జమ్మూలో ఘోర ప్రమాదం

– బ్రిడ్జి పై నుంచి నదిలోపడ్డ బస్సు
– 10 మంది వైష్ణోదేవీ యాత్రికులు మృతి
– 52 మందికి గాయాలు
– బాధితులోల అత్యధికులు బీహార్‌ వాసులే
– రాష్ట్రపతి, ప్రధాని, ఏచూరి ప్రభృతుల సంతాపం
జమ్ము/న్యూఢిల్లీ : జమ్ములో మంగళవారం నాడు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వైష్ణోదేవీ ఆలయ సందర్శనకు వెళ్తున్న యాత్రీకుల బస్సు కాత్రా ప్రాంతంలోని ఒక బ్రిడ్జిపై నుంచి నదిలో పడిపోవడంతో పది మంది చనిపోయారు. మరో 57 మంది గాయపడ్డారు. అమృత్‌సర్‌ నుంచి కాత్రా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని జమ్ము ఎస్‌ఎస్‌పి చందన్‌ కొహ్లి చెప్పారు. జమ్ము జిల్లాలోని కాత్రాకు 15 కిలోమీటర్ల దూరంలో ఝజ్జర్‌ కొట్లీ దగ్గర బస్సు వంతెనపై నుంచి పడిపోయిందని ఆయన తెలిపారు. క్షతగాత్రులను జమ్ము వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితుల్లో అత్యధికులు బీహార్‌ వాసులే. వైష్ణోదేవీ యాత్రికుల మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సిపిఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరీ, బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌, జమ్ముకాశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నరు మనోజ్‌ సిన్హా తదితరులు తీవ్ర సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు జమ్ముకాశ్మీర్‌ అడ్మినిస్ట్రేషన్‌ రూ.5 లక్షల చొప్పున, బీహార్‌ ప్రభుత్వం రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాయి. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించాలని, మృతుల కుటుం బాలకు జమ్ముకాశ్మీర్‌ అడ్మినిస్ట్రేసన్‌ న్యాయమైనరీతిలో పరిహారం అందజేయాలని ఏచూరి డిమాండ్‌ చేశారు. మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగివుంటుందని డిజిపి దిల్‌బాగ్‌ సింగ్‌ చెప్పారు. రాత్రిబవళ్లూ ఒకరే బస్సు నడపటం, పూట బస్సు నడపడం, అతివేగం ప్రమాదానికి కారణమై వుండవచ్చునని, పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడవుతాయని తెలిపారు.

Spread the love