సమగ్ర సాగునీటి ప్రణాళిక కావాలి

A comprehensive irrigation plan is needed– కాళేశ్వరాన్ని పట్టించుకోకుంటే రూ.లక్ష కోట్లు వృధా
– గోదావరి, కృష్ణా ప్రాజెక్టులను సమన్వయం చేసుకోవాలి
– అసెంబ్లీలో సీపీఐ సభ్యుడు కూనంనేని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సమగ్ర ప్రణాళిక కావాలని సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు అన్నారు. చుక్క నీటిని వృద్ధాకానివ్వొద్దనీ, రాష్ట్రావసరాలకు అనుగుణంగా నీటి విధానం తేవాలని కోరారు. శనివారం అసెంబ్లీలో ‘తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల రంగం-శ్వేతపత్రం’అనే అంశంపై లఘు చర్చలో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోపాలపై కాగ్‌ నివేదిక చెప్పినట్టు చర్యలు తీసుకోకుంటే విలువ ఉండదన్నారు. అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉన్నామంటూనే రాష్ట్రంలో జీతాలివ్వలేని పరిస్థితి ఎందుకొచ్చిందని గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను రూ.పది వేల కోట్లతో నిర్మించారని చెప్పారు. ఇప్పుడు కొత్తగా నిర్మించాలంటే ఎంత ఖర్చవుతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. కుంగిపోయిందంటూ కాళేశ్వరం ప్రాజెక్టును వదిలేస్తే రూ.లక్ష కోట్ల వరకు డబ్బు వృధా అవుతుందని అన్నారు. గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులను సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. లేదంటే రాష్ట్రం దుర్భరంగా మారుతుందన్నారు. చిన్నతరహా ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రాధాన్యతనివ్వాలనీ, రూ.రెండు, మూడు వేల కోట్లు అవసరమవుతాయని వివరించారు. రాష్ట్రంలో 27 లక్షల బోర్లున్నాయని చెప్పారు. భూగర్భజలాలను మెరుగుపర్చాలని కోరారు. గిరిజనులు, ఆదివాసీలకు అటవీ హక్కుల పత్రం ఇచ్చారనీ, వారిని బోర్లు వేయనివ్వడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుమతి ఇవ్వాలన్నారు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులకు తొలుత నిర్మించాలని చెప్పారు.

Spread the love