ఏకీకృత సిద్ధాంతం దేశానికి ప్రమాదం

A unified doctrine is a danger to the nation– ఆదివాసీ గిరిజన హక్కులకు భంగం
– ఐక్య ఉద్యమాలతోనే వెనక్కి కొట్టగలం : ఆర్మ్‌ నాలుగో జాతీయ మహాసభలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏకీకృత సిద్ధాంతాన్ని గిరిజనులపై బలవంతంగా రుద్దుతున్నదని కేరళ పరిశ్రమల శాఖ మంత్రి పి రాజీవ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడులోని నమక్కల్‌ జిల్లా కేంద్రంలో మంగళవారం ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ (ఆర్మ్‌) జాతీయ నాలుగో మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆర్మ్‌ జాతీయ చైర్మెన్‌, మాజీ పార్లమెంట్‌ సభ్యులు డాక్టర్‌ మిడియం బాబురావు సంఘం జెండాను ఆవిష్కరించారు. తమిళనాడులోని వివిధ గిరిజన ప్రాంతాలనుంచి తీసుకొచ్చిన అమరవీరుల జ్యోతిని బృందా కారత్‌, బాబురావు, జతిన్‌ చౌదరిలకు అందజేశారు. అనంతరం రాజీవ్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాల ఫలితంగా తరతరాలుగా గిరిజనులు అనుసరిస్తున్న సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు కనుమరగయ్యే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలను కాలరాసే విధంగా నూతన చట్టాలను కేంద్రం తీసుకొస్తున్నదని విమర్శించారు. అడవులు, అటవీ సంపదను అంబానీ, ఆదానీ లాంటి కార్పొరేట్లకు కట్టబెడుతూ అటవీ సంరక్షణ నియమాల చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. కామన్‌ సివిల్‌ కోడ్‌ పేరుతో వివిధ తెగలు, జాతులు,మతాల ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ప్రయత్నిస్తున్నాయని విమ ర్శించారు. బాబురావు మాట్లాడుతూ మణిపూర్‌ హింసకు బీజేపీయే బాధ్యత వహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని విమర్శించారు. పేదలు మత ఉన్మాదంలో కాలిపోతుంటే.. ఆ మంటలతో ఆ పార్టీ చలికాచుకుంటున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో గిరిజన తెగల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా గిరిజన తెగలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.మహాసభలో సంఘం జాతీయ కన్వీనర్‌ జతిన్‌ చౌదరి, బృందాకారత్‌, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌, దళిత సోషల్‌ ముక్తి మంచ్‌ జాతీయ నాయకులు సామ్యేల్‌రాజ్‌, ఐద్వా జాతీయ ఉపాధ్యక్షులు సుమతి, మాజీ ఎంపీ పులిన్‌ బస్కి, త్రిపుర మాజీ మంత్రి జమాతియ, తెలంగాణ టీజీఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మానాయక్‌, ఆర్‌ శ్రీరాంనాయక్‌,ఏటీజీఎస్‌ ప్రధాన కార్యదర్శి పూసం సచిన్‌, తొడసం బీంరావ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love