ఆందోళనకరస్థాయిలో పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, మహిళలు, పేద వర్గాల సంక్షేమం, మతాలకు అతీతంగా అందరినీ సమానంగా పాలించిన శివాజీని హిందూ జాతీయవాదిగా చిత్రీకరిస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
శివాజీ పాలనలో అనేక మంచి నిర్ణయాలను తీసుకున్నారని తెలిపారు. యుద్ధం జరుగుతన్న సమయంలో, సైన్యం ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్న సందర్భంలో అక్కడ పంట పొలాలకు నష్టం కలిగించవద్దని తన సైన్యాన్ని ఆదేశించారని చెప్పారు. గ్రామాల స్థాయిలో పంటలపై ఇష్టానుసారంగా వేసే పన్నుల విధానాన్ని రద్దు చేసి హేతుబద్దీకరించిన రైతు శ్రేయోభిలాషి శివాజీ అని కొనియాడారు. యుద్ధం గెలిచిన సమయంలో ఇతర మతాలకు చెందిన మహిళలను బందీలుగా తీసుకొస్తే తన సైన్యాన్ని శిక్షించి ఆ మహిళలను తన తల్లులతో సమానమని చెప్పిన గొప్ప వ్యక్తి శివాజీ అని గుర్తుచేశారు.