కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే

– బీఆర్‌ఎస్‌ పాత్ర అత్యంత కీలకం కాబోతోంది
– కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ సాధించి తీరుతాం
– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మెన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే. అందులో బీఆర్‌ఎస్‌ది కీలక పాత్ర కాబోతుంది. కేంద్రం మెడలు ఎలా వంచాలో తెలంగాణకు తెలుసు. కాజీపేటకు రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని సాధించి తీరుతాం. సాధించేదాకా వదిలిపెట్టే ప్రసక్తేలేదు. దశాబ్దాలుగా కాజీపేటకు జరుగుతున్న అన్యాయాన్ని ఇక సహించేది లేదు. దేశంలో కోచ్‌ఫ్యాక్టరీలకు డిమాండ్‌ లేదని చెప్పిన కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఎలా ఏర్పాటు చేస్తున్నారు? ఈ ప్రశ్నకు తెలంగాణ బీజేపీ నేతలు కూడా సూటిగా సమాధానం చెప్పాలి. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన కాజీపేటలో కోచ్‌ఫ్యాక్టరీ అంశాన్ని తప్పుదోవపట్టించి, కేవలం పీవోహెచ్‌ వర్క్‌షాపు అని, ఆ తర్వాత వ్యాగన్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ అంటూ కాజీపేటకు వస్తున్న ప్రధాని మోడీ మోసాన్ని ఓరుగల్లు ప్రజలు గమనిస్తున్నారు.
తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు’ అని మాజీ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. ఈనెల 8న కాజీపేటకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో గురువారం దక్షిణ కొరియా పర్యటన నుంచి వినోద్‌కుమార్‌ పత్రికా ప్రకటనను గురువారం విడుదల చేశారు. దశాబ్దాలుగా కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఇక సహించేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ఓరుగల్లు ప్రజలు పోరుబిడ్డలని, కాజీపేటలో కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేదాకా కేంద్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తేలేదని వినోద్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున కాజీపేటలో కోచ్‌ఫ్యాక్టరీ కావాలని చెప్పి ఉద్యమించారని గుర్తుచేశారు. కాజీపేటలో ఆనాడు సీపీఐ నేతలు భగవాన్‌దాస్‌, కాళీదాస్‌తోపాటు అనేక మంది నాయకులతో కలిసి వరంగల్‌ ప్రాంత ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు ఉద్యమించారని, ఉద్యమిస్తూనే ఉన్నారని తెలిపారు. కాజీపేటకు కావాల్సింది కోచ్‌ఫ్యాక్టరీ మాత్రమేనని, కోచ్‌ఫ్యాక్టరీతోనే ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. వేలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ విషయాన్ని కేంద్రంలోని బీజేపీ గమనించాలని, లేనిపక్షంలో తెలంగాణ ప్రజల చేతిలో బీజేపీ చావుదెబ్బతింటుందని వినోద్‌కుమార్‌ హెచ్చరించారు.

Spread the love