నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం

– సీపీఐ(ఎం) ఏపీ ప్రతినిధి బృందానికి ఏపీ మంత్రి అంబటి రాంబాబు హామీ
– పోలవరం వరద ముంపు ప్రాంతాలకు
ఆర్‌అండ్‌ఆర్‌ ఇవ్వాలి : సీపీఐ(ఎం)
అమరావతి : పోలవరం నిర్వాసితులకు పునరావాసం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీకి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం తప్పక పరిష్కరిస్తుందని, వచ్చేవారం రాజమండ్రిలో నిర్వాసితుల సమస్యలను పూర్తిస్థాయిలో చర్చించేందుకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు హామీ ఇచ్చారు. బుధవారం విజయవాడలోని జలవనరులశాఖ మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని నెల్లిపాక నుండి విజయవాడ వరకు ‘పోలవరం పోరుకేక’ పేరుతో మహా పాదయాత్ర చేపట్టిన సీపీఐ(ఎం) ఏపీ ప్రతినిధి బృందంతో మంత్రి అంబటి రాంబాబు, అధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆర్‌ఆండ్‌ఆర్‌ కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌, పోలవరం స్పెషల్‌ కలెక్టర్‌ సరళా వందనంతో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, వి వెంకటేశ్వర్లు, రంపచోడవరం, ఏలూరు జిల్లాల సిపిఎం నాయకులు బి కిరణ్‌, ఎ రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాదయాత్రలో గుర్తించిన సమస్యలను మంత్రి అంబటి రాంబాబుకు వి శ్రీనివాసరావు వివరించారు. పోలవరం ప్రాజెక్టు పరిధిలో పునరావాస సమస్యలు 2007 నుండి అలాగే కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న కాంటూరు లెవల్స్‌ 41.15 మీటర్లు, 45.72 మీటర్లకు మించి 2022 వరదల్లో ముంపునకు గురైందన్నారు. చాలా గ్రామాలతోపాటు నిర్వాసితుల కోసం నిర్మించిన పునరావాస కాలనీలూ ముంపునకు గురయ్యాయంటే అధికారులు చెబుతున్న కాంటూరు లెక్కలపై అనుమానాలు కలుగుతున్నాయని వివరించారు. వరద ముంపు గ్రామాలన్నిటికీ కచ్ఛితంగా ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. లైడార్‌ సర్వే చేపట్టాక ముంపుపై కచ్ఛితత్వం రావడం లేదని అధికారులు క్షేత్రస్థాయిలో మరోసారి సమగ్రంగా ముంపుపై సర్వే చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. అసైన్డ్‌, అటవీ, పోడు భూములకు సంబంధించిన సమస్యలను సానుకూలంగా పరిశీలించి నష్టపరిహారం చెల్లించాలని శ్రీనివాసరావు కోరారు. ఇందుకు రిహబిలిటేషన్‌ అండ్‌ రీ సెటిల్‌మెంట్‌ (ఆర్‌అండ్‌ఆర్‌) కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ జోక్యం చేసుకుంటూ వరదలతో మునిగిన ప్రాంతాలన్నిటికీ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని చట్టంలో లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు అంగీకరించడం లేదన్నారు. దీనిపై వి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాకే కొత్తగా ముంపు ఏర్పడినందున ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు. 1986లో వచ్చిన వరదలు 2022 కంటే పెద్ద వరదలు అని, అయినా అప్పుడు ఇంతటి నష్టం వాటిల్లలేదని తెలిపారు.

Spread the love