– 17 ఏండ్ల నాటి భూవివాదంపై హైకోర్టు తీర్పు
హైదరాబాద్ : ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రయివేట్ లిమిటెడ్(ఐఎంజీబీపీఎల్) కంపెనీకి అపద్ధర్మంగా కొనసాగుతున్న నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వం భారీ ఎత్తున భూముల కేటాయింపులను ఆ తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిన విషయం విదితమే. ఈ వివాదంపై హైకోర్టు 17 ఏండ్ల తర్వాత గురువారం తీర్పు చెప్పింది. హైటెక్ సిటీకి సమీపంలోని మామిడిపల్లి, సెంట్రల్ యూనివర్సిటీ, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో ఏకంగా 856 ఎకరాలతో పాటు పలు స్పోర్ట్స్ స్డేడియాలను ఆ కంపెనీకి కట్టబెడుతూ చేసిన ఎంఓయూను వైఎస్ సీఎం అయ్యాక రద్దు చేశారు. 2003లో నారా చంద్రబాబు ప్రభుత్వ చర్యను రద్దు చేస్తూ 2006లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసేందుకు ప్రత్యేకంగా చట్టం తెచ్చింది. ఒక్కరి కోసం చట్టం చేయడాన్ని ఆ కంపెనీ సవాల్ చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఆ కంపెనీకి ఏర్పాటైన వారం రోజులోపే వందల ఎకరాలు, నిర్వహణ ఖర్చులు, బిల్లుల మాఫీ లాంటివి ఇవ్వడాన్ని తప్పు పట్టింది. పిటిషనర్(ఐఎంజీ భారత్)కి రాజ్యాంగ హక్కులు ఏమీ కలగలేదని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం 17 ఏండ్ల సుదీర్ఘ విచారణ తర్వాత గురువారం తీర్పు చెప్పింది.