ఆశలు… ఆకాంక్షల ‘దశాబ్ది’

ఆర్టీసీలాంటి సంస్థలు తమ కాళ్ల మీద తాము నిలబడే విధంగా వాటికి ఊతమివ్వాలి. ఇది జరగాలంటే ఆయా సంస్థలకు ఇవ్వాల్సిన బకాయిలను తిరిగి చెల్లించాలనే స్పృహ సర్కారు కలిగుండాలి. ఉమ్మడి రాష్ట్రంలో మూసేసిన అనేక ఫ్యాక్టరీలు, మిల్లులను తెరిపిస్తామంటూ గులాబీ సర్కారు గతంలో ప్రజలకు హామీనిచ్చింది. ఇందులో వరంగల్‌ ఆజాంజాహీ మిల్‌, నిజాం షుగర్స్‌, ఆదిలాబాద్‌ సీసీఐ, హైదరాబాద్‌లోని డీబీఆర్‌ లాంటివి ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు నేటితో ముగియనున్నాయి. మూడు వారాలపాటు ఇటు ప్రభుత్వం, అటు ప్రభుత్వ యంత్రాంగం రోజుకో రంగానికి సంబంధించిన సంబురాల్లో తలమునకలయ్యాయి. పల్లె నుంచి పట్నం దాకా, ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకూ ఆయా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. ముగింపు వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ చెంతన, నూతన సచివాలయానికి ఎదురుగా నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారక కేంద్రం నేడు ఆవిష్కృతం కానుంది.
ఇలా దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించుకున్న మనం తెలంగాణ ఉద్యమ ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలను ఒక్కసారి మననం చేసుకోవాలి. నీళ్లు, నిధులు, నియామకాలనే ప్రధాన డిమాండ్ల పరంపరగా కొనసాగిన ప్రస్థానంలో… వాటిని నెరవేర్చామా..? లేదా..? అన్నది పాలకులు తమకు తాముగా ప్రశ్నించుకోవాలి. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో ప్రజలకు సమానావకాశాలిచ్చి వారిని సమున్నతంగా నిలబెట్టగలిగామా..? లేదా..? అనే విషయంపై కూడా వారు ఆత్మావలోకనం చేసుకోవాలి. జనాభాలో 90శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉన్న తెలంగాణలో వారు అభివృద్ధి చెందకుండా రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి సాధ్యం కాదన్న వాస్తవాన్ని గుర్తెరగాలి.
ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి అంటే హైదరాబాద్‌ చుట్టూనే తిరిగేది. దానికి అనుగుణంగానే నేతల మాటలు, చేతలూ ఉండేవి. తెలంగాణ వచ్చిన తర్వాత అందుకు భిన్నమైన అభివృద్ధి ప్రణాళిక ఉండాలని అందరూ ఆశించారు. కేవలం రాజధాని నగరంలో హైవేలు, స్కైవేలు, ఫ్లైవోవర్లు నిర్మించినంత మాత్రాన మొత్తం 33జిల్లాలు అభివృద్ధి చెందజాలవు. అవన్నీ అభివృద్ధిలో భాగమే. కానీ అదే పూర్తిస్థాయి అభివృద్ధి అనిపించుకోదు. మరోవైపు వ్యవసాయంతో పాటు ఇతర అనేక రంగాల్లో యాంత్రీకరణ శరవేగంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలకు, ముఖ్యంగా యువతకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను కల్పించటంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. లేదంటే ఇప్పుడు మనం చెబుతున్న అభివృద్ధి ‘ఉపాధి రహిత అభివృద్ధి’ అనే అపప్రదను తెస్తుంది. అది ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలేస్తుంది.
కేంద్రంలో ఆరెస్సెస్‌ కనుసన్నల్లో నడుస్తున్న మోడీ సర్కార్‌… ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ బడా బాబులకు కారు చౌకగా కట్టబెడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం కట్టాలె. అలా నడుం కట్టటమే గాదు… తన పరిధిలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేసేందుకు తగినన్ని నిధులు కేటాయించాలి. ఆర్టీసీలాంటి సంస్థలు తమ కాళ్ల మీద తాము నిలబడే విధంగా వాటికి ఊతమివ్వాలి. ఇది జరగాలంటే ఆయా సంస్థలకు ఇవ్వాల్సిన బకాయిలను తిరిగి చెల్లించాలనే స్పృహ సర్కారు కలిగుండాలి. ఉమ్మడి రాష్ట్రంలో మూసేసిన అనేక ఫ్యాక్టరీలు, మిల్లులను తెరిపిస్తామంటూ గులాబీ సర్కారు గతంలో ప్రజలకు హామీనిచ్చింది. ఇందులో వరంగల్‌ ఆజాంజాహీ మిల్‌, నిజాం షుగర్స్‌, ఆదిలాబాద్‌ సీసీఐ, హైదరాబాద్‌లోని డీబీఆర్‌ లాంటివి ఉన్నాయి. ఇవి ఒకప్పుడు వేలాది మందికి ఉపాధి కల్పించి.. వారి కుటుంబాలకు బువ్వపెట్టాయి. వాటిని తిరిగి ప్రారంభించటం ద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాల్సిన బృహత్తర బాధ్యత సర్కారుపై ఉన్నది.
తెలంగాణ గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీక. విప్లవాలకు ఊపిరిలూదిన ఈ నేలపై మత సామరస్యం వెల్లివిరిస్తుంది. హైదరాబాద్‌ నగరం భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న సాంప్రదాయల కలబోత. ఇవన్నీ కలిసి అందమైన ఒక పూల బొకేను తలపిస్తాయి. ఇలాంటి పూలు పొదిగిన తెలంగాణలో మతం పేరిట విషం చిమ్మేందుకు, మత పిచ్చి రగిల్చి చిచ్చు పెట్టేందుకు దుష్ట శక్తులు పన్నాగాలు పన్నుతున్నాయి. రాబోయేది ఎన్నికల కాలం. ఈ క్రమంలో తాము రాజకీయ చలి కాచుకోవటం కోసం ఆయా శక్తులు మతం పేరిట ప్రజల మధ్య చీలికలు తెచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తాయి. అమరవీరులను యాది చేసుకుంటూ, వారి స్ఫూర్తితో దశాబ్ది వేడుకలను నిర్వహించు కుంటున్న తరుణంలో ఆయా శక్తుల పట్ల అత్యంత జాగరూకతతో ఉండాలి. అదే మన రాష్ట్రానికి, ప్రజలకు రక్ష.

Spread the love